రేవంత్ పిటిషన్‌పై వివరణ ఇవ్వండి
స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు, అసెంబ్లీ కార్యదర్శికి కూడా..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం శాసనసభ పక్ష నేత అనుముల రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
శాసన సభ వ్యవహారాలు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తనను సస్పెండ్ చేశారని.. స్పీకర్ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ రేవంత్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు మరోసారి విచారణ జరిపింది. రేవంత్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారంటూ బడ్జెట్ సమావేశాల నుంచి పిటిషనర్‌ను సస్పెండ్ చేశారన్నారు.
గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగించిన సభ్యుడిని సస్పెండ్ చేయొచ్చని నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నరే సభకు నేతృత్వం వహిస్తారని, అప్పుడు జరిగేవి సభావ్యవహా రాలు కాదని, ఆ విషయంలో స్పీకర్ నిర్ణయాలు తీసుకోవ డానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయ మూర్తి అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌లకు నోటీసులు జారీ చేశారు.
అమికస్ క్యూరీ సాయం అవసరం లేదు
స్పీకర్ తరఫున నోటీసులు తీసుకుంటు న్నారా? అని ఏజీ కార్యాలయ జీపీ శరత్‌ను కోర్టు ప్రశ్నించగా, తీసుకోవడం లేదని.. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకుడిగా (అమి కస్ క్యూరీ) ఏజీ వ్యవహరిస్తారని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ, తమకు అమికస్ క్యూరీ సాయం అవసరం లేదన్నారు.