ఏ అవకాశాన్నీ వదలొద్దు!  | TRS Confident Over Majority In Telangana Municipal Elections 2020 Results | Sakshi
Sakshi News home page

ఏ అవకాశాన్నీ వదలొద్దు! 

Published Sat, Jan 25 2020 1:28 AM | Last Updated on Sat, Jan 25 2020 1:28 AM

TRS Confident Over Majority In Telangana Municipal Elections 2020 Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామనే ధీమాతో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల వ్యవధిలో వెలువడనుండగా... 95 శాతానికి పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకుంటామనే విశ్వాసాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రీ, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలతోపాటు పోలింగ్‌ తర్వాత పార్టీ ఇన్‌చార్జిల నుంచి అందిన నివేదికలను క్రోడీకరించిన టీఆర్‌ఎస్‌ అధిష్టా నం ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనే అంచనా వేస్తోంది. మేయర్, చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన అన్ని అవకాశాల ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 22న పోలింగ్‌ జరగ్గా, నిజామాబాద్, బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో విపక్షాల నుంచి కొంతపోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది.

వడ్డేపల్లి, నందికొండలో కాంగ్రెస్, జల్‌పల్లి, భైంసాలో ఎంఐఎం, తుక్కుగూడ, ఆమనగల్‌ మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీని ఇచ్చినా చివరకు ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తాయని లెక్కలు వేస్తోంది. ఫలితాల వెల్లడి తర్వాత పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా చూసుకోవడంతోపాటు, అవసరమైనచోట మద్దతుకు వ్యూహాన్ని ఖరారు చేసిం ది. సంఖ్యాబలం తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలను ఎక్స్‌అఫీ షియో సభ్యులుగా నమోదు చేయడం ద్వారా, చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. ఎక్స్‌అఫీషియోలుగా ఎక్కడెక్కడ నమోదు చేసుకోవాలనే దానిపై ఎన్నికైన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.  

విప్‌ జారీ అధికారం ఎమ్మెల్యేలకు... 
దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన ప్రధాన కార్యదర్శులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ ఆదేశించింది. పార్టీ తరఫున గెలుపొందిన వారు చేజారకుండా చూసుకోవడంతోపాటు, పార్టీ నిర్ణయించిన వారిని చైర్మన్, మేయర్‌గా ఎన్నుకునేలా ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసే అధికారం కల్పించారు. ఈ మేరకు విప్‌ జారీకి ఏ, బీ ఫారాలను సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ శుక్రవారం అందజేశారు. ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి విప్‌ జారీ అధికారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.  

అవసరమైన చోట క్యాంపులు... 
మున్సిపల్‌ చైర్మన్, మేయర్‌ పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ ఉన్న చోట పార్టీ తరఫున గెలుపొందిన వారిలో చీలిక రాకుండా నివారించడంతో పాటు, విపక్ష పార్టీలు ఎక్కువ స్థానాలు సాధించే మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రెబెల్స్‌ బరిలో ఉన్నచోట మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వారి మద్దతు కూడా టీఆర్‌ఎస్‌ మేయర్, చైర్మన్‌ అభ్యర్థులకే లభించేలా చర్యలు చేపట్టనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పాటు పార్టీ తరఫున గెలుపొందిన వారిని అవసరమైన క్యాంపులకు తరలించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలను తెలంగాణ భవన్‌ నుంచి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ పర్యవేక్షించింది. శనివారం మున్సిపాలిటీల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు పార్టీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement