ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ చరిత్రలో మూడో పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధంమైంది. యాభై రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీగా మార్చారు. సుమారు 44 సంవత్సరాలు గ్రామపంచాయతీగా కొనసాగిన అనంతరం తిరిగి 2006 మే 26న నాటకీయ పరిణామాలమధ్య మున్సిపాలిటీగా మార్చారు.
తొలి మున్సిపల్ చైర్మన్ కేవీ నరసింహారెడ్డి
1956 నుంచి 1962 వరకు ఆర్మూర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్‌గా కేవీ నరసింహారెడ్డి ఎన్నికైయ్యారు. తరువాత గ్రామపంచాయతీగా మారింది. 2001 నుంచి 2006 వరకు గ్రామ పంచాయతీకి చివరి సర్పంచ్‌గా కొంగి సదాశివ్ బాధ్యతలు నిర్వహించారు. తిరిగి ఆర్మూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తరువాత మొదటి సారిగా 2008లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గానికి మూడో పర్యాయము మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
వార్డులు - 36
ఓటర్లు - 55,016
పురుషులు - 26,601
మహిళలు - 28,413
ఇతరులు - 02
పట్టణ జనాభా - 67,252
చైర్‌పర్సన్ రిజర్వేషన్ - బీసీ మహిళ
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డి పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం పోలింగ్ నిర్వహించి ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విలీన గ్రామాలైన పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లిని కలుపుతూ ఆర్మూర్ పట్టణ జనాభా 67, 252గా ఉంది. పట్టణంలో మొత్తం ఓటర్లు 36 వార్డులకు 55,016 మంది కాగా అందులో పురుషులు 26, 601 మంది, మహిళలు 28,413 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
బీసీ ఓటర్లే అధికం
మొత్తం ఓటర్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలుగా విభజించగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు 44,727 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 21,520 మంది ఓటర్లు, మహిళలు 23,207 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,518 మంది కాగా వీరిలో పురుషులు 2,104 మంది, మహిళలు 2,414 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 664 మంది కాగా అందులో పురుషులు 313 మంది, మహిళలు 351 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఓసీ ఓటర్లు 5,105 మంది కాగా అందులో పురుషులు 2,663 మంది, మహిళలు 2,442 మంది ఉన్నారు. 24వ వార్డులో అత్యధికంగా 1,714 మంది ఓటర్లు ఉండగా 9వ వార్డులో అత్యల్పంగా 1,348 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment