తెలంగాణ ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల తొలి ఫలితం శని వారం ఉదయం 10 గంటల కల్లా వెల్లడవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి చెప్పారు. సాయంత్రానికి 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌ల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామన్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు అవసరమైన మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఈసీ అధికారులు అశోక్, జయసింహారెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, ఎన్నిక పూర్తయ్యే వరకు అది కొనసాగుతుందన్నారు. ఇందులో అభ్యర్థులపై వ్యయ పరి మితి ఉండదని, వర్గాల మధ్య వైరం ఏర్పడేలా, గొడవలకు దారితీసేలా ప్రవర్తనా, తీరు ఉండరాదని, సాధారణ కోడ్‌లోని ఇతర అంశాలు వర్తిస్తా యన్నారు. అధికార పార్టీకి ఎక్కువ నిబంధనలు వర్తిస్తాయని, మద్దతు కోసం కాంట్రాక్ట్‌లు, పదవులు ఇస్తామనే వాగ్దానాలు చేయరాదని అన్నారు.
వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు..
ఈ నెల 27న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు/డిప్యూటీ చైర్‌పర్సన్లను ఎన్నుకుంటారని నాగిరెడ్డి తెలిపారు. పరోక్ష పద్ధతుల్లో జరగనున్న ఈ ఎన్ని కల కోసం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో గెజిటెడ్ అధికారిని రిటర్నింగ్ అధికారిగా సంబంధిత జిల్లా కలెక్టర్లు నియమిస్తారని, వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. శనివారం కౌంటింగ్ ముగియగానే మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని గెలిచిన సభ్యులు, ఎక్స్ అఫీషియోలుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆర్వోలు నోటీసులిస్తారని తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులు తమ నియోజకవర్గ లేదా ఇతరత్రా పరిధిలోనే ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో ఏదో ఒకచోట మాత్రమే సభ్యులుగా చేరి తమ ఓటును ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటు ఈ నెల 29న కరీంనగర్ మేయర్/డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఉంటుందని చెప్పారు.
ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడే..
మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగాయని, ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఎక్స్ అఫిషియోలుగా ఉన్న వారు ఏదో ఒక చోట మాత్రమే నమోదు చేసుకుని ఓటేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఒకచోట ఆప్షన్ ఇచ్చాక దానికి మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు ముగిసే లోగా ఆప్షన్లు ఇస్తే మంచిదని చెప్పారు.
సమాన ఓట్లు వస్తే లాటరీ..
ఎక్కడైనా ఇద్దరు అభ్యర్థులకు (సభ్యుల ఎన్నిక, మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికతో సహా) సమానమైన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తామని నాగిరెడ్డి చెప్పారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, డిప్యూటీ చైర్‌పర్సన్లుగా పేర్లను ప్రతిపాదిస్తూ సంబంధిత రాజకీయ పార్టీలు ఫారం–ఏలను 26న ఉదయం 11 గంటల కంటే ముందుగా, ఫారం–బీలను 27న ఉదయం 10 గంటల్లోగా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో ఎవరికి విప్ అధికారాన్ని కల్పిస్తున్నారో తెలియజేస్తూ రాజకీయ పార్టీల బాధ్యులు 26న ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగానే ఉందని, 2014లో మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల శాతం 75.82తో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 74.40 శాతంగా కార్పొరేషన్లలో గతంలోని 60.63 శాతంతో పోల్చితే ఇప్పుడు 58.83 శాతం నమోదైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment