v nagireddy
-
పదింటి కల్లా తొలి ఫలితం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల తొలి ఫలితం శని వారం ఉదయం 10 గంటల కల్లా వెల్లడవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి చెప్పారు. సాయంత్రానికి 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామన్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు అవసరమైన మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఈసీ అధికారులు అశోక్, జయసింహారెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, ఎన్నిక పూర్తయ్యే వరకు అది కొనసాగుతుందన్నారు. ఇందులో అభ్యర్థులపై వ్యయ పరి మితి ఉండదని, వర్గాల మధ్య వైరం ఏర్పడేలా, గొడవలకు దారితీసేలా ప్రవర్తనా, తీరు ఉండరాదని, సాధారణ కోడ్‌లోని ఇతర అంశాలు వర్తిస్తా యన్నారు. అధికార పార్టీకి ఎక్కువ నిబంధనలు వర్తిస్తాయని, మద్దతు కోసం కాంట్రాక్ట్‌లు, పదవులు ఇస్తామనే వాగ్దానాలు చేయరాదని అన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు.. ఈ నెల 27న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకుంటారని నాగిరెడ్డి తెలిపారు. పరోక్ష పద్ధతుల్లో జరగనున్న ఈ ఎన్ని కల కోసం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో గెజిటెడ్ అధికారిని రిటర్నింగ్ అధికారిగా సంబంధిత జిల్లా కలెక్టర్లు నియమిస్తారని, వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. శనివారం కౌంటింగ్ ముగియగానే మేయర్, చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని గెలిచిన సభ్యులు, ఎక్స్ అఫీషియోలుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆర్వోలు నోటీసులిస్తారని తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులు తమ నియోజకవర్గ లేదా ఇతరత్రా పరిధిలోనే ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఏదో ఒకచోట మాత్రమే సభ్యులుగా చేరి తమ ఓటును ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటు ఈ నెల 29న కరీంనగర్ మేయర్/డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడే.. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగాయని, ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఎక్స్ అఫిషియోలుగా ఉన్న వారు ఏదో ఒక చోట మాత్రమే నమోదు చేసుకుని ఓటేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఒకచోట ఆప్షన్ ఇచ్చాక దానికి మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు ముగిసే లోగా ఆప్షన్లు ఇస్తే మంచిదని చెప్పారు. సమాన ఓట్లు వస్తే లాటరీ.. ఎక్కడైనా ఇద్దరు అభ్యర్థులకు (సభ్యుల ఎన్నిక, మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికతో సహా) సమానమైన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తామని నాగిరెడ్డి చెప్పారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్లుగా పేర్లను ప్రతిపాదిస్తూ సంబంధిత రాజకీయ పార్టీలు ఫారం–ఏలను 26న ఉదయం 11 గంటల కంటే ముందుగా, ఫారం–బీలను 27న ఉదయం 10 గంటల్లోగా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో ఎవరికి విప్ అధికారాన్ని కల్పిస్తున్నారో తెలియజేస్తూ రాజకీయ పార్టీల బాధ్యులు 26న ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగానే ఉందని, 2014లో మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల శాతం 75.82తో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 74.40 శాతంగా కార్పొరేషన్లలో గతంలోని 60.63 శాతంతో పోల్చితే ఇప్పుడు 58.83 శాతం నమోదైందని చెప్పారు. -
ఆధారాలుంటే.. గెలిచినా అనర్హత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌లో ఒక్క దొంగ ఓటు నమోదైనా రీపోలింగ్ నిర్వహణకు అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. టెండర్ ఓటింగ్ నమోదైతే.. దొంగ ఓట్లు పడినట్లు రుజువు అవుతుందని అలాంటి ప్రాంతాల్లో తప్పకుండా రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇతరులు ఎవరైనా తమ ఓటును వేస్తే టెండర్ ఓటు కోసం డిమాండ్ చేసి ఓటేయాలని, ఈ ఓట్లపై ఆర్వోలు తమ దృష్టికి తీసుకురాగానే రీపోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. పలు అంచెల్లో ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తున్నామని, దొంగ ఓట్లు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగ ఓట్లు వేసే వారితో పాటు వారికి సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ జయసింహారెడ్డితో కలసి కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ధనప్రవాహం పెరుగుతోందని 2, 3 రోజులుగా ›ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, అయితే వీటి నియంత్రణకు ఫ్లయింగ్స్క్వాడ్స్తో పాటు తనిఖీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్రమైన నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్)కిందకు వస్తున్నా, ఎన్నికల్లో రాజకీయ నేతల డబ్బుల పంపిణీ కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకు రాకపోవడంతో సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. భైంసాలో దాదాపు మామూలు పరిస్థితులు ఏర్పడటంతో బుధవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అక్కడ అదనపు బలగాలతో పాటు మైక్రో అబ్జర్వర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు రూ.44.41 కోట్ల నగదు జప్తు చేశామన్నారు. రూ.16.25 లక్షల విలువగల ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ధనప్రవాహం అరికట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎక్కడెక్కడ అవకాశం ఉందనే దానిపై రాజకీయపార్టీల అభ్యర్థులకే తెలిసే అవకాశం ఉందని, అందువల్ల నిఘా పెట్టాల్సింది వారేనన్నారు. ఇటీవల పెద్దపల్లి మున్సిపాలిటీలో డబ్బు పంపిణీ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడంతో ఆ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు చేసే అవకాశం చిక్కిందన్నారు. గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లో ఇలాంటి మరో ఘటన ఈసీ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రతీ ఓటు ముఖ్యమైనదే.. ప్రతీ ఓటు ముఖ్యమైందేనని గుర్తించి, ప్రతి ఒక్కరూ ఓటేయాలని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 55 వేల మంది సిబ్బంది వ్యయ ప్రయాసలకోర్చి పనిచేస్తున్నందున అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సమయమున్నందున ఓటర్లంతా సాఫీగా, వేగంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎస్ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. పోలింగ్స్టేషన్ల పరిధి కూడా చిన్నదిగా ఉందని, అందువల్ల ఉదయం 7 నుంచి 10 గంటల లోపు ఓటేసి తమ పనులకు వెళ్లొచ్చన్నారు. ఐదేళ్ల పాటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే అధికారాన్ని గెలిచే వారికి కట్టబెడుతున్నందున మంచి వ్యక్తులను గెలిపించాలని కోరారు. వ్యాపారులు, డబ్బు వెదజల్లేవారు గెలిస్తే ఓటర్లకు అందుబాటులో ఉంటారా లేదా తాగునీరు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లు, బిల్డింగ్ పర్మిషన్లు, ప్లేగ్రౌండ్ వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తారా లేదా అన్నది దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారుల వద్ద ఆ వార్డులో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ రికార్డు, ఇతరత్రా సమాచారం అందుబాటులో ఉంటుందని, వాటిని నోటీస్ బోర్డుపైనా ఉంచుతారని చెప్పారు. దీంతో వారి గురించి తెలుసుకుని ఓటేయాలని కోరారు. వార్డుల్లో సరాసరి 1,500 నుంచి 1,700 దాకా ఓట్లు ఉంటాయని, అందులో నాలుగైదు వందల మంది ఓట్లేయకపోవడంతో 10 ఓట్లతోనే గెలిచే సందర్భాలుంటాయని అందువల్ల ఓటర్లంతా పాల్గొంటే మంచి ఫలితం వస్తుందన్నారు. మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని నాగిరెడ్డి చెప్పారు. బుధవారమే జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్‌పుర డివిజన్ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు. -
స్టార్ క్యాంపెయినర్ల ఖర్చు పార్టీ, అభ్యర్థి ఖాతాలోనే
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు తమ వద్ద రిజిస్టర్ చేసుకున్న రాజకీయ పార్టీల నుంచి 20 మంది నాయకులకు, గుర్తిం పు లేని పార్టీలకు చెందిన ఐదుగురు నాయకులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పన లేదా అనుమతి కల్పించింది. స్టార్ క్యాంపెయినర్లుగా గుర్తించిన వారు సంబంధిత పార్టీ/దాని తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఈ అనుమతి కోసం రాజకీయ పారీ్టలు బయోడేటా, ఐడెంటిటీ కార్డు (ఓటరు గుర్తింపునకు ఎస్ఈసీ నోటీఫై చేసిన కార్డుల్లో ఏదో ఒ కటి) ప్రతితో స్టార్ క్యాంపెయినర్ల జా బితాలను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన 3 రోజుల్లోగా రాష్ట్ర అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు సమరి్పంచాలి. దీని ప్రతిని ఎస్ఈసీకి మార్కుచేయాలి. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను సమాచారం నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు/సహాయ జిల్లా అధికారులకు మున్సిపల్ డైరెక్టర్ పంపిస్తారు. స్టార్ క్యాంపెయినర్లకు వాహనాల అనుమతి ఇచ్చే అధికారాన్ని కూడా మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు ఎస్ఈసీ కలి్పంచింది. ఎస్ఈసీ నోటిఫికేషన్లో ని ఫార్మాట్ ప్రకారం స్టిక్కర్‌తో కూడిన అనుమతిపత్రాన్ని ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఫొటో వాడినా అభ్యర్థి ఖాతాలోనే.. స్టార్ క్యాంపెయినర్లకు అయ్యే ఖర్చును సంబంధిత పార్టీ లేదా అభ్యర్థి వ్యయానికయ్యే ఖాతాలో చూపాల్సి ఉంటుంది. ఈ ప్రచారకర్తల రవాణా ఖర్చులను సంబంధిత పారీ్టనే భరించాల్సి ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్ లేదా ఇతర నేతల ర్యాలీ లేదా సభా వేదికపై సదరు అభ్యర్థి లేదా అతడి ఏజెంట్ పాల్గొంటే ర్యాలీకయ్యే మొత్తం ఖర్చును (స్టార్ క్యాంపెయినర్ రవాణా చార్జీలు మినహాయించి) అభ్యర్థి ఎన్నికల వ్యయంలో కలుపుతారు. ఒకవేళ అభ్యర్థి పాల్గొనకపోయినా అతడి పోస్టర్లు, ఫొటోలుంటే కూడా ఈ వ్యయాన్ని ఆయన ఖాతాలోనే వేస్తారు. ఈ ర్యాలీలు, సభల్లో ఒకరికంటే ఎక్కువమంది అభ్యర్థులు పాల్గొంటే ఖర్చును ఆ మేరకు విభజించి వారి ఎన్నికల వ్యయంలో కలుపుతారు. -
4న తుది ఓటర్ల జాబితా.. 6వరకు ఓటు నమోదుకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టంలోని 195, 197 సెక్షన్లకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే ఈనెల 24న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని స్పష్టంచేశారు. షెడ్యూల్ జారీ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కొత్త పద్థతి పాటించిందని, నోటిఫికేషన్‌ను వచ్చేనెల 7న బహిర్గతం చేయాల్సి ఉండగా, షెడ్యూల్‌ను ముందుగానే 24న విడుదల చేసిందని.. తద్వారా పార్టీలు, ఓటర్లను ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసినట్టు అయిందన్నారు. ఎస్ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంతో కుమ్మక్కై తొందరపాటుతో షెడ్యూల్ జారీ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చట్టం, ఎస్ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. జనవరి 6 వరకు ఓటు నమోదు.. అసెంబ్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రాతిపదికన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైందని నాగిరెడ్డి తెలిపారు. ఎస్ఈసీ వెబ్సైట్లో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకుని, ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 2 వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మున్సిపల్ ఓటర్ల జాబితాలో లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తే మున్సిపల్ కమిషనర్లు సరిచేస్తారని వివరించారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా.. జనవరి 6 వరకు ఫారం–6, 7, 8 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జనవరి 4న వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయన్నారు. 7న నోటిషికేషన్ విడుదల తర్వాత 8న ఓటర్ల జాబితాలను రిటర్నింగ్ అధికారులు నోటీ సు బోర్డులపై ప్రదర్శిస్తారని, అదే రోజునుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని అంశాలూ వెబ్సైట్లో... మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను టీ పోల్ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచినట్టు నాగిరెడ్డి తెలిపారు. ఓటరు స్లిప్పులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం వచ్చేనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు... మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ డైరెక్టర్, మున్సిపాలిటీల వార్డులకు జిల్లా కలెక్లర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని వివరించారు. జనవరి 4న సాయంత్రానికి రిజర్వేషన్లను పూర్తి చేసి 5న వెల్లడిస్తామన్నారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్లో మున్సిపల్ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు పరిశీలకులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల విషయంలో వ్యయ పరిశీలకులు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. -
హడావుడిగా ‘మున్సిపోల్స్’ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పాలక మం డళ్ల గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారులను నియమించినందున ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, లోక్‌సత్తా విజ్ఞప్తి చేశాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును 119 రోజుల గడువు కోరి, మరోవైపు ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)పై ఒత్తిడిని తీసుకొస్తోందని విమర్శించాయి. సోమవారం ఎస్ఈసీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్ఎస్) మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్ (టీపీసీసీ), మల్లారెడ్డి (బీజేపీ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీటీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి (సీపీఎం), సయ్యద్ అమీనుల్ జాఫ్రీ (ఎంఐఎం), ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఓటర్ల డ్రాఫ్ట్ షెడ్యూల్ జారీ, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన తేదీలతో పాటు 15న నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానంతరం వెల్లడించారు. కాగా, ఈనెల 10న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధమవుతుందని, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులతోపాటు దీనికి సంబంధించి సలహాలు, సూచనలు 12వ తేదీలోపు మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేయవచ్చునని కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. 14న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అదే రోజు రిజర్వేషన్ల జాబితాను కూడా ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారన్నారు. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 19 వరకు పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తామన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాలపై మున్సిపాలిటీల వారీగా ఈనెల 13న రాజకీయ పక్షాలతో సమావేశం ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార ఖర్చు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు. ఎన్నికల నివేదికల్లో మాత్రం ఖర్చు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఇప్పటివరకు రూ. 1 లక్ష ఉండగా... ఈ ఎన్నికల్లో రూ. 2 లక్షలకు పెంచుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో రూ. 1.50 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. -
తొలివిడత సర్పంచ్ అభ్యర్థులు 23,229 మంది
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4,468 సర్పంచ్ పదవులకు 23,229 మంది అభ్యర్థులు, 39,822 వార్డు స్థానాలకు 93,501 మంది బరిలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డుసభ్యుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు వెల్లడించింది. తొలిదశ ఎన్నికల్లో 4,479 పంచాయతీల్లో ఎన్నికల నోటీసులు జారీచేయగా, వివిధ జిల్లాల్లోని 11 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని పేర్కొంది. 39,822 వార్డుమెంబర్ స్థానాలకు ఎన్నికల నోటీసులు జారీ చేయగా, 206 వార్డుమెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపింది. నేడు మూడు జిల్లాల్లో నాగిరెడ్డి పర్యటన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) కమిషనర్ వి.నాగిరెడ్డి శనివారం సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట చేరుకుని ఉదయం 10–11 గంటల మధ్యలో అక్కడ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సిద్దిపేట పోలీస్ కమిషనర్‌తో నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 11.45 నుంచి 12.30 గంటల వరకు సిరిసిల్లలో ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీతో కలసి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆయన సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4 గంటల వరకు జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఎస్పీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. -
ఎన్నికల వివరాలతో కొత్త సాఫ్ట్వేర్
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో ఎన్నికల వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సమాచారంతో కొత్తగా ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఎన్నికలు, ఏర్పాట్ల గురించి సమీక్షించారు. జిల్లాలో జరిగిన సాధారణ, మున్సిపల్ జనరల్ బాడీ ఎన్నికల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌తో ఏ ఎన్నికలు నిర్వహించినా అత్యంత సులువుగా, వేగంగా ఎన్నికల వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాను సరళీకృతం చేసి, దానిని ఈ సాఫ్ట్‌వేర్‌లో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ వెబ్సైట్లో ఎన్నికల నియమ నిబంధనలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు. అఫిడవిట్ తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.