రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌లో ఒక్క దొంగ ఓటు నమోదైనా రీపోలింగ్ నిర్వహణకు అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. టెండర్ ఓటింగ్ నమోదైతే.. దొంగ ఓట్లు పడినట్లు రుజువు అవుతుందని అలాంటి ప్రాంతాల్లో తప్పకుండా రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇతరులు ఎవరైనా తమ ఓటును వేస్తే టెండర్ ఓటు కోసం డిమాండ్ చేసి ఓటేయాలని, ఈ ఓట్లపై ఆర్వోలు తమ దృష్టికి తీసుకురాగానే రీపోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. పలు అంచెల్లో ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తున్నామని, దొంగ ఓట్లు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగ ఓట్లు వేసే వారితో పాటు వారికి సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ జయసింహారెడ్డితో కలసి కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ధనప్రవాహం పెరుగుతోందని 2, 3 రోజులుగా ›ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, అయితే వీటి నియంత్రణకు ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌తో పాటు తనిఖీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్రమైన నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్)కిందకు వస్తున్నా, ఎన్నికల్లో రాజకీయ నేతల డబ్బుల పంపిణీ కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకు రాకపోవడంతో సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. భైంసాలో దాదాపు మామూలు పరిస్థితులు ఏర్పడటంతో బుధవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అక్కడ అదనపు బలగాలతో పాటు మైక్రో అబ్జర్వర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని చెప్పారు.
ఇప్పటిదాకా దాదాపు రూ.44.41 కోట్ల నగదు జప్తు చేశామన్నారు. రూ.16.25 లక్షల విలువగల ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ధనప్రవాహం అరికట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎక్కడెక్కడ అవకాశం ఉందనే దానిపై రాజకీయపార్టీల అభ్యర్థులకే తెలిసే అవకాశం ఉందని, అందువల్ల నిఘా పెట్టాల్సింది వారేనన్నారు. ఇటీవల పెద్దపల్లి మున్సిపాలిటీలో డబ్బు పంపిణీ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడంతో ఆ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు చేసే అవకాశం చిక్కిందన్నారు. గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లో ఇలాంటి మరో ఘటన ఈసీ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ప్రతీ ఓటు ముఖ్యమైనదే..
ప్రతీ ఓటు ముఖ్యమైందేనని గుర్తించి, ప్రతి ఒక్కరూ ఓటేయాలని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 55 వేల మంది సిబ్బంది వ్యయ ప్రయాసలకోర్చి పనిచేస్తున్నందున అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సమయమున్నందున ఓటర్లంతా సాఫీగా, వేగంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎస్‌ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. పోలింగ్‌స్టేషన్ల పరిధి కూడా చిన్నదిగా ఉందని, అందువల్ల ఉదయం 7 నుంచి 10 గంటల లోపు ఓటేసి తమ పనులకు వెళ్లొచ్చన్నారు. ఐదేళ్ల పాటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే అధికారాన్ని గెలిచే వారికి కట్టబెడుతున్నందున మంచి వ్యక్తులను గెలిపించాలని కోరారు. వ్యాపారులు, డబ్బు వెదజల్లేవారు గెలిస్తే ఓటర్లకు అందుబాటులో ఉంటారా లేదా తాగునీరు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లు, బిల్డింగ్ పర్మిషన్లు, ప్లేగ్రౌండ్ వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తారా లేదా అన్నది దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని సూచించారు.
రిటర్నింగ్ అధికారుల వద్ద ఆ వార్డులో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ రికార్డు, ఇతరత్రా సమాచారం అందుబాటులో ఉంటుందని, వాటిని నోటీస్ బోర్డుపైనా ఉంచుతారని చెప్పారు. దీంతో వారి గురించి తెలుసుకుని ఓటేయాలని కోరారు. వార్డుల్లో సరాసరి 1,500 నుంచి 1,700 దాకా ఓట్లు ఉంటాయని, అందులో నాలుగైదు వందల మంది ఓట్లేయకపోవడంతో 10 ఓట్లతోనే గెలిచే సందర్భాలుంటాయని అందువల్ల ఓటర్లంతా పాల్గొంటే మంచి ఫలితం వస్తుందన్నారు. మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని నాగిరెడ్డి చెప్పారు. బుధవారమే జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పుర డివిజన్ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment