2014లో ప్రమాణస్వీకారం నాటి ఫొటోలు- ఉమ, రామకృష్ణ
సాక్షి, వేములవాడ: వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటవి చవిచూశారు. 2014 మొట్టమొదటి మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగురవేసిన సందర్భంగా అప్పుడు చైర్‌పర్సన్‌గా నామాల ఉమ, వైస్ చైర్మన్‌గా ప్రతాప రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ నుంచి నామాల ఉమ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగారు.
అసమ్మతి రాగంలోనూ తన పట్టు నిరూపించుకుని పూర్తిస్థాయి బాధ్యతలు పూర్తిచేశారు. 2019 ఎన్నికల్లో 26వ వార్డు నుంచి పోటీ చేసిన నామాల ఉమ బీజేపీ అభ్యర్థి ముప్పిడి సునంద చేతిలో పరాభవం చవిచూశారు. 2014లో వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రతాప రామకృష్ణ (బీజేపీ జిల్లా అధ్యక్షుడు) 2019లో 23వ వార్డు నుంచి పోటీ చేసి మధు రాజేందర్ చేతిలో ఓటమిపొందారు. బీజేపీ దళితమోర్చ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, ఆయన సతీమణి కుమ్మరి జ్యోతి ఓటమి చెందారు.
మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో 24వ వార్డు నుంచి ప్రముఖ వ్యాపారవేత్త చీకోటి శ్రీనివాస్ ఆయన సతీమణి అనురాధను పోటీలో దింపారు. స్వతంత్ర అభ్యర్థి అన్నారం ఉమారాణి చేతిలో పరాభవం పొందారు. 12వ వార్డులో ప్రముఖ వ్యాపారి తీగల వెంకటేశ్వర్‌రావు ఆయన సతీమణి శైలజను పోటీలో నిలిపారు. బీజేపీ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి చేతిలో ఓడారు. గత పాలకవర్గంలో పని చేసిన పుల్కం శ్రీలక్ష్మి, ముద్రకోల వెంకటేశ్, సూగూరి లక్ష్మి, జంగం రాజేందర్ సతీమణి మఠం సంధ్యారాణి, నామాల వరలక్ష్మి, నూకలమర్రి వసంత ఓటమిపాలయ్యారు.
పారిశుధ్య కార్మికురాలి నుంచి ప్రజాప్రతినిధిగా..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బెక్కం అంజమ్మ అదే మున్సిపాలిటీ పాలకమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ 19వ వార్డు ఎస్సీ రిజర్వు కాగా ఈస్థానం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ అనూహ్యంగా కేటాయించడంతో ఎన్నికయ్యారు. 322 ఓట్లు సాధించిన అంజమ్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నల్లాల అన్నమ్మపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
23 ఏళ్లకే కౌన్సిలర్
రాయికల్(జగిత్యాల): పట్టణంలోని 7వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనుమల్ల దివ్య 23 ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రాజుబాయిపై 183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయమే..
48వ వార్డు అభ్యర్థి దేవేందర్‌నాయక్ హ్యాట్రిక్
జగిత్యాల: ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం ఆయన సొంతం. హ్యాట్రిక్ సాధించారు. జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన దేవేందర్‌నాయక్ షెడ్యూల్ కులాలకు చెందిన దేవేందర్‌నాయక్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నాడు. అప్పటినుంచి టీఆర్‌ఎస్ నుంచే గెలుస్తున్నారు. 2005లో 2వ వార్డు ఎస్టీకి రిజర్వుడుకాగా పోటీ చేసి విజయం సాధించాడు.
2014లోనూ 9వ వార్డు ఎస్టీకి రిజర్వుగా పోటీ చేసి గెలిచారు. పునర్విభజన అనంతరం పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనంకావడంతో ప్రస్తుతం టీఆర్‌నగర్ 48వ వార్డుకు కేటాయించారు. ఎస్టీకి రిజర్వుకాగా టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిపై 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
భార్యాభర్తల ఓటమి
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 17, 18 వార్డుల నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన భార్యాభర్తలు ఓటమిచెందారు. గతంలో బీజేపీ నుంచి వీరు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం 17వ వార్డు నుంచి భార్య అర్వ లక్ష్మీ పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ పద్మపై ఓటమిపాలయ్యారు. భర్త అర్వ చంద్రశేఖర్‌రాజు 18వ వార్డునుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి చుక్క నవీన్‌కుమార్‌పై ఓటమిచెందారు
ఇద్దరికి సున్నా..ముగ్గురికి ఒక్కొక్క ఓటు
మంథని: మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్కఓటు కూడా పడని అభ్యర్థులు ఇద్దరు ఉండగా కేవలం ఒకేఓటు సాధించిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. నాలుగోవార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి కేతిరి రాజయ్య, 8వ వార్డు అభ్యర్థి కొత్త పద్మకు ఓట్లు రాలేదు. అదేవిధంగా 2 వార్డు స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అయోషా, నాలుగోవార్డులో ఆంగోతు రాజునాయక్, 11 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మంథని రాహుల్‌కు ఒకేఓటు వచ్చింది. కేంద్రంలో అధికారంలోని బీజేపీ తరఫున పోటీ చేసిన 8 మంది అభ్యర్థులకు 163 ఓట్లు రాగా పార్వర్డ్ బ్లాక్ పార్టీ మూడుస్థానాల్లో పోటీచేయగా మూడోవార్డులో బొడ్డెల తిరుమల 184 ఓట్లు సాధించింది.
నాడు సర్పంచులు.. నేడు కౌన్సిలర్లు
జమ్మికుంటటౌన్(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు మాజీ సర్పంచులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘం పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన పొనగంటి మల్లయ్య 1995 నుంచి 2001 వరకు జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం బల్దియా పరిధిలోని 23వ వార్డు (జనరల్) నుంచి పోటీ చేసిన మల్లయ్య 177 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వాసిఅయిన బొద్దుల అరుణ 2006 నుంచి 2011 వరకు కొత్తపల్లి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు బల్దియా పోరులో 18వవార్డు (బీసీ మహిళ) నుంచి తలపడిన అరుణ 94 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
నాడు తొలి ఎంపీపీగా..నేడు కౌన్సిలర్‌గా
మెట్‌పల్లి(కోరుట్ల): మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 10వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన బోయినపల్లి చంద్రశేఖర్‌రావు గతంలో ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసి 1987లో మండల పరిషత్ అధ్యక్ష పదవీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిపారు. ఆ ఎన్నికల్లో మెట్‌పల్లి నుంచి టీడీపీ తరఫున చంద్రశేఖర్‌రావు పోటీచేసి విజయం సాధించారు.
మండల తొలి ఎంపీపీగా ఐదేళ్లు పని చేసిన ఆయన ఆ తర్వాత చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీఆర్‌ఎస్ వైస్‌చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. చాలాకాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎమ్మెల్యే కీలక పదవీకి ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హ్యాట్రిక్ వి‘జయ’శ్రీ
జగిత్యాలలోని 35వ వార్డు నుంచి అనుమండ్ల జయశ్రీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 82 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఫ్లోర్‌లీడర్‌గా కొనసాగారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. అనూహ్యంగా ఆమెకు టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా పోటీకి దిగి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 82 ఓట్లతో విజయం సాధించారు. ఇది ప్రజా విజయమని ఆమె పేర్కొన్నారు. జయశ్రీ భర్త రఘు ఆమెను ఎత్తుకొని అభినందించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, జగిత్యాల
భార్య గెలుపు..భర్త ఓటమి
కోరుట్ల: కోరుట్ల మున్సిపాల్టీలోని 10,11వ వార్డుల్లో బీజేపీ తరఫున బరిలో దిగిన భార్యాభర్తలు దాసరి రాజశేఖర్–దాసరి సునీతల్లో ఒకరు గెలిచి మరొకరు ఓటమి పాలుకావడం చిత్రమైన సన్నివేశానికి తెరతీసింది. రెండు వార్డులకు సంబంధించిన కౌంటింగ్ పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు ఒకేచోట ఉండి కౌంటింగ్‌ను పరిశీలించారు.
11వ వార్డులో బీజేపీ తరఫున బరిలో నిలిచిన దాసరి సునీత టీఆర్‌ఎస్ అభ్యర్థి కస్తూరి వాణిపై 470 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పదో వార్డులో బీజేపీ అభ్యర్థి దాసరి రాజశేఖర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డమీద పవన్‌పై 37 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. భార్య దాసరి సునీత గెలుపొందడం..భర్త రాజశేఖర్ ఓటమి పాలుకావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment