సాక్షి, ఖమ్మం: ఎన్నికలు అంటే మద్యం, డబ్బులు అనేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అధికార టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సామాన్యులు, మధ్యతరగతి వారు రాజకీయాల్లో పాల్గొనకుండా, మద్యం వ్యాపారులు, ఓట్లను కొనుగోలు చేసేవారు మాత్రమే రాజకీయాలు చేసే విధంగా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఖమ్మంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు కావన్నారు. ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు కానే కావని విమర్శించారు. విచ్చలవిడి మద్యం, విపరీతమైన డబ్బులు, ప్రలోభాలకు, ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని వ్యాఖ్యానించారు.
అందరూ కలిసికట్టుగా పోరాడాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ తన అవినీతి, అక్రమాలతో కూడగట్టిన వేల కోట్ల రూపాయలతో ఓటు విలువను దిగజార్చే కుట్ర చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపి సామాన్యులను రాజకీయాలకు దూరం చేసే కుట్రలో భాగంగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్నవారి నుంచి రాజకీయాలను కాపాడాలని కోరారు. అందుకోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు, చైతన్యవంతులు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున దుర్మార్గాలు, దౌర్జన్యాలు, డబ్బులు, మద్యం పంపిణీ జరిగినా.. మొక్కవోని ధైర్యంతో టీఆర్‌ఎస్ నేతల ఆగడాలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఏమవుతుందో ఏమో?
Comments
Please login to add a commentAdd a comment