ఖానా‘పురం’ ఎట్టకేలకు ‘కారు’పరం | TRS Won Khanapuram Municiapality | Sakshi
Sakshi News home page

ఖానా‘పురం’ ఎట్టకేలకు ‘కారు’పరం

Published Tue, Jan 28 2020 8:45 AM | Last Updated on Tue, Jan 28 2020 9:15 AM

TRS Won Khanapuram Municiapality - Sakshi

నిర్మల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఐదేళ్లపాటు పట్టణాభివృద్ధికి అంకితమవుతామంటూ ప్రమాణం చేశాయి. బీసీ జనరల్‌కు రిజర్వు అయిన నిర్మల్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన గండ్రత్‌ ఈశ్వర్‌ చైర్మన్‌ అయ్యారు. భైంసాలో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా ఉన్న సబియాబేగం మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొత్త మున్సిపాలిటీ ఖానాపూర్‌ను ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి అంకం రాజేందర్‌ చైర్మన్‌గా ప్రమాణం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం, ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా ముగిశాయి.

నాలుగువందలకు పైగా ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్‌ పట్టణం 12వ మున్సిపల్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌ ఎన్నికయ్యారు. ఇక్కడ 42వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా 30వార్డులను దక్కించుకుంది. మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో హాజరైన కౌన్సిలర్లు 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వర్‌ను చైర్మన్‌గానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఈశ్వర్‌ పేరును తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌ ప్రతిపాదించగా, 24వ వార్డుకు కౌన్సిలర్‌ మేడారం అపర్ణ బలపరిచారు. దీంతో ఎన్నిక నిర్వహణాధికారి, జెడ్పీ సీఈఓ సుధీర్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఇప్పటి వరకు నిర్మల్‌లో రెండోసారి ఎన్నికై ఈశ్వర్‌ రికార్డు నెలకొల్పారు.

ఆయన గతంలో 2000–05వరకు చైర్మన్‌గా కొనసాగారు. అప్పట్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నిక అనంతరం వైస్‌ చైర్మన్‌గా 22వ(వైఎస్‌ఆర్‌ కాలనీ) వార్డు కౌన్సిలర్‌ షేక్‌ సాజిద్‌ పేరును 41వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ అబ్ధుల్‌ సయీద్‌ ప్రతిపాదించారు. 23వ వార్డుకు చెందిన సయ్యద్‌ జహీర్‌ బలపర్చారు. దీంతో షేక్‌ సాజిద్‌ వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎక్స్‌ అఫిషి యో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేకాధికారి శృతిఓజా, కలెక్టర్‌ ప్రశాంతి, కమిషనర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

భైంసాలో మళ్లీ వాళ్లే..
రాష్ట్రంలో మహారాష్ట్రతో సరిహద్దు పట్టణంగా ఉన్న భైంసా మున్సిపల్‌లో మరోసారి ఎంఐఎం కొలువుదీరింది. ఇక్కడ బీసీ మహిళ రిజర్వేషన్‌ రావడంతో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా కొనసాగిన సబియాబేగంను ఈసారి కూడా చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పట్టణంలోని రెండోవార్డు నుంచి ఆమె గెలుపొందారు. వైస్‌ చైర్మన్‌గా 20వ వార్డు నుంచి ఏకగ్రీవమైన మహ్మద్‌ జాబిర్‌ అహ్మద్‌ కూడా మరోసారి అదే స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా సబి యాబేగం పేరును ఒకటోవార్డు కౌన్సిలర్‌ ఫైజు ల్లాఖాన్‌ ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్‌ ముదస్సిమ్‌ బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా జాబిర్‌ అహ్మద్‌ను 15వ వార్డు కౌన్సిలర్‌ ఖాదర్‌ ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్‌ రాహుల్‌ దగ్డే బలపర్చారు. ఈమేరకు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రకటించారు. అంతకుముందు ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు ముందే బీజేపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు.

ఖానా‘పురం’ కారుకే...
కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ ఖానాపూర్‌లో తొలిసారే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ పురం ‘కారు’ పార్టీ పరమైంది. మొత్తం 12వార్డులకు గానూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెరో ఐదు స్థానాలు రాగా, ఇండిపెండెంట్‌ ఒకటి, బీజేపీ ఒకటి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు స్వతంత్ర అభ్యర్థిగా 10వ వార్డు నుంచి గెలుపొందిన తొంటి శ్రీనివాస్‌ మద్దతు పలికారు. అంతకుముందు ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రెండో వార్డు కౌన్సిలర్‌ కారింగుల సంకీర్తన సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా మద్దతు పలికారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం ఏడు స్థానాలకు చేరగా, కాంగ్రెస్‌ నుంచి ఒకరు గైర్హాజరు కావడంతో వారి బలం నాలుగు స్థానాలకు పడిపోయింది.

ఇక్కడ బీజేపీ అభ్యర్థి నాయిని స్రవంతి ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. దీంతో ప్రత్యేకాధికారి ప్రసూనాంబ, కమిషనర్‌ మల్లేశ్‌లు మెజార్టీ ఉన్న టీఆర్‌ఎస్‌కు చైర్మన్‌ ఎన్నికకు అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ నుంచి చైర్మన్‌గా 9వ వార్డు కౌన్సిలర్‌ అంకం రాజేందర్‌ పేరును 10వ వార్డు కౌన్సిలర్‌ తొంటి శ్రీనివాస్‌ ప్రతిపాదించగా, 3వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా 8వ వార్డు కౌన్సిలర్‌ అబ్ధుల్‌ ఖలీల్‌ పేరును ఒకటో వార్డు కౌన్సిలర్‌ కావలి సంతోష్‌ ప్రతిపాదించగా, ఐదో వార్డు కౌన్సిలర్‌ పరిమి లత బలపర్చారు. దీంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్‌ చైర్మన్‌గా అబ్ధుల్‌ ఖలీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ కైవసం..
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. చైర్మన్‌ ఎన్నికకు ఏడుగురి మద్దతు కావాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా ఖానాపూర్‌లో నమోదు చేసుకున్నారు. ఆమె ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం ఆరుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన 10వ వార్డు కౌన్సిలర్‌ తొంటి శ్రీనివాస్‌ పార్టీలో చేరడంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్‌ చైర్మన్‌గా అబ్దుల్‌ ఖలీల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  

భైంసాలో గట్టి బందోబస్తు
భైంసా(ముథోల్‌): భైంసా మున్సిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక సందర్భంగా పట్టణంలో సోమవారం గట్టి బందోబస్తు నిర్వహించారు. 144సెక్షన్‌ విధించారు. డీఎస్పీ నర్సింగ్‌రావు గతంలో పనిచేసి బది లీపై వెళ్లిన మరో డీఎస్పీ రాములు భద్రతను పర్యవేక్షించారు. కాగా, ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement