సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పట్టణ వాసులు అండగా నిలిచారు. బల్దియా ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారు. శనివారం వెలువడిన 9 నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో నాలుగు నగర పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్, మీర్‌పేట, బడంగ్‌పేటలో మేయర్ గద్దెకు సరిపడా సంఖ్యా బలానికి చేరుకోవడంలో టీఆర్‌ఎస్ చతికిలపడింది. బండ్లగూడ, నిజాంపేట, జవహర్‌నగర్, పీర్జాదిగూడలో ఏకపక్ష ఫలితాలు రాగా.. బోడుప్పల్‌లో మేజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో, రామగుండంలో ఆరు స్థానాల దూరంలో నిలిచింది.
అయితే, ఇక్కడ గెలిచిన ఇండిపెండెంట్లలో తిరుగుబాటు అభ్యర్థులే ఎక్కువగా ఉండటంతో ఆయా పీఠాలను దక్కించుకోవడం టీఆర్‌ఎస్‌కు పెద్దగా కష్టం కాకపోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 316 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. ఇందులో 152 కార్పొరేటర్ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. 41 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 63 డివిజన్లలో విజయబావుటా ఎగురవేసి రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం పార్టీ 17 స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. 43 డివిజన్లు ఇతరుల ఖాతాల్లో పడ్డాయి.
ఇందూరులో బీజేపీ రెపరెపలు..
ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఇందూరు నగర పాలక సంస్థలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ ఏకంగా 28 డివిజన్లలో విజయం సాధించింది. కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు ముగ్గురు సభ్యుల బలం తగ్గింది. అయితే, ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 13 డివిజన్లే దక్కగా.. ఎంఐఎం 17 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇందులో ఈ పార్టీలు గనుక కలిస్తే.. బీజేపీకి మేయర్ పీఠం దూరమైనట్లే. ఇక కాంగ్రెస్ నిరాశాజనక ఫలితాలనే నమోదు చేసింది. కేవలం 2 రెండు స్థానా లతోనే సరిపెట్టుకుంది. బీజేపీతో జతకలిస్తే.. ఎక్స్ అఫీషియో సభ్యుల బలాబలాలపై విజయం ఆధారపడి ఉంటుంది.
మీర్‌పేట, బడంగ్‌పేటలో పోటాపోటీ..
రాజధాని శివార్లలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. మీర్‌పేట, బడంగ్‌పేటలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకపోవడంతో క్యాంపు రాజకీయాలకు అవకాశమిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరడంతో చతికిలపడింది. బడా లీడర్లు కారెక్కగా.. చోటామోటా నాయకులు టీఆర్‌ఎస్ వ్యూహాలను తట్టుకోలేకపోయారు. బడంగ్‌పేటలో మొత్తం 28 డివిజన్లుండగా.. ఇందులో 12 స్థానాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 7, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. ఒక చోట ఇతరులు గెలిచారు. మేయర్ పోస్టు దక్కించుకోవాలంటే పొత్తులు, ఫిరాయింపులు అనివార్యం. మీర్‌పేటలోనూ హంగ్ ఏర్పడింది. ఇక్కడ 46 స్థానాలకుగాను టీఆర్‌ఎస్ 19, బీజేపీ 16, బీజేపీ 3, ఇతరులు 8 చోట్ల గెలిచారు. నగర పీఠం చేజిక్కించుకునేందుకు 24 స్థానాలు కావాల్సిఉంది.
నయా బస్తీ.. గులాబీ దస్తీ!
పురపోరులో గులాబీ సత్తా చాటింది. కొత్త మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచి.. పల్లె అయినా.. పట్టణమైనా తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. పురపాలికగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగిన 67 మున్సిపాలిటీల్లో దాదాపు 50 చోట్ల చైర్మన్ పీఠం దక్కించుకునే స్థాయిలో సంఖ్యాబలాన్ని సాధించింది. సుమారు 10 చోట్ల హంగ్ ఏర్పడినా, ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో విపక్షాలను గెలుపు నుంచి దూరం చేసే అవకాశం లేకపోలేదు. 5 పురపాలికలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా.. 2 మున్సిపాలిటీల్లో కమలం వికసించింది. పట్టణీకరణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మేజర్ గ్రామపంచాయతీలు, వాటి చేరువలోని పల్లెలను కలుపుతూ మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన మున్సి‘పోల్స్’లో గులాబీ ఆఖండ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment