సాక్షి, సూర్యాపేట: నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచందర్‌రావును అధికార టీఆర్‌ఎస్ అడ్డుకోగా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కాసేపట్లో నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి ఓటుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి ఎక్స్‌అఫీషియో ఓటు కల్పించగా.. తాజాగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి కూడా ఓటు కల్పించింది. దీనిలో భాగంగా ఓటరు లిస్టులో కేవీపీ, సుభాష్ రెడ్డిల పేర్లను చేరుస్తూ ఈసీ కొత్త జాబితా విడుదల చేసింది. దీంతో వీరిద్దరు ఈ రోజు జరగబోయే నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో సస్పెన్ వీడింది.
సుభాష్‌రెడ్డి ఓటు చట్టవిరుద్ధం: కాంగ్రెస్
అయితే సుభాష్‌రెడ్డికి ఓటు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతర వ్యక్తం చేస్తోంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యుల నమోదుకు ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకే సమయం ఉందని, కానీ గడువు దాటినా శేరి సుభాష్‌రెడ్డి పేరు నమోదు చేయడం చట్ట విరుద్దమన్నారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాగా, కేవీపీ, సుభాష్‌రెడ్డిల ఓట్లతో టీఆర్‌ఎస్‌కు 11, కాంగ్రెస్‌కు 10 మంది సభ్యుల సంఖ్యా బలం ఏర్పడింది. నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపును ఏడుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరుపున 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే టీఆర్‌ఎస్‌కు నాలుగు, కాంగ్రెస్‌కు రెండు ఎక్స్‌అపీషియో ఓట్లు లభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment