
సాక్షి, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ హంగ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. 20 వార్డులున్న చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. ఇక టీఆర్‌ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ద్వంద్వ విధానాల సీపీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుని టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment