బోడుప్పల్‌లో పైప్‌లైన్ల లీకేజీతో మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు
సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ హైదరాబాద్ శివారు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొంగొత్త ఆశలతో కొలువుదీరుతున్న వేళ..తమ సమస్యలకు మోక్షం లభించగలదని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. మున్సిపల్ కొత్త చట్టం ఇందుకు మరింత దోహదం చేయగలదని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ శివారులో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనుల నత్తనడకతో తాగునీరందడం లేదు. అండర్ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సామర్ధ్యం లేక పైప్‌లైన్ల లీకేజీలు, మరమ్మతులు లేక అధ్వాన్నంగా ప్రధాన అంతర్గత రోడ్లు, కబ్జాలకు గురైన చెరువులు, కుంటలకు తోడు, డంపింగ్ యార్డులతో విరజిమ్ముతున్న కాలుష్యం వెరసి భూగర్భ జలాలు విషపూరితంగా మారి జీవకోటికి సవాల్ విసురుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పురపాలక సంఘాలకు మేయర్లుగా, చైర్మన్లు, చైర్‌పర్సన్లుగా పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రధాన సమస్యలపై సాక్షి
ఫోకస్...
♦ పీర్జాదిగూడ కార్పొరేషన్‌ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.40 కోట్ల ఆదాయం ఉంది.
♦ వర్షాకాలంలో శ్రీరామా ఆర్టీసీ కాలనీ, వినాయకనగర్, శ్రీపాద ఎన్‌క్లేవ్, గణేష్‌నగర్, విష్ణుపురి, శంంకర్‌నగర్, బండి గార్డెన్ తదితర ఏరియాల్లో వర్షాకాలంలో వరద సమస్య ఎదురవుతోంది.
♦ పర్వాతాపూర్, కార్పొరేషన్ కార్యాలయం వెనుక కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
♦ మేడిపల్లి సీపీఆర్‌ఐ నుంచి పర్వాతాపూర్ వరకు, వరంగల్ జాతీయ రహదారిలోని మైసమ్మ గుడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతర్గత రోడ్లన్నీ గుంతలతో నిండిఉన్నాయి.
♦ కాలుష్యం, పారిశుధ్య సమస్యలతో జనం రోగాలబారిన పడుతున్నారు.
♦ పీర్జాదిగూడలో 80 కాలనీల్లో 30 కాలనీలకు భగీరథ నీరు రావటం లేదు. నాలుగు రోజులు లేదా వారానికి ఒకసారి నల్లా నీరు సరఫరా అవుతున్నది. పీర్జాదిగూడలో 60 పార్కులకుగానూ 40 పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి.
బోడుప్పల్ ..
♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.60 కోట్లు పన్నుల రూపేణా ఆదాయం ఉంది.
♦ చెంగిచర్ల వెంకటసాయినగర్, శ్రీసాయి రెసిడెన్సీ తదితర ప్రాంతాల్లో మురికి కాలువలు సరిగా లేక వర్షపు నీటితో వరద నీరు కలిసి రోడ్లన్నీ వరదమయంగా మారుతున్నాయి.
♦ 45 కాలనీల్లో మురికి కాలువలు, అంతర్గత రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి.
♦ బోడుప్పల్‌లోని ‘రా’ చెరువు కాలుష్య కాసారంగా మారింది. వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
♦ బోడుప్పల్‌లో 120 కాలనీలకుగానూ 40 కాలనీలకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రెండవ దశ పనులు పూర్తి కాకపోవటం వల్ల వారానికి ఒక సారి నీరు సరఫరా చేస్తున్నారు. లక్ష్మీనగర్ హుడా కాలనీ, ఈస్ట్ బృందావనకాలనీ, అంబేద్కర్ చౌరస్తా, శ్రీనివాస కాలనీ, రాజశేఖర్ కాలనీల్లో, హనుమాన్‌నగర్, ఉదయ్‌నగర్‌లో పైప్‌లైన్లు పగిలి లీకేజీలవుతున్నాయి.
♦ 270 పార్కులకుగానూ, 150 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి.
జవహర్‌నగర్ ..
♦ ఈ కార్పొరేషన్‌లో దాదాపు రెండు లక్షల జనాభా, 40 వేలకు పైగా గృహాలు ఉన్నప్పటికీ పన్నుల ఆదాయం రూ.7 కోట్లు మాత్రమే వస్తోంది.
♦ జవహర్‌నగర్‌లో ప్రధానంగా డంపింగ్ యార్డు కాలుష్యం, దుర్గంధం, ప్రధాన, అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, పారిశుధ్ద్య నిర్వహణ సరిగా లేదు. ఖాళీ స్థలాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది.
నిజాంపేట్ ..
♦ ప్రజల నుంచి ఏటా ఈ కార్పొరేషన్‌కు పన్నుల రూపంలో రూ.40 కోట్లు వస్తున్నా సమస్యలు తీరడం లేదు.
♦ నిజాంపేట్, ప్రగతి నగర్ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. మిషన్ భగీరథ పనుల్లో జాప్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. చెత్త డంపింగ్ యార్డును విస్తరింపజేసి, ఆధునీకరించాల్సి ఉంది.
బండ్లగూడ ..
♦ బండ్లగూడకు ఏటా ప్రజల నుంచి వివిధ పన్నుల ద్వారా రూ.30 కోట్లు సమకూరుతున్నది. అనేక కాలనీల్లో తాగు నీటి సమస్య ఉంది. హైదర్‌గూడ పీఅండ్‌టీ కాలనీ మధ్య మూసీపై వంతెన నిర్మించాల్సి ఉంది. పీరం చెరువు కాలుష్యం, డంపింగ్ యార్డుతో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి.
బడంగ్‌పేట్ ..
♦ ఏటా ప్రజల నుంచి పన్నుల ద్వారా ముక్కు పిండి రూ.39 కోట్లు వసూలు చేస్తున్నారు. మురికి నీటి వ్యవస్థకు అవుట్ లేకపోవటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది.
మీర్‌పేట్ ..
♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా పన్నుల ద్వారా రూ.24 కోట్ల ఆదాయం వస్తుండగా,....ప్రజలు మాత్రం తాగునీరు, తీవ్ర పారిశుధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లోకి నేరుగా మురికి నీరు కలిసి కాలుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా 60 కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మురికినీరు వ్యవస్థ బాగా లేకపోవటంతో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది.
21 మున్సిపాలిటీల్లోనూ అంతే..
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, పోచారం, దుండిగల్, పెద్దఅంబర్‌పేట్, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, శంషాబాద్, మణికొండ, తుర్కుయాంజాల్, నార్సింగ్, ఆదిబట్ల, షాద్‌నగర్, ఆమనగల్లు తదితర మున్సిపాలిటీల్లో ఏటా లక్షలాది రూపాలు పన్నులను ప్రజల నుంచి ముక్కిపిండి వసూలు చేస్తున్న అధికారులు, పాలక వర్గం వారికి మౌలిక వసతులు కల్పించలేక పోతున్నది. నాగారం మున్సిపాలిటీలో ఏటా రూ.12 కోట్లు పన్నుల ద్వారా వస్తుండగా, చిన్న మున్సిపాలిటీలు అయిన తుక్కుగూడకు రూ.1.8 కోట్లు, పోచారానికి రూ.3 కోట్లు, గుండ్ల పోచంపల్లికి రూ.5 కోట్లు, మేడ్చల్‌కు రూ.2.3 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ప్రజలు తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, డంపింగ్ యార్డు, చెరువుల, కుంటల కాలుష్యం, అక్రమ కట్టడాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శశ్మాన వాటికలు, హరితహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పురపాలికలు ఈ ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment