ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహాలు  | TRS Strategies Workout In Mahabubnagar Municipal Elections | Sakshi
Sakshi News home page

ఏడు పురపాలికల్లో ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహాలు 

Published Tue, Jan 28 2020 12:00 PM | Last Updated on Tue, Jan 28 2020 12:02 PM

TRS Strategies Workout In Jogulamba Gadwal Municipal Elections - Sakshi

అయిజలో చేతులెత్తి మున్సిపల్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటున్న కౌన్సిలర్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూత్పూర్, కోస్గి, నారాయణపేట, అమరచింత, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ పురపాలికలపై జెండా ఎగరవేసింది. గులాబీ పార్టీ ఎత్తుగడలతో గెలుపునకు ఆస్కారమున్న భూత్పూర్, నారాయణపేట పీఠాలను బీజేపీ పోగొట్టుకుంది.

ఉమ్మడి జిల్లాలో కేవలం మక్తల్‌లో మాత్రమే కాషాయం జెండా ఎగిరింది. ఇటు నిన్నటి వరకు కోస్గి పీఠంపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలింది. రెండ్రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోస్గి పీఠం ‘చే’జారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా పాగా వేసింది. చైర్మన్‌ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించి సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలకు తరలించారు. ముందుగా గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణాస్వీకారం చేయగా.. తర్వాత చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఎనుకున్నారు.

కొల్లాపూర్‌లో ‘గులాబీ’ని గెలిపించారు..
రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్‌ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కొల్లాపూర్‌కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్‌ కొల్లాపూర్‌ పురంపై గులాబీ జెండా ఎగిరింది.

మక్తల్‌లో రభస.. 
మక్తల్‌లో చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన బీజేపీ.. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇద్దరిని జత కలుపుకుంది. ఎన్నిక సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే.. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామని హామీ ఇస్తామని నమ్మించినట్లు కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా చైర్‌పర్సన్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పావనికి అనుకూలంగా అందరూ చెయ్యి ఎత్తారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థుల వైస్‌చైర్‌పర్సన్‌కు బీజేపీ అభ్యర్థులు సహకరించకపోగా.. తమ పార్టీకి చెందిన అఖిలను వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మండిపడ్డారు. తమను నమ్మించి మోసం చేశారని బీజేపీ నాయకత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.

కల్వకుర్తి మున్సిపల్‌ పరిధిలో స్థానిక ఎమెల్యే జైపాల్‌యాదవ్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షానవాజ్‌ ఖాన్‌కు వైస్‌ చైర్మన్‌ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ చైర్మన్‌గా ఎడ్మ సత్యం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత పాలకవర్గంలో వైస్‌ చైర్మన్‌గా పని చేసి.. ఈ సారి మరోసారి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనుచరుడు షాహీద్‌ పేరు తెరపైకి వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరూ షాహీద్‌ వైపే మొగ్గుచూపడంతో అతను వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పుర ఎన్నికల ఫలితాల తర్వాత అమరచింతలో మారిన రాజకీయ సమీకరణాలు గులాబీ నేతలను కాస్త ఆందోళనకు గురి చేశాయి. అక్కడున్న  పది వార్డుల్లో టీఆర్‌ఎస్‌ మూడు, సీపీఎం రెండు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్‌ కారెక్కారు. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో పురపీఠం కైవసం చేసుకుందామని భావించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి మద్దతు విషయంలో ఒక అభ్యర్థిపై అనుమానం వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఎక్స్‌అఫీషియో ఓటు వేద్దామనే ఆలోచనతో అమరచింత మున్సిపాలిటీకి చేరుకున్నా.. సదరు అభ్యర్థి సైతం టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపడంతో చిట్టెం ఓటు అవసరం లేకుండానే గులాబీ అక్కడ జెండా ఎగరవేసింది.

భూత్పూర్‌ మున్సిపల్‌ పరిధిలో పది వార్డులకు టీఆర్‌ఎస్, బీజేపీ నాలుగు చొప్పున స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. దీంతో రంగంలో దిగిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో గెలిచిన బీజే పీ అభ్యర్థుల్లో ఇద్దరికి గులాబీ కండువా కప్పా రు. దీంతో గులాబీ బలం ఆరుకు చేరింది. సో మవారం ఉదయమే భూత్పూర్‌కు వచ్చిన బీజే పీ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి విప్‌ జారీ చేసి వెళ్లినా.. ఆ పురంపై గులాబీ జెండా ఎగరడాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అయితే.. బీజేపీ నుంచి గెలిచి కారెక్కిన కెంద్యాల శ్రీనివాస్‌కు వైస్‌ చైర్మన్‌ పదవి వరించింది.

చేజారుతూ.. చేజిక్కిన ‘కోస్గి’ 
అధికార పార్టీ అనూహ్యంగా కోస్గి పీఠం పాగా వేసింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 16వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ చెరో ఏడు చొప్పున గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల్లో 4వ వార్డు నుంచి గెలుపొందిన జనార్దన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌ రెబల్‌) కాంగ్రెస్‌కు మద్దతివ్వగా.. మరో అభ్యర్థి బెస్త ఎల్లమ్మ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. దీంతో రెండు పార్టీలకు ఎనిమిది చొప్పున మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన అనిత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఏడు, కాంగ్రెస్‌ తొమ్మిది స్థానాల్లో మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్‌అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో కాంగ్రెస్‌ నేతలు పుర పీఠం తమదేననే ధీమాతో ఉండిపోయారు.

కానీ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్‌అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల పదవికి ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇతర పార్టీ నేతలందరూ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. దీంతో పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులతో అధికారులు చైర్‌పర్సన్, చైర్మన్‌లను ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

గెలుపు కోసం వారి ఓట్లు.. 
హంగ్‌ ఉన్న పట్టణాల్లో ఎక్స్‌అఫీషియో ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కదిలారు. ముందుగా ఓటు అవసరం లేకుండా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో లాబీయింగ్‌ చేసిన నాయకులు ఆ ప్రయత్నాలు ఫలించని చోటుకు వెళ్లి ఓటేశారు. కోస్గిలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్‌లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, అయిజలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లేశారు. మక్తల్‌లో ఎమ్మెల్సీ రాంచందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేశారు.

నీకొకటి.. నాకొకటి.. 
‘పుర’ పీఠాలు కైవసం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పార్టీలు కలిసి రెండు చోట్ల పాగా వేశాయి. పది వార్డులు ఉన్న అమరచింతలో టీఆర్‌ఎస్‌ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. దీంతో ఆ పీఠంపై పాగాకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు జరిపిన స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చైర్‌పర్సన్‌ పదవిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంగమ్మకు ఇచ్చి.. వైస్‌ చైర్మన్‌ పదవిని గోపికి ఇచ్చారు.

ఇటు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ పది మంది గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐఎఫ్‌బీ గెలిచిన పదిమంది టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ కావడం.. వారందరూ తాము టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 16వ వార్డు అభ్యర్థి దేవన్నకు చైర్మన్‌.. తొమ్మిదో వార్డు నుంచి ఏఐఎఫ్‌బీ తరఫున గెలిచిన నర్సింహుడుకు వైస్‌ చైర్మన్‌ పదవి వరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement