ఇలా గెలవగానే.. అలా మార్చేశారు | Members Who Won In Municipal Elections Have Changed Parties | Sakshi
Sakshi News home page

ఇలా ఎన్నికవ్వగానే.. అలా కండువా మార్చేశారు

Published Tue, Jan 28 2020 10:19 AM | Last Updated on Tue, Jan 28 2020 1:06 PM

Members Who Won In Municipal Elections Have Changed Parties - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నికల ఫలితాలు ఇలా వెల్లడయ్యాయో లేదో.. కొందరు కార్పొరేటర్లు/కౌన్సిలర్లు అలా కండువా మార్చేశారు. అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీ పంచన చేరారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌పై కత్తులు దూసిన వారే.. ఇప్పుడు టింగురంగా అంటూ గులాబీ గూటికి చేరిపోయారు.

సాక్షి, నిజామాబాద్‌: ఎన్నికల వేళ విమర్శలు, సవాళ్లు విసిరిన వారే.. చివరకు వెనక్కి తగ్గారు. ఇలా గెలుపొందారో లేదో అలా జంప్‌ జిలానీలుగా మారారు. ‘అధికారమే’ పరమావధి అంటూ గోడ దూకేశారు. ఆర్మూర్‌లో అయితే మొన్న కౌంటింగ్‌ పూర్తి కాక ముందే కండువాలు మార్చడం విస్మయానికి గురి చేసింది. కొందరేమో ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. గులాబీ కండువా కప్పుకుని మురిసి పోయారు. మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికలకు ముందు కత్తులు దూసి, ఎన్నికవగానే అదే పార్టీలోకి చేరిపోవడం చూసి ఓటర్లు నోరెళ్ల బెడుతున్నారు. 

టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు కాంగ్రెస్‌ ఓటు.. 
నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 40వ డివిజన్‌లో విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.శివచరణ్‌.. మేయర్‌ ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మేయర్‌ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా చెయ్యేత్తారు. ఆయనతో పాటు 38వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన గడుగు రోహిత్‌కుమార్‌ కూడా మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా నిలిచారు. దీంతో కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థి (బీజేపీ రెబల్‌)గా యమున కూడా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. కౌంటింగ్‌ పూర్తయి ఫలితం వెలువడిన వెంటనే ఆమె టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి క్యాంపునకు వెళ్లారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు మద్దతుగా నిలిచారు. 

ఆర్మూర్‌లో.. 
ఆర్మూర్‌ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ కౌన్సిలర్‌గా గెలిచిన మురళీధర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఇంతియాజ్‌ గెలిచిన వెంటనే కండువా మార్చారు. ఇక్కడ మరో ఐదుగురు స్వతంత్ర కౌన్సిలర్లు ఆకుల రాము, వరుణ్‌ శేఖర్, బద్ధం రాజ్‌కుమార్, సుంకరి సుజాత, లింగంపల్లి భాగ్య కూడా కారెక్కారు. ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే ప్రజాప్రతినిధులు ఇలా పార్టీ మార్చడంతో ఓటర్లు విస్మయం చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement