
కామారెడ్డిలో ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బల్దియా చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
బల్దియాలలో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో చైర్మన్‌లు, వైస్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారే ఎన్నికయ్యారు. ‘సాక్షి’ ముందే చెప్పినట్లుగా కామారెడ్డి బల్దియా పీఠం నిట్టు జాహ్నవికే దక్కింది. ఎల్లారెడ్డి చైర్మన్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యారు. బాన్సువాడ బల్దియాచైర్మన్‌గా గంగాధర్‌కే అవకాశం దక్కింది.
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో తొలిసారిగా టీఆర్‌ఎస్ గెలిచింది. కొత్తగా ఏర్పాటైన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ జెండా ఎగరేసింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే గెలుపొందడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి.
కామారెడ్డిలో..
జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీ ఇప్పటివరకు టీఆర్‌ఎస్ గెలుచుకున్నది లేదు. గత పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి సొంతంగా 23 సీట్లు రావడం, మరో ఆరుగురు ఇండిపెండెంట్లు గులాబీ కండువా కప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన వారే గెలిచారు.
ముందు మున్సిపాలిటీకి సభ్యులు చేరుకున్న తరువాత అక్షర క్రమంలో ఒక్కొక్కరితో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణం చేయించారు. కామారెడ్డిలో 49 మంది సభ్యులు ఉండడంతో గంటన్నర పాటు సమయం కేటాయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు చేపట్టారు. చైర్‌పర్సన్ పదవికి టీఆర్‌ఎస్ తరపున నిట్టు జాహ్నవి పేరును నజీరొద్దీన్ అనే కౌన్సిలర్ ప్రతిపాదించగా ముప్పారపు అపర్ణ బలపరిచారు. కాంగ్రెస్ తరపున చైర్‌పర్సన్ అభ్యర్థిగా పంపరి లత పేరును కృష్ణమూర్తి ప్రతిపాదించగా వంశీకృష్ణ బలపర్చారు. చేతులెత్తే పద్ధతిన జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జాహ్నవికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటుతో కలిపి 30 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి లతకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జాహ్నవి గెలుపొందినట్టు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవికి గడ్డం ఇందుప్రియ పేరును కృష్ణాజీరావ్ ప్రతిపాదించగా.. బూక్య రాజు బలపరిచారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మద్ సయ్యద్ పేరును రవీందర్‌గౌడ్ ప్రతిపాదించగా, రాణి బలపరిచారు. చేతులెత్తే పద్ధతిన వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా ఇందుప్రియకు 30 మంది, అహ్మద్ సయ్యద్‌కు 12 మంది ఓటేశారు. దీంతో ఇందుప్రియ గెలుపొందినట్టు జేసీ ప్రకటించారు. బీజేపీ సభ్యులు 8 మంది ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు గెలచుకుంది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికలకు నామినేషన్లను ఆహ్వానించగా చైర్మన్‌గా కుడుముల సత్యనారాయణ పేరును జీనత్ సుల్తానా ప్రతిపాదించగా ఎరుకల సాయిలు బలపరిచారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా ముస్త్యాల సుజాత పేరును అల్లం శ్రీను ప్రతిపాదించగా, జంగం నీలకంఠం బలపరిచారు. ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ 19 మంది కౌన్సిలర్లు ఉండగా సమావేశానికి 18 మంది మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన కాసుల బాల్‌రాజు సమావేశానికి రాలేదు. మిగతా 18 మందితో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో రాజేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా జంగం గంగాధర్ పేరును సభ్యులు ప్రతిపాదించారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్‌గా జుబేర్ పేరును ప్రతిపాదించగా, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అనంతరం పాలకవర్గ సభ్యులంతా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
చదవండి: పాతికేళ్లకే పాలనాపగ్గాలు!
Comments
Please login to add a commentAdd a comment