సాక్షి, కామారెడ్డి: మునుగోడు ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు మద్యాన్ని ఏరుల్లా పారించాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని విమర్శించారు. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా శేకాపూర్ గేట్ వద్ద రాహల్ గాంధీ బస చేసిన చోట ఆయన విలేకరులతో మాట్లాడారు.
మునుగోడు ఓట్ల ఎన్నిక కాదని.. అది నోట్ల ఎన్నిక అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సాహసవంతమైన మహిళ అని, ఆమె డబ్బు, అధికారం ఉన్న వారితో పోరాడిందని ప్రశంసించారు. తనతో ప్రజా గాయకుడు గద్దర్ ఒక సారి ‘వన్ సీఆర్, టూ సీఆర్, త్రీ సీఆర్, ఫోర్ సీఆర్.. కేసీఆర్ ’అని చెప్పారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఉప ఎన్నికలో ఎన్నడూ 93 శాతం పోలింగ్ జరగలేదని, అది మునుగోడులో మాత్రమే సాధ్యమైందని అన్నారు.
మునుగోడు ఓటమితో కాంగ్రెస్ పార్టీ కుంగిపోదని, మరింత బలంగా కొట్లాడుతుందని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఎన్నికల యాత్ర కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారిని సంఘటితం చేయడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ఓట్ కట్టర్ పార్టీ అని విమర్శించారు.
పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలుంటాయి..
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవారు ఏ స్థాయివారైనా వారిపై చర్యలుంటాయని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలో పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసు ఇచ్చిందని, ఆయన సమాధానం వచ్చిన తరువాత పరిశీలించి, తప్పు జరిగినట్టయితే తప్పకుండా చర్యలుంటాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment