సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపై కాషాయ పార్టీ నేతలు అధికార టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపు చావుతప్పి కన్నులొట్టపోయినట్టుంది. కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటింది. ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మోహరించారు. ఓటమి భయంతోనే మాపై దాడులకు పాల్పడ్డారు. హుజురాబాద్‌లోనూ నన్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేశారు.
ఎనిమిదేళ్లుగా సీపీఎం, సీపీఐ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే కమ్యూనిస్టులను మచ్చిక చేసుకున్నారు. కేసీఆర్ తీరు అందితే జుట్టు లేదంటే కాళ్లు అనే చందంగా ఉంటుంది. వామపక్షాల భిక్షతో టీఆర్‌ఎస్ గెలిచింది. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారు. అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి వాళ్లు కృషిచేశారు. ఇంత చేసినా స్వల్ప మెజారీటీనే వచ్చింది’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment