‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం | TRS MLAs Know The Mood Of Field Level Cadre With Munugode By-Polls | Sakshi
Sakshi News home page

‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం

Published Thu, Nov 17 2022 4:08 AM | Last Updated on Thu, Nov 17 2022 4:08 AM

TRS MLAs Know The Mood Of Field Level Cadre With Munugode By-Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి.

ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్‌ కిషోర్‌ ‘ఐప్యాక్‌’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్‌ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్‌చార్జిని నియమించాలని కేసీఆర్‌ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. 

మోహరింపుతో స్వయం విశ్లేషణ 
మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది.

ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. 

ఓటర్లకు చేరువ అయ్యేలా.. 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్‌చార్జిలను నియమించి, వారి ఫోన్‌ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్‌చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్‌ నంబర్‌ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement