trs cadre
-
‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్చార్జిని నియమించాలని కేసీఆర్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. మోహరింపుతో స్వయం విశ్లేషణ మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది. ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. ఓటర్లకు చేరువ అయ్యేలా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్ నంబర్ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?! -
లెక్క తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి, హన్మకొండ: ‘ఏడేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రం పన్నుల రూపంలో రూ. 3,65,797 కోట్లు రాబట్టింది. అందులో రూ.1,68,647 కోట్లే రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది. ఈ లెక్కలు తప్పని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నిరూపిస్తే మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తా. సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా’అని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘కేసీఆర్ అనే మూడక్షరాల పదం లేకపోతే టీపీసీసీ, టీబీజేపీలు ఎక్కడివని.. ఇవాళ మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు ఆ పదవులు కేసీఆర్ వల్ల ఆ పార్టీలు పెట్టిన భిక్ష కాదా?’అని ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండ, వరంగ ల్ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. సాయంత్రం హనుమకొండ హయగ్రీవాచారి (కుడా) మైదానంలో టీఆర్ఎస్ ప్రతినిధుల సమా వేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన జరగకపోతే ఎవడీ రేవంత్ రెడ్డి, ఎవడీ బండి సంజయ్? నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని మేం తిట్టలేమా? కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు. మేం నోరు విప్పితే మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని గుర్తుంచుకోవాలి’అని హెచ్చరించారు. కేసీఆర్‌పై కుక్కల్లా మొరిగే వారిని గులాబీ సైనికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మోదీవన్నీ గాలి మాటలే తెలంగాణ బిడ్డల చెమట, రక్త సమానమైన పన్నులను కేంద్ర పాలకులు గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ఆయన చెప్పేవన్నీ గాలిమాటలేనని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రధానిని అడిగే దమ్ములేదన్నారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల జాడేదని ప్రశ్నించారు. కాజీపేటకు సాధ్యం కాదన్న ఫ్యాక్టరీని బీజేపీ మహారాష్ట్రలోని లాతూరుకు తరలించి తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి ఏం జవాబిస్తారు? ‘దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. 7 ఎయిమ్స్‌లను మంజూరు చేసినా రాష్ట్రానికి రిక్తహస్తం చూపింది. 7 ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. ఎస్ఐటీలు 4, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినా తెలంగాణకు చోటివ్వలేదు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్‌కు తరలిపోయింది. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడేం చెబుతారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్ ‘కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. పట్టపగలే ఎమ్మెల్యేలను డబ్బుతో కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్. ఆయన కూడా కేసీఆర్, టీఆర్ఎస్పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నడు’అని కేటీఆర్ మండిపడ్డారు. కాగా, వరంగల్, నర్సంపేటలో రూ.185 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన టెం ట్లు మధ్యాహ్నం గాలివాటానికి కూలిపోయాయి. దీంతో రెండు జేసీబీలు తీసుకొచ్చి లాగికట్టారు. బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు ‘తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదు. ఒకడు కరీంనగర్లో ఏం పీకలేదు.. కానీ పాలమూరులో తిరుగుతుండు. ట్రిపుల్ ఐటీని తీసుకురాలేని దద్దమ్మ పాలమూరును ఉద్ధరిస్తడంటా?’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘బీజేపీ బేకార్ నాయకుల్లారా.. రాష్ట్రానికి మీరేం చేశారు? పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో తన్నింది మీరు కాదా? 7 మండలాలను గుంజుకుపోయి కలిపింది మోదీ కాదా? 7 మండలాల్లోని లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాలో కలిపింది బీజేపీ కాదా?’అని కేటీఆర్ నిలదీశారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు. నిజామాబాద్ ఎంపీ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశాడు. బూతులు తప్ప ఏం మాట్లాడడు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తానని చెప్పి అడ్రస్ లేకుండా పోయాడు’అన్నారు. తెలంగాణపై మోదీ వివక్ష: కేటీఆర్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ విభాగం హైదరాబాద్‌లో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఆయుష్ మెడిసిన్‘ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కిషన్‌రెడ్డి గారూ.. ఎన్పీయే (నిరర్థక) ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న మీరు రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థను తెస్తున్నందుకు అభినందనలు. ఓహ్.. కాస్త ఆగండి. యథావిధిగా గుజరాత్ ప్రధాని దీన్ని జామ్‌నగర్‌కు తరలించాలని నిర్ణయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ వివక్ష నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
తెలంగాణ భవన్లో మిన్నంటిన సంబరాలు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుండటంతో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు మిన్నంటే సంబరాలు జరుపుకుంటున్నాయి. టీఆర్ఎస్ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్లోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు రంగులు చల్లుకుని, మిఠాయిలు పంచుకుంటున్నారు. డప్పువాయిద్యాలతో నృత్యాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు రానున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. కాగా మంత్రి కేటీఆర్ కూడా వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం మరింత ఉత్సహంతో పని చేసేందుకు వరంగల్ ప్రజలు స్ఫూర్తినిచ్చారని ఆయన ట్విట్ చేశారు. ఈ విజయంతో తమ బాధ్యతను మరింత పెంచిందని కేటీఆర్ అన్నారు. జాతీయ పార్టీలకు డిపాజిల్లు దక్కకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కార్యక్రమాన్ని మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.