క్యాంపు నుంచి నేరుగా చేరుకుని.. | TRS Wins All Municipalities In Khammam | Sakshi
Sakshi News home page

పురపాలక జోష్‌

Published Tue, Jan 28 2020 11:43 AM | Last Updated on Tue, Jan 28 2020 12:22 PM

TRS Wins All Municipalities In Khammam - Sakshi

మధిరలో చైర్‌పర్సన్‌ ఎన్నికకు చేతులెత్తి ఓటేస్తు్తన్న అధికార పార్టీ కౌన్సిలర్లు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం నూతన పాలక వర్గాలు కొలువు దీరాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మూడు మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే అనేకమంది ఆశించడంతో ఎంపికకు తీవ్ర కసరత్తు చేశాక చివరకు అంతా ఏకగ్రీవమయ్యారు. వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కూసంపూడి మహేష్, వైస్‌ చైర్‌పర్సన్‌గా అదే పార్టీకి చెందిన తోట సుజలరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైరా మున్సిపల్‌ చైర్మన్‌గా సూతకాని జైపాల్, వైస్‌ చైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు, మధిర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మొండితోక లత, వైస్‌ చైర్‌పర్సన్‌గా యరమల విద్యాలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నికను అధికారులు నిర్వహించారు. సత్తుపల్లి మినహా మధిర, వైరాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు ఉదయం 11 గంటల సమయంలో క్యాంప్‌ నుంచి నేరుగా చేరుకుని కౌన్సిలర్లుగా తొలుత పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పోటీ పడిన పార్టీ నేతల్లో కొందరు తమకు చేజారిపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్టీ నేతలు వారికి నచ్చచెప్పి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

మూడు చోట్లా ఎన్నిక, ప్రమాణ స్వీకారాలు ఇలా..
సత్తుపల్లి అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంప్‌నకు వెళ్లకపోవడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంప్‌ కార్యాలయం నుంచి నేరుగా మున్సిపల్‌ ఆఫీస్‌కు చేరుకుని పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12: 30గంటలకు చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు పోటీ చేసే జాబితాను ఎన్నికల అధికారి, కల్లూరు ఆర్డీఓ శివాజీకి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందించారు.

వైరాలో  వైరా మున్సిపల్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతికి ఎమ్మెల్యే రాములు నాయక్‌ తమ పార్టీ తరఫున పోటీచేసే చైర్మన్, వైస్‌చైర్మన్‌ జాబితాను అందజేశారు. వైరా శాసనసభ్యులు రాములునాయక్, వైరా మున్సిపాలిటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మధిరలో మున్సిపల్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా రెవెన్యూ అధికారి శిరీషకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అందజేశారు. మధిరలో జరిగిన చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను ఎన్నికల పరిశీలకులు, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పర్యవేక్షించారు.

ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరం రాలే..
శాసనసభ్యుడి హోదాలో ఎక్స్‌ అఫీషియో సభ్యులకు సైతం మున్సిపాలిటీలో ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ వినియోగించుకునే అవసరం రాలేదు. సత్తుపల్లి, వైరాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, మధిరలో కాంగ్రెస్‌ శాసన  సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క వినియోగించుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే సత్తుపల్లి, వైరా, మధిరలో టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో శాసనసభ్యులు ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓట్లు వేసే అవకాశం లేకుండానే చైర్మన్, వైస్‌ చైర్మన్లు పూర్తి మెజార్టీతో గెలుపొందారు. మధిరలో కాంగ్రెస్‌ కూటమికి మున్సిపల్‌ చైర్మన్‌గా పోటీ చేసే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో మల్లు భట్టి విక్రమార్కకు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం కలగలేదు.

సత్తుపల్లిలో ‘కొత్తూరు’ అలక, సండ్ర కానుక
సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని చివరి వరకు ఆశించిన పార్టీ నేత కొత్తూరు ఉమామహేశ్వరరావు తీవ్ర నిరాశకు గురయ్యారు. సదరు నేతకు సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి అవకాశం కల్పిస్తామని మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్ల సమావేశంలో ప్రకటించారు. అయితే మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ప్రమాణం చేసిన కొత్తూరు ఉమామహేశ్వరరావు అనంతరం జరిగిన చైర్మన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement