సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్, మేయర్‌ల ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు జీవితంలో ఏ ఒక్క వర్గానికి అవకాశం ఇవ్వకపోగా, అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలను, ప్రభుత్వం తిట్టడం వల్ల ఓట్లు పడవని, అభివృద్ధి పనులు చేస్తేనే అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీచరాజకీయాలు చేయడం ఆపేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్‌ఎస్ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ పూలే వారసుడు
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడని, అన్ని వర్గాల ప్రజలను ఆయన న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment