srinivasa goud
-
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. @raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 -
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పుడు గెలిపించేది ఎవరిని?
మహబూబ్‌నగర్ నియోజకవర్గం గెజిటెడ్ అదికారుల సంఘం అధ్యక్షుడుగా తెలంగాణ ఉద్యమంలో ఒక భూమిక పోషించిన మహబూబ్‌నగర్ సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ రెండోసారి విజయం సాదించారు. ఆ తర్వాత ఆయనకు కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. టిఆర్ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన శ్రీనివాసగౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది ఎమ్.చంద్ర శేఖర్‌పై 57775 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. శ్రీనివాసగౌడ్‌కు 86474ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 28699 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసి ఇబ్రహిం సయ్యద్‌కు 21600 పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడో స్థానంలో నిలిచారు. 2014లో శ్రీనివాస గౌడ్ , బిజెపి నేత శ్రీనివాసరెడ్డిపై 3139 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్‌తో పాటు, టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధి కూడా ఉన్నా, టిఆర్ఎస్ నేతగా శ్రీనివాసగౌడ్ విజయం సాధించడం విశేషం. మహబూబ్ నగర్లో పదకుండుసార్లు బిసి నేతలు, నాలుగుసార్లు రెడ్డి నేతలు,రెండుసార్లు ముస్లిం నేతలు గెలుపొందారు. 2009లో గెలిచిన స్వతంత్ర సభ్యుడు రాజేశ్వరరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో జరిగిన ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నెం శ్రీనివాసరెడ్డి సంచలన విజయం సాధించారు. కాని2014 సాధారణ ఎన్నికలో ఓటమిపాలయ్యారు. 2004లో కూడా ఇక్కడ ఇండిపెండెంటుగా పోటీచేసిన కాంగ్రెస్ ఐ తిరుగుబాటు అభ్యర్ధి పులివీరన్న గెలిచారు. మహబూబ్‌నగర్‌కు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, బిజేపి ఒకసారి, ప్రజాపార్టీ ఒకసారి గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి నెగ్గారు. టిడిపి పక్షాన సీనియర్ నేత పి. చంధ్రశేఖర్ మహబూబ్‌నగర్‌లో నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారిలో ఇబ్రహిం ఆలీ అన్సారీ, ఎమ్. రామిరెడ్డి, పులి వీరన్నలు రెండేసి సార్లు గెలిచారు. చంధ్ర శేఖర్ గతంలో ఎన్.టి.ఆర్.,చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేస్తే, పులి వీరన్న 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. ఇబ్రహిం ఆలీ అన్సారీ పూర్వం కాసు, పి.వి., జలగం, క్యాబినెట్లలో ఉన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినతరం’
సాక్షి, హైదరాబాద్: కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని.. వారికి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ ఇళ్లకే సరఫరా చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి అవసరాలు తెలుసుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగ్గు జాగ్రత్తలతో నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. -
‘తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్, మేయర్ల ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు జీవితంలో ఏ ఒక్క వర్గానికి అవకాశం ఇవ్వకపోగా, అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలను, ప్రభుత్వం తిట్టడం వల్ల ఓట్లు పడవని, అభివృద్ధి పనులు చేస్తేనే అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీచరాజకీయాలు చేయడం ఆపేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడు టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడని, అన్ని వర్గాల ప్రజలను ఆయన న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. -
‘హోదా ఇచ్చేవరకు పోరాటం సాగిస్తాం ’
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. హోదా ఇచ్చేవరకు కేంద్రంపై తమ పోరాటం కనసాగుతుందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో రెండు రాష్ట్రలకు మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రెండు రాష్ట్రాలలో ఎలా అధికారంలోకి రావాలో అన్న ఆలోచనను పక్కకు పెట్టి ప్రజలకు ఎలా మంచి చేయాలో ఆలోచించాలని సూచించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు ముఖ్యమంత్రులు చూపిస్తున్న చొరవ దేశంలోనే ఆదర్శవంతం అని ప్రశంసించారు. -
పాలమూరు పచ్చబడాలి
మహబూబ్‌నగర్: పాలమూరు పచ్చబడాలి.. పాత రోజులు మళ్లీ రావాలి.. రాబోయే అతి తక్కువ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. ఆ నీటితో కళతప్పిన పాలమూరు పంటలతో కళకళలాడేలా చేస్తాం.. అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించే రోజులు త్వరలోనే రానున్నాయి అని భరోసా కల్పించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు జవాన్లతో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనను తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తుందన్నారు. అగ్రగామిగా నిలబెడతా.. ఐదేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, అదేస్థాయిలో జిల్లాను కూడా ప్రగతి పథంలో నడిపించి జిల్లాను అగ్రగామిగా నిలబెడతానని మంత్రి అన్నారు. పరాయిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి వెనకబడిందని, విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలయిందని, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పడావు పడిన దుస్థితి నెలకొందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించిందని, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు.. రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయని, దేశ ప్రజల దృష్టి అంతా రాష్ట్రం వైపు ఉందని తెలిపారు. కరువు, కాటకాలతో అల్లాడుతూ నిత్య వలసలతో జీవకళ కోల్పోయిన పాలమూరు జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో పంటలు పండించడానికి సాగునీరు, తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, 11 మండలాల్లో 2 లక్షల 17 వేల 240 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చిన్ననీటి వనరుల పునరుద్ధరణపై మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటి నిల్వ సామర్ధ్యం పెంచడానికి ఒండ్రుమట్టి పూడిక తీయుట, చెరువు కట్టలను పటిష్టం చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు 638 పనులు పూర్తిచేసి రూ.123 కోట్లు ఖర్చుచేయించామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ పంటలకు 19,619 ఎకరాలకు నీళ్లివ్వడం జరిగిందని, దీంతో పాటు 42 చిన్ననీటి పారుదల సంస్థ చెరువులను నింపి అదనంగా 8 చెరువులు నింపడం కోసం 5 తూములు నిర్మాణాల పనులు మొదలెట్టామని వివరించారు. జిల్లాలో ధాన్యం నిలువ చేయడానికి గోదాములు నిర్మాణం కోసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా 1,01,723 మంది రైతుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. రైతాంగం ఆనందం.. రైతుబంధు పథకం కింద జిల్లాలో ఏడాదికి రెండు దఫాలుగా రూ.8వేల చొప్పున సాయం అందించామని, ఈ ఏడాది నుంచి రూ.10వేల చొప్పున పెంచి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు కింద జిల్లాలో 2018–19 రబీలో 152.30 కోట్లను, లక్షా 43 వేల 937 మంది రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో 93,850 రైతులను అర్హులుగా గుర్తించడం జరిగిందని, 450 మంది రైతులు మరణించగా 443 రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.22.15 కోట్లు ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. పరుగు పెడుతున్న అభివృద్ధి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారిని నాలుగులైన్ల కోసం రూ.193 కోట్లతో 29 మే 2019లో పనులు ప్రారంభించామని, అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.96.70కోట్లు విడుదల చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.43.83 కోట్లు మంజూరయ్యాయని, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.377.98 కోట్లతో 27 పనులు మంజూరి చేయగా దీంట్లో 5 పనులు పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. ఇందిర జలప్రభ కింద విద్యుత్ పనుల కోసం 280 కనెక్షన్ దరఖాస్తులు స్వీకరించి 260 వ్యవసాయ కనెక్షన్లు రూ.3.89 కోట్లతో ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ కోసం 9 సబ్స్టేషన్లలో పీటీఆర్ స్థాయిని పెంచడానికి రూ.5.35 కోట్ల నిధులు మంజూరు చేయగా, 7 సబ్స్టేషన్లలో రూ.4.45 కోట్ల పనులు పూర్తికాగా మిగిలిన 2 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. వృద్ధులకు ఆసరా పింఛన్లను పెంచి పంపిణీ చేస్తుండటంతో పేదలు ఆనందంగా జీవనం గడుపుతున్నారని, వీరితో పాటు దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులకు, ఎయిడ్స్ బాధితులకు కూడా ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించామని, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నవాబుపేట కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగుతులు నిర్వహించి అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 20,268 లబ్ధిదారులకు రూ.48.03 కోట్లతో ఉచిత ఆపరేషన్లు చేయించామన్నారు. జిల్లాకు 10,549 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాగా వాటిలో 1855 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఐకేపీ మహిళా సంఘాల సభ్యులతో 43 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా 8,625 రైతుల నుంచి 41,948 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 22 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. జిల్లాలో కల్యాణలక్ష్మి ద్వారా 2018–19 సంవత్సరానికి గాను 3,505 లబ్ధిదారులకు రూ.28.94 కోట్లు అందించామని, షాదిముబారక్ పథకం కింద జిల్లాలో 753 లబ్ధిదారులకు రూ.5.75 కోట్లు అందించామన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద 32,263 మంది అర్హులైన వారికి రూ.142.85 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని అందించామని, 163 మత్స్య పారి్ర/æశామిక సహకార సంఘాలను బలోపేతం చేయడానికి 185 ఇరిగేషన్ చెరువులు, రిజర్వాయర్లలో రూ.కోటి 15 లక్షల మేలు రకం చేపల విత్తనాలు అందించామని, చేపల పెట్టుబడి, మార్కెటింగ్ కోసం 2563 ద్విచక్ర వాహనాలు 204 నాలుగు చక్రాల వాహనాలు అర్హులకే అందించామన్నారు. జిల్లాలో 154 మంది పారిశ్రామిక వేత్తలు పలు రకాల పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకోగా 501 మందికి అనుమతులు ఇచ్చామని, జిల్లాలో ఇప్పటివరకు 17,409 మందికి 438 సూక్ష్మ, చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమల కోసం రూ.2924 కోట్ల పెట్టుబడితో ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు. జిల్లాలో 65,374 మంది గర్బిణులను గుర్తించి 29,810 మందికి వారిలో అర్హులైన 25,321 మందికి కేసీఆర్ కిట్ అందించామని తెలిపారు. అప్పన్నపల్లి రిజర్వు ఫారెస్టులో ఏర్పాటుచేసిన మయూరి ఏకో పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.80 లక్షలు ఖర్చుచేశామని, ఈ పార్కు అభివృద్ధి నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.3 కోట్లతో పనులు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వారు చేనేత కార్మికులకు నూలును 40 శాతం రాయితీతో అందించాలనే ఉద్దేశ్యంతో ‘చేనేత మిత్ర’ అనే పథకాన్ని తీసుకరాగా ఇప్పటివరకు ఈ పథకము కింద జిల్లాలో 37 మగ్గాలు రిజిస్టర్ కాబడి సుమారుగా 52 మంది చేనేత కార్మికులకు రూ.2,42,450లు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. -
ఆంధ్రా పార్టీ అవసరమా?! శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరును ఎండబెట్టిన ఆంధ్రా పార్టీ టీడీపీ ఇక్కడ అవసరమా అని టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తాము.. అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ చెరోవైపు ఉన్నాయని.. ఎవరికి ఓటేయాలని ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణను అడ్డుకోవడమే కాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టకుండ కేంద్రానికి లేఖలు రాసి పాలమూరు ప్రజల ఉసురుతీస్తున్న టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ల గల్లంతు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజేందర్‌గౌడ్, రాజేశ్వర్, వెంకటయ్య, పెద్దవిజయ్కుమార్, శివరాజ్ పాల్గొన్నారు. కాగా, తెలంగాణ జన సమితి హన్వాడ మండల అధ్యక్షుడు ఆంజనేయులు తన అనుచరులతో శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎన్ఎస్యూఐ టౌన్ సెక్రటరీ మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో నరేష్, శ్రీను, శ్రీకాంత్, శాంతి, కాంతు, మహేష్, బండ్లగేరికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్, మున్నూర్ శ్రీహరి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో అమరేందర్, నర్సింహయ్య, బాలకిషన్, నర్సిములు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం మహబూబ్‌నగర్ రూరల్: మరోసారి గెలిపిస్తే పాలమూరు – రంగారెడ్డి పథకం ద్వారా సస్యశ్యామలం చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. మండలంలోని ఓబ్లాయిపల్లి, కోటకదిర, అల్లీపూర్లో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. ఓబ్లాయిపల్లిలో కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ జయమ్మ తన కుమారుడు నర్సిములుయాదవ్తో కలిసి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ వై.శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డితో పాటు పి.రవీందర్‌రెడ్డి, రామకిష్టమ్మ, విజయలక్ష్మి, చంద్రకళ, దేవేందర్‌రెడ్డి, లక్ష్మయ్య, వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, రాజుగౌడ్, రాజవర్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, కలాల్ పాషా, మూసాబాయి, ఆంజనేయులు, వెంకటస్వామి పాల్గొన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కే దళిత బహుజనుల ఓట్లు మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమానికి శ్రమిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌కు దళిత, బహుజనులమంతా ఓటేసి గెలిపించుకుందామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్ పిలుపునిచ్చారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్, జాతీయ మాలల ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని 36వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. మాజీ కౌన్సిలర్ బుర్రన్న, నాయకులు రాషాత్ఖాన్, ప్రభాకర్, సింగిరెడ్డి పరమేశ్వర్, మునిస్వామి, మల్లెల రాజశేఖర్, కానుగడ్డ యాదయ్య, రాజగాని అశోక్, జి.చెన్నయ్య, కరాటే సత్యం, కట్ట మహేష్, ఎస్.బాలరాజు, కె.తిరుమలయ్య, అనిల్, బి.కృష్ణ, జంబార్, బంగ్లా వెంకటయ్య, పి.వెంకటేష్ పాల్గొన్నారు. -
మరోసారి గెలిపిస్తే రెట్టింపు పనులు
సాక్షి,హన్వాడ: నియోజకవర్గంలో 60ఏళ్లుగా చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో చేసి చూపించామని, మరోసారి ఆశీర్వదిస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తానని మహబూబ్‌నగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, ఇబ్రహీంబాద్, పుల్పోనిపల్లిలో ఇం టింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్ర తి గ్రామానికి బీటీరోడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, మిషన్‌కాకతీయ పథకంలో చెరువుల పునర్నిర్మాణం చేసినట్లు వివరించారు. అదేవిధంగా కల్యాణలక్షి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఇచ్చి ఆదుకుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016లు ఇవ్వనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో శ్రీనివాస్‌గౌడ్‌కు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు బ్యాండు మేళాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది గండేడ్: టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే మళ్లీ టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని పరిగి అసెంబ్లీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్‌రెడ్డి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి అన్నారు. శుక్రవా రం మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. పేదలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలో తీసుకురావాలని కోరారు. పరిగి ని యోజకవర్గంలో 30ఏళ్లుగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. మహిళలకు ఎంతో చేయూతనిస్తున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మహిళలంతా ఏకతాటిపై నిలిచి విజయకేతనం ఎగురవేయాలని సూ చించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మివెంకట్, నీరజ, జోగుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ పర్మిట్ ఇవ్వండి.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత రవాణా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వకపోతే ఏపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నేతలు సయ్యద్ సాధిక్, నవాజ్ గోరి తదితరులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను టక్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లారీ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత విధానం వల్ల నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు చెల్లించాల్సి వస్తోందని, దీంతో లారీ యాజమాన్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్ విధానం ద్వారా రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఏపీకి కూడా తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఏపీనే ముందుకు రావట్లేదని చెప్పారు. జూన్ 6 లోగా ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే కోదాడ వద్ద ఏపీ లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
హోంగార్డులకు కేసీఆర్ వరాలు హర్షనీయం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బె డ్రూం ఇళ్లలో హోంగార్డులు, కానిస్టేబుళ్లకు 10 శాతం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో హోంగార్డులు నిర్లక్ష్యానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుతూ.. రాష్ట్ర హోంగార్డుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర హోంగార్డుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి కుమారస్వామి ఉన్నారు. -
దొంగే.. దొంగా దొంగాని అరిచినట్టుంది: శ్రీనివాసగౌడ్
హైదరాబాద్: అవమానాలు పడ్డ చోటే లక్షకోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలంగాణ అసెంబ్లీ జరగడంపై తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ టీడీపీ, కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేత శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. ఖాళీలు లేవన్న నెపంతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని కోరామని చెప్పారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని సూచించామన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి వారి సొంత ప్రాంతానికి పంపాలని కోరినట్టు తెలిపారు. అపాయింటెడ్ డే మార్చడం కుదురదని హోంశాఖ తేల్చి చెప్పిందని శ్రీనివాసగౌడ్ వెల్లడించారు. -
భద్రాచలాన్ని వేరుచేస్తే ఊరుకోం: శ్రీనివాసగౌడ్
ఖమ్మం : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి భద్రాచలాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయాలని చూస్తే ఊరుకోమని, మరో ఉద్యమం తప్పదని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆప్రాంత నాయకులు కుట్రలుపన్నుతున్నారని, దీనిపై ఉద్యమించాల్సిన ఇక్కడి ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం సరికాదన్నారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరు చేయవద్దంటూ ఖమ్మంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ దీక్ష బుధవారం నాలుగోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని శ్రీనివాసగౌడ్ సందర్శించి, ఏలూరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆమరణ దీక్ష చేపట్టిన ఏలూరి శ్రీనివాసరావుకు ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. భద్రాద్రి కోసం ఏలూరి చేపట్టిన దీక్షకు మంత్రులు, అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. -
తుస్స్స్స్స్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. అనూహ్యంగా రైతులు ఎన్నడూ లేనంతగా నష్టపోయారు. కరువు కాలంలో అయితే.. అన్నదాతలకు కనీసం పెట్టుబడులన్నా మిగిలేవి. కానీ, తుపానుతో అటు పెట్టుబడులు, ఇటు దిగుబడి పోయి రెండు విధాలుగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే పాడై అక్కరకు రాకుండా పోయే సరికి గుండెపగిలి చనిపోతున్నాడు. ఇలాంటి ఆపద సమయంలో బాధిత రైతాంగాన్ని ఓదార్చేం దుకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరగాల్సింది పోయి, రాజ కీయంగా లాభపడేందుకు ఆరాటపడుతున్న టీడీపీ తీరు విమర్శల పాలైంది. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని టీడీపీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అయితే, ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆరోపిస్తూ, రైతుల సమస్యనూ ముడిపెట్టి ఎకాఎకిన జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చింది. కానీ, నిలువెల్లా నిస్తేజం ఆవరించి ఉన్న టీడీపీ శ్రేణులు నాయకుల పిలుపునకు అంతగా స్పందించలేదు. బంద్ ప్రకటనతో స్కూళ్లు ముందే సెలవులు ప్రకటించినా, కాలేజీలు మాత్రం యధావిధిగా పనిచేశాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ బస్ డిపోల ఎదుట బైఠాయించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని బస్సు సర్వీసులు నడిచాయి. ఇక, రాస్తారోకోల పేరుతో అరెస్టు కావడానికి నాయకులు ఎక్కువ ఉత్సాహం చూపించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా బంద్ ఘోరంగా విఫలమైంది. బాధిత రైతులను ఓదార్చాల్సింది పోయి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేతలు అభాసు పాలయ్యారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో ఎక్కడా బంద్ కనిపించలేదు. బంద్ తీరు ఇలా... నల్లగొండలో బంద్ విఫలమైంది. టీడీపీ నాయకులు బంద్ పాటించాలని ఎన్జీ కాలేజీ వద్ద రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ప్రధాన కార్యదర్శి అయిలయ్య, నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేసి టుటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాపార సంస్థలు,రోడ్డు రవాణాను యధావిధిగా నడిచాయి. భువనగిరి నియోజకవర్గంలో బంద్ పూర్తిగా విఫలమైంది. భువనగిరి పట్టణంతో పాటు, మండలం, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో బంద్ ఎక్కడా జరుగలేదు. భువనగిరిలో మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మునుగోడులో తమ్ముళ్ల స్పందన కరువైంది. నాయకులెవరూ బంద్ చేయించలేదు. మిగతా మండలాల్లోనూ పాక్షికంగా జరిగింది. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి బంద్ పాటించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసి వేయించారు. దేవరకొండ పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దుకాణాలను మూసివేయించడంతో పాటు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించారు. పెద్దవూరలో మంత్రి జానారెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డగించగా, హాలియాలో టీడీపీ నాయకులు మూసివేయించిన దుకాణాలను కాంగ్రెస్ నాయకులు తిరిగి తెరిపించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు తెరిచిన దుకాణాలను తిరిగి మూసివేస్తుండగా పోలీసులు టీడీపీ నాయకులకు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ చేయించారు. కోదాడలో టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయించారు. రంగా థియేటర్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్డు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కళాశాలలు యధావిధిగా నడిచాయి. చిలుకూరులో మాత్రమే బంద్ జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీడీపీ బంద్ పాక్షికంగా జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ బస్సులు నడిచాయి. వాణిజ్య సంస్థలు మధ్యాహ్నం వరకు బంద్ పాటిం చాయి. టీడీపీ నాయకులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. వేములపల్లి, దామరచర్ల మండల కేంద్రాల్లో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తుంగతుర్తిలో బంద్ ప్రశాం తంగా జరిగింది. విద్యా సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు. అర్వపల్లి, నూతనకల్, మోత్కురుల్లో రాస్తారోకో చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాం తంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, దుకాణాలను మూసివేయించారు. మెయిన్ సెంటర్లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. రామన్నపేట మండలంలో బంద్ విఫలమైంది. సూర్యాపేటలో వ్యాపారవర్గాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు బంద్ చేయించారు. బస్సు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. -
'7వ తేదీన హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ'
హైదరాబాద్ : సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, జేఏసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నుంచి హామీ ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని వారు అన్నారు. తెలంగాణ మంత్రులతో భేటీ అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టకుండా నాన్చటం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన ప్రభుత్వం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కట్టడి చేయకపోవటం సరికాదని జేఏసీ నేతలు అన్నారు. మొదట నుంచి తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. ఏడో తేదీన తెలంగాణ సాధన ర్యాలీ సిటీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు దాకా జరుగుతుందన్నారు. ఒకటిన గ్రేటర్ హైదరాబాద్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్‌నగర్‌ల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు.