తుస్‌స్‌స్‌స్‌స్..! | TDP's bandh failed | Sakshi
Sakshi News home page

తుస్‌స్‌స్‌స్‌స్..!

Published Sat, Nov 9 2013 3:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

TDP's bandh failed

సాక్షిప్రతినిధి, నల్లగొండ:  భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. అనూహ్యంగా రైతులు ఎన్నడూ లేనంతగా నష్టపోయారు. కరువు కాలంలో అయితే.. అన్నదాతలకు కనీసం పెట్టుబడులన్నా మిగిలేవి. కానీ, తుపానుతో అటు పెట్టుబడులు, ఇటు దిగుబడి పోయి రెండు విధాలుగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే పాడై అక్కరకు రాకుండా పోయే సరికి గుండెపగిలి చనిపోతున్నాడు. ఇలాంటి ఆపద సమయంలో బాధిత రైతాంగాన్ని ఓదార్చేం దుకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరగాల్సింది పోయి, రాజ కీయంగా లాభపడేందుకు ఆరాటపడుతున్న టీడీపీ తీరు విమర్శల పాలైంది.

గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని టీడీపీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అయితే, ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆరోపిస్తూ, రైతుల సమస్యనూ ముడిపెట్టి ఎకాఎకిన జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చింది. కానీ, నిలువెల్లా నిస్తేజం ఆవరించి ఉన్న టీడీపీ శ్రేణులు నాయకుల పిలుపునకు అంతగా స్పందించలేదు. బంద్ ప్రకటనతో స్కూళ్లు ముందే సెలవులు ప్రకటించినా, కాలేజీలు మాత్రం యధావిధిగా పనిచేశాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ బస్ డిపోల ఎదుట బైఠాయించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని బస్సు సర్వీసులు నడిచాయి. ఇక, రాస్తారోకోల పేరుతో అరెస్టు కావడానికి నాయకులు ఎక్కువ ఉత్సాహం చూపించారు.

ఫలితంగా జిల్లా వ్యాప్తంగా బంద్ ఘోరంగా విఫలమైంది. బాధిత రైతులను ఓదార్చాల్సింది పోయి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేతలు అభాసు పాలయ్యారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో ఎక్కడా  బంద్ కనిపించలేదు.
 బంద్ తీరు ఇలా...
  నల్లగొండలో బంద్ విఫలమైంది. టీడీపీ నాయకులు బంద్ పాటించాలని ఎన్జీ కాలేజీ వద్ద రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ప్రధాన కార్యదర్శి అయిలయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేసి టుటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాపార సంస్థలు,రోడ్డు రవాణాను యధావిధిగా నడిచాయి.
  భువనగిరి నియోజకవర్గంలో బంద్ పూర్తిగా విఫలమైంది. భువనగిరి పట్టణంతో పాటు, మండలం, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో బంద్ ఎక్కడా జరుగలేదు. భువనగిరిలో మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
  మునుగోడులో తమ్ముళ్ల స్పందన కరువైంది. నాయకులెవరూ బంద్ చేయించలేదు. మిగతా మండలాల్లోనూ పాక్షికంగా జరిగింది.
  దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి బంద్ పాటించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసి వేయించారు. దేవరకొండ పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దుకాణాలను మూసివేయించడంతో పాటు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించారు. పెద్దవూరలో మంత్రి జానారెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డగించగా, హాలియాలో టీడీపీ నాయకులు మూసివేయించిన దుకాణాలను కాంగ్రెస్ నాయకులు తిరిగి తెరిపించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు తెరిచిన దుకాణాలను తిరిగి మూసివేస్తుండగా పోలీసులు టీడీపీ నాయకులకు అరెస్ట్ చేశారు.
  హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ చేయించారు.
  కోదాడలో టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయించారు. రంగా థియేటర్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్డు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కళాశాలలు యధావిధిగా నడిచాయి. చిలుకూరులో మాత్రమే బంద్ జరిగింది.
  మిర్యాలగూడ నియోజకవర్గంలో టీడీపీ బంద్ పాక్షికంగా జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ బస్సులు నడిచాయి. వాణిజ్య సంస్థలు మధ్యాహ్నం వరకు బంద్ పాటిం చాయి. టీడీపీ నాయకులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. వేములపల్లి, దామరచర్ల మండల కేంద్రాల్లో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
  తుంగతుర్తిలో బంద్ ప్రశాం తంగా జరిగింది. విద్యా సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు. అర్వపల్లి, నూతనకల్, మోత్కురుల్లో రాస్తారోకో చేశారు.                          
  నకిరేకల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాం తంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, దుకాణాలను మూసివేయించారు. మెయిన్ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. రామన్నపేట మండలంలో బంద్ విఫలమైంది.
  సూర్యాపేటలో వ్యాపారవర్గాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు బంద్ చేయించారు. బస్సు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement