మిర్యాలగూడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతవరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బోణీనే కొట్టలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా వివిధ రాజకీయ పార్టీలతో కుదుర్చుకునే పొత్తులలో భాగంగా కొన్ని నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించే వారు. పొత్తులలో భాగంగా పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజవర్గంలో రెండు, మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయినా జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవలేదు. జిల్లాలో మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో 1999, 2004లో రెండు పర్యాయాలు పోటీ చేయడంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో 2014లో కూడా పోటీ చేసి ఇప్పటి వరకు ఓటర్లు అవకాశం ఇవ్వలేదు.
మిర్యాలగూడలో..
మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మూడు పర్యాయాలు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఏడు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు పర్యాయాలు సీపీఎం అభ్యర్థులు గెలవగా ఒక పర్యాయం పీడీఎఫ్ గెలిచింది. 1999లో సుందరి అరుణ టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేపాల శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలమైంది. అదేవిధంగా 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా బంటు వెంకటేశ్వర్లు పోటీ చేసి ఓడిపోయారు.
దేవరకొండలో..
దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. 1978 నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్టీలకు రిజర్వ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు సాధారణ, ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. ఉపఎన్నికలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఐదు పర్యాయాలు, నాలుగు పర్యాయాలు సీపీఐ గెలుపొందగా రెండు పర్యాయాలు పోటీ చేసిన టీడీపీ ఓటమి పాలైంది. 1999లో టీడీపీ అభ్యర్థిగా నీనావత్ వశ్యానాయక్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ధీరావత్ రాగ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అదే విధంగా 2004లో టీడీపీ తరఫున సక్రునాయక్ పోటీ చేసి సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా బిల్యానాయక్ కాంగ్రెస్ మద్దతులో పోటీ చేసి రవీంద్రకుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు.
మనుగోడులో..
మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా వారికే కేటాయించే వారు. కానీ ఇక్కడ కూడా రెండు పర్యాయాలు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజవర్గం 1967లో ఏర్పడగా ఇప్పటి వరకు 11 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాగా ఐదు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు పర్యాయాలు సీపీఐ, ఒక పర్యాయం టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జెల్లా మార్కండేయులు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేతిలో, 2004లో టీడీపీ అభ్యర్థి కాశీనాథ్ పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇలా రెండు పార్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయి బోణీ కొట్టలేదు.
నకిరేకల్‌లో..
కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచింది నకిరేకల్. ఇక్కడ మొదటి నుంచీ కూడా టీడీపీ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకే సీటు కేటాయించారు. కానీ ఇక్కడ మూడు పర్యాయాలు టీడీపీ పోటీ చేసినా లాభం లేకుండా పోయింది. ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడగా ఇప్పటికి 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాగా పీడీఎఫ్, సీపీఐ, టీఆర్‌ఎస్ ఒక్కొక్క పర్యాయం, 8 పర్యాయాలు సీపీఎం, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కటికం సత్తయ్యగౌడ్ సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై ఓటమి పాలయ్యారు.
హుజూర్‌నగర్‌లో..
హుజూర్‌నగర్ నియోజకవర్గం 1952లో ఏర్పడి 1972లో రద్దయింది. 2009లో కొత్తగా ఏర్పడింది. కాగా ఇక్కడ మొత్తం ఏడు పర్యాయాలు సాధారణ, ఒక పర్యాయం ఉప ఎన్నికలు జరిగాయి. కాగా మూడు పర్యాయాలు పీడీఎఫ్, నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడి హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సంవత్సరం టీడీపీ పోటీ చేయలేదు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన స్వామిగౌడ్ ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment