కమలనాథుల.. భారీ స్కెచ్‌!  | BjP Strategies To Strengthen Party In Nalgonda | Sakshi
Sakshi News home page

కమలనాథుల.. భారీ స్కెచ్‌! 

Published Sun, Jul 7 2019 7:09 AM | Last Updated on Sun, Jul 7 2019 3:38 PM

BjP Strategies To Strengthen Party  In  Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సంస్థాగతంగా బలపడేందుకు కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారా..? ఆయా పార్టీల్లోని అసంతృప్తులను తమ గూటి కిందకు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారా..? ప్రధానంగా త్రిశంకు స్వర్గంలో ఉన్న టీడీపీ నాయకులు.. శ్రేణులపై దృష్టి పెట్టారా..? అంటే.. అవుననే సమాధానమిస్తున్నాయి బీజేపీ వర్గాలు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ పార్టీ జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాల్లో విస్తరించినట్లు భావిస్తున్నారు.

కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రస్థాయిలోనూ పార్టీ నాయకత్వం వివిధ పార్టీలనుంచి ఆయా స్థాయిల్లోని నాయకులను చేర్చుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయనున్నారని చెబుతున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటిగా నిలదొక్కుకునేందుకు పావులు కదుపుతోంది. వారం పది రోజుల్లోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అటు టీడీపీ, కాంగ్రెస్‌ తదితర  పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యమైన కేడర్‌ కాషా య కండువాలు కప్పుకోనున్నారని చెబుతున్నారు.

టీడీపీ దుకాణం బందేనా..?
జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఒక  విధంగా ఆ పార్టీ జిల్లా నాయకులు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కొందరు టీఆర్‌ఎస్‌లోకి, మరికొందరు కాంగ్రెస్‌లోకి ఎప్పుడో మారిపోయారు. 2014 ఎన్నికల తర్వాతి నుంచి ఆ పార్టీ పరిస్థితి మరింత అయోమయంగా తయారైంది. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో గానీ, ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గానీ ఆ పార్టీ పోటీనే చేయలేదు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్కచోట కూడా పోటీ చేయలేక పోయింది.

కోదాడనుంచి టికెట్‌ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెం బ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జి ల్లాకే చెందిన మరో నాయకురాలు  పా ల్వాయి రజినీ కుమారి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు అడ్డం వచ్చా యి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఇది పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశను నింపింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు .. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న టీడీపీ నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరడంతో.. టీడీపీ నాయకులు వరస కడుతున్నారని, దీనిలో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆ పార్టీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

క్యూలో.. కాంగ్రెస్‌ నాయకులు ?
బీజేపీలో చేరడానికి కాంగ్రెస్‌ నాయకులు కొందరు క్యూ కడుతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై ధ్వజమెత్తి పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. ఆయన బీజేపీలోనే చేరుతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే తరహాలో మరికొందరు నాయకులు కూడా అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు. ప్రధానంగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్‌ నాయకులు చర్చలు జరుపుతున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

నేటి నుంచి సభ్యత్వ నమోదు
మరో వైపు సంస్థాగత కార్యాచరణలో భాగంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం మొదలు కానుందని పార్టీ వర్గాలు చెప్పాయి. వాస్తవానికి శనివారం నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కావాల్సి ఉండగా.. హైదరాబాద్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రావడం, సభ్యత్వ నమోదును ఆయన లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో.. ఆదివారం నుంచి జిల్లాలో కూడా మొదలు పెట్టనున్నారు. ఒకవైపు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. పార్టీని బలోపేతం చేసుకోవడం, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సాధ్యమైనన్ని వార్డులను గెలుచుకోవడంపై పార్టీ నాయకత్వం దృష్టిపెట్టిందని చెబుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement