పాలమూరు పచ్చబడాలి | Telangana State Formation Day Celebrations Mahabubnagar | Sakshi
Sakshi News home page

పాలమూరు పచ్చబడాలి

Published Mon, Jun 3 2019 7:28 AM | Last Updated on Mon, Jun 3 2019 7:28 AM

Telangana State Formation Day Celebrations Mahabubnagar - Sakshi

స్వాతంత్య్ర సమరయోధుడికి పాదాభివందనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జెండాకు వందనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ తదితరులు

మహబూబ్‌నగర్‌: పాలమూరు పచ్చబడాలి.. పాత రోజులు మళ్లీ రావాలి.. రాబోయే అతి తక్కువ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. ఆ నీటితో కళతప్పిన పాలమూరు పంటలతో కళకళలాడేలా చేస్తాం.. అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల,  పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించే రోజులు త్వరలోనే రానున్నాయి అని భరోసా కల్పించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొదట మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు జవాన్లతో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనను తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తుందన్నారు.

అగ్రగామిగా నిలబెడతా.. 
ఐదేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, అదేస్థాయిలో జిల్లాను కూడా  ప్రగతి పథంలో నడిపించి జిల్లాను అగ్రగామిగా నిలబెడతానని మంత్రి అన్నారు. పరాయిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి వెనకబడిందని, విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలయిందని, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పడావు పడిన దుస్థితి నెలకొందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించిందని, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

బంగారు తెలంగాణ దిశగా అడుగులు.. 
రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయని, దేశ ప్రజల దృష్టి అంతా రాష్ట్రం వైపు ఉందని తెలిపారు. కరువు, కాటకాలతో అల్లాడుతూ నిత్య వలసలతో జీవకళ కోల్పోయిన పాలమూరు జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో పంటలు పండించడానికి సాగునీరు, తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, 11 మండలాల్లో 2 లక్షల 17 వేల 240 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

చిన్ననీటి వనరుల పునరుద్ధరణపై మిషన్‌ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటి నిల్వ సామర్ధ్యం పెంచడానికి ఒండ్రుమట్టి పూడిక తీయుట, చెరువు కట్టలను పటిష్టం చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు 638 పనులు పూర్తిచేసి రూ.123 కోట్లు ఖర్చుచేయించామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కోయిల్‌సాగర్‌ రిజర్వాయర్‌ కింద ఖరీఫ్, రబీ పంటలకు 19,619 ఎకరాలకు నీళ్లివ్వడం జరిగిందని,  దీంతో పాటు 42 చిన్ననీటి పారుదల సంస్థ చెరువులను నింపి అదనంగా 8 చెరువులు నింపడం కోసం 5 తూములు నిర్మాణాల పనులు మొదలెట్టామని వివరించారు. జిల్లాలో ధాన్యం నిలువ చేయడానికి గోదాములు నిర్మాణం కోసం ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా 1,01,723 మంది రైతుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. 

రైతాంగం ఆనందం.. 
రైతుబంధు పథకం కింద జిల్లాలో ఏడాదికి రెండు దఫాలుగా రూ.8వేల చొప్పున సాయం అందించామని, ఈ ఏడాది నుంచి రూ.10వేల చొప్పున పెంచి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు కింద జిల్లాలో 2018–19 రబీలో 152.30 కోట్లను, లక్షా 43 వేల 937 మంది రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో 93,850 రైతులను అర్హులుగా గుర్తించడం జరిగిందని, 450 మంది రైతులు మరణించగా 443 రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.22.15 కోట్లు ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. 

పరుగు పెడుతున్న అభివృద్ధి 

  • మహబూబ్‌నగర్‌–జడ్చర్ల రహదారిని నాలుగులైన్ల కోసం రూ.193 కోట్లతో 29 మే 2019లో పనులు ప్రారంభించామని, అదేవిధంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ.96.70కోట్లు విడుదల చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.  
  • జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణం కోసం రూ.43.83 కోట్లు మంజూరయ్యాయని, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.377.98 కోట్లతో 27 పనులు మంజూరి చేయగా దీంట్లో 5 పనులు పూర్తిచేయడం జరిగిందని తెలిపారు.  
  • ఇందిర జలప్రభ కింద విద్యుత్‌ పనుల కోసం 280 కనెక్షన్‌ దరఖాస్తులు స్వీకరించి 260 వ్యవసాయ కనెక్షన్‌లు రూ.3.89 కోట్లతో ఇవ్వడం జరిగిందన్నారు.  
  • రైతులకు 24 గంటల విద్యుత్‌ కోసం 9 సబ్‌స్టేషన్లలో పీటీఆర్‌ స్థాయిని పెంచడానికి రూ.5.35 కోట్ల నిధులు మంజూరు చేయగా, 7 సబ్‌స్టేషన్లలో రూ.4.45 కోట్ల పనులు పూర్తికాగా మిగిలిన 2 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.  
  • వృద్ధులకు ఆసరా పింఛన్లను పెంచి పంపిణీ చేస్తుండటంతో పేదలు ఆనందంగా జీవనం గడుపుతున్నారని, వీరితో పాటు దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులకు, ఎయిడ్స్‌ బాధితులకు కూడా ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. 
  • ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించామని, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నవాబుపేట కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగుతులు నిర్వహించి అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.  
  • ఆరోగ్యశ్రీ పథకం కింద 20,268 లబ్ధిదారులకు రూ.48.03 కోట్లతో ఉచిత ఆపరేషన్లు చేయించామన్నారు. 
  • జిల్లాకు 10,549 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా వాటిలో 1855 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.  
  • ఐకేపీ మహిళా సంఘాల సభ్యులతో 43 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా 8,625 రైతుల నుంచి 41,948 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 22 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 
  • జిల్లాలో కల్యాణలక్ష్మి ద్వారా 2018–19 సంవత్సరానికి గాను 3,505 లబ్ధిదారులకు రూ.28.94 కోట్లు అందించామని, షాదిముబారక్‌ పథకం కింద జిల్లాలో 753 లబ్ధిదారులకు రూ.5.75 కోట్లు అందించామన్నారు. 
  • గొర్రెల అభివృద్ధి పథకం కింద 32,263 మంది అర్హులైన వారికి రూ.142.85 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని అందించామని, 163 మత్స్య పారి్ర/æశామిక సహకార సంఘాలను బలోపేతం చేయడానికి 185 ఇరిగేషన్‌ చెరువులు, రిజర్వాయర్లలో రూ.కోటి 15 లక్షల మేలు రకం చేపల విత్తనాలు అందించామని, చేపల పెట్టుబడి, మార్కెటింగ్‌ కోసం 2563 ద్విచక్ర వాహనాలు 204 నాలుగు చక్రాల వాహనాలు అర్హులకే అందించామన్నారు. 
  • జిల్లాలో 154 మంది పారిశ్రామిక వేత్తలు పలు రకాల పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకోగా 501 మందికి అనుమతులు ఇచ్చామని, జిల్లాలో ఇప్పటివరకు 17,409 మందికి 438 సూక్ష్మ, చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమల కోసం రూ.2924 కోట్ల పెట్టుబడితో ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు.  
  • జిల్లాలో 65,374 మంది గర్బిణులను గుర్తించి 29,810 మందికి వారిలో అర్హులైన 25,321 మందికి కేసీఆర్‌ కిట్‌ అందించామని తెలిపారు. 
  • అప్పన్నపల్లి రిజర్వు ఫారెస్టులో ఏర్పాటుచేసిన మయూరి ఏకో పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.80 లక్షలు ఖర్చుచేశామని, ఈ పార్కు అభివృద్ధి నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.3 కోట్లతో పనులు చేయడం జరిగిందని తెలిపారు.  
  • తెలంగాణ ప్రభుత్వం వారు చేనేత కార్మికులకు నూలును 40 శాతం రాయితీతో అందించాలనే ఉద్దేశ్యంతో ‘చేనేత మిత్ర’ అనే పథకాన్ని తీసుకరాగా ఇప్పటివరకు ఈ పథకము కింద జిల్లాలో 37 మగ్గాలు రిజిస్టర్‌ కాబడి సుమారుగా 52 మంది చేనేత కార్మికులకు రూ.2,42,450లు వారి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో జమచేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement