ఓడించాడని చంపేశారు! | Telangana Municipal Elections 2020 Rival Stabs Man In Vemulawada | Sakshi
Sakshi News home page

ఓడించాడని చంపేశారు!

Published Thu, Feb 27 2020 2:36 AM | Last Updated on Thu, Feb 27 2020 10:48 AM

Telangana Municipal Elections 2020 Rival Stabs Man In Vemulawada - Sakshi

వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్‌ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్‌ శ్రీధర్‌ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్‌ ప్లాంటులో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్‌ కక్ష పెంచుకున్నాడు.

తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్‌.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్‌పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్‌తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు.

వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్‌ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement