Rowdy sheeter Murder
-
పాత కక్షలు: రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద ఆదివారం రాత్రి రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని గిరిపురానికి చెందిన దినేష్(35) ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ వద్ద గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అర్భన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అతనిపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉంది. బెల్టు మురళి హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడని, పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకొవాలని వెస్ట్ సీఐ శివప్రసాద్‌ను ఆదేశించారు. -
ఓడించాడని చంపేశారు!
వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్ శ్రీధర్ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్ ప్లాంటులో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్‌పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్‌తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ
విశాఖ క్రైం: నగరంలో సంచలనమైన రౌడీషీటర్ మహ్మద్ ఖాసీం హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు కత్తులు, ఒక పిస్టల్, బుల్లెట్స్, స్టీల్ రాడ్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ఈ నెల 2వ తేదీ(గురువారం రాత్రి) 10.50 గంటల సమయంలో ఎల్ఐసీ భవనం దరి(అంబేడ్కర్ విగ్రహం సమీపంలో) ఖాసీంను చిట్టుమామూతో పాటు మరో ఆరుగురు కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మేరుగు చిట్టిబాబు–42(అలియాస్ చిట్టిమామూ), అంబటి మధుసూదనరావు–26(అలియాస్ రుషికొండ మధు), గుడ్ల వినోద్‌కుమార్‌రెడ్డి(26), శీలం సతీష్(23), సయ్యద్ రెహమాన్–24(అలియాస్ మున్నా), చొప్పా హేమంత్‌కుమార్(23), గత్తాడ శ్రీనివాస్(22)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా వివరించారు. గొడవలే హత్యకు కారణం హత్యకు గురైన ఖాసీం, చిట్టిమామూ మధ్య కొన్నేళ్లుగా గొడవులు ఉన్నాయి. ఆధిపత్యం ఈ ముఠాలు ఘర్షణ పడుతుండేవి. ఖాసీం 2010 నుంచి పలు హత్య కేసుల్లో నిందితుడు. చిట్టిమామూ సోదరుడు, కంచరపాలేనికి చెందిన నగష్‌ను ఖాసీం హత్య చేశాడు. నగరంలో ఖాసీం, బత్తిన మురళీ, చిటిమామూల వర్గాల మధ్య వార్ జరుగుతుండడంతో వీరిపై పీడీ యాక్ట్ పెట్టారు. 2017లో చిట్టిమామూ, బత్తిన మురళీ జైలు నుంచి విడుదలయ్యారు. ఖాసీం ఈ ఏడాది జూన్ 12న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి చిట్టిమామూ.. ఖాసీంను హతమార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో చిట్టిమామూ మూడు నెలల కిందట మధు అనే వ్యక్తి పేరు మీద పాత ఆటో(ఏపీ31టీఏ 7472)ను కొనుగోలు చేశాడు. అనకాపల్లిలో సింగ్‌ల వద్ద కత్తులు కొనుగోలు చేశాడు. జూలై 27, 2018న చిట్టిమామూ.. మధుకు ఒక పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లు అందజేశాడు. దీంతో ఖాసీంను హతమార్చేందుకు వ్యూహం రచించారు. ముందుగా ఖాసీం వర్గానికి చెందిన బత్తిన మురళీని గురువారం(ఈనెల 2న) కైలాసపురంలో హత్య చేయడానికి చిట్టిమామూ ముఠా ప్లాన్ చేసింది. అయితే మురళీ చుట్టు పక్కల ఎక్కువ మంది జనాలు ఉండడంతో హత్యకు వీలు కాలేదు. అక్కడి నుంచి వెనుదిరిగిన చిట్టిమామూ ముఠా ఉదయం నుంచే ఖాసీం కదలికలపై రెక్కీ నిర్వహించింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఖాసీం డైమండ్ పార్కు సమీపంలోని సాయిరాం పార్లర్ వద్దకు వస్తాడన్న సమాచారంతో ఆర్యకుమార్, శ్యామ్, శ్రీను, వేముల ఆనంద్, పవన్, ప్రసాద్, గాది వెంకటేష్ కాపు కాశారు. అయితే ఖాసీం రాత్రి 10 గంటలకు సాయిరాం పార్లర్ వద్దకు వచ్చాడు. హత్య చేయడానికి ప్రయత్నించినా జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడే కాపు కాశారు. ఖాసీం రాత్రి 10.30 గంటల సమయంలో సాయిరాం పార్లర్ నుంచి ఎల్ఐసీ భవనం మీదుగా డాబాగార్డెన్స్ వైపు హోండాయాక్టివ్(ఏపీ 31 డీఎన్ 8662)పై ఇంటికి వెళ్తున్నాడు. ఆయనను అంబటి మధు, జి.వినోద్‌రెడ్డి పల్సర్–220 మోటార్ బైక్‌పై, ఆటోలో సయ్యద్ రెహమాన్, చొప్పా హేమంత్‌కుమార్, శీలం సతీష్, రాజేష్ వెంబడించారు. రెహమాన్ డ్రైవింగ్ చేశాడు. హోండా యాక్టివ్ సాయి నడుపుతుండగా.. వెనక ఖాసీం కూర్చున్నాడు. ఆటోతో హోండో యాక్టివ్‌ను ఢీకొట్టారు. దీంతో కింద పడిన ఖాసీంను మధు పిస్టోల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అది పేలకపోవడంతో ఆటోలో ఉన్న వారు కత్తులతో ఖాసీంపై దాడి చేశారు. తల, మెడ, కడుపుపై కత్తులతో బలంగా నరికేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు రాజేష్ పారిపోయాడు. మిగతా ఐదుగురు, చిట్టిమామూ ఇంటికి వెళ్లారు. ఆ తరువాత ఐదుగురితో పాటు చిట్టిమామూ కలిసి మోటర్ సైకిల్, ఆటోలో ఎన్ఏడీ జంక్షన్‌కు వెళ్లి అక్కడున్న శ్రీనుకు పిస్టోల్ అందజేశారు. కశింకోట వెళ్లి స్నేహితుల వద్ద రూ.10 వేలు తీసుకొని అన్నవరం వెళ్లారు. అన్నవరంలోని బస్టాండ్ రోడ్డు వద్ద ఆటోను వదిలేసి, కాకినాడకు వెళ్లిపోయారు. మరుసటి రోజు 3న కారులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లారు. మళ్లీ తిరిగి రాజమండ్రి జొన్నాడకు చేరుకున్నారు. మరో వైపు పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఎన్‌హెచ్–16 తాడి గ్రామంలో ఆటోల వెళ్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఉన్న ఆరు కత్తులు, ఒక పిస్టోల్, ఒక స్టీల్ రాడ్, కారంపొడిని స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ నగరంలో రౌడీయిజం చేస్తే తాటాతీస్తానని సీపీ హెచ్చరించారు. ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ ఫకీరప్ప, ఎస్బీ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ఇంతేనా..ఇదే రియలా!
కాకర పద్మలత హత్య కుట్రకు సంబంధించిన నగదు లావాదేవీలే రౌడీషీటర్ గేదెలరాజు హత్యకు కారణమని ఇన్నాళ్లూ అందరూ భావించారు.. పోలీసులూ అదే చెబుతూ వచ్చారు.. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.. కానీ ఆ హత్యకు అదొక్కటే కారణం కాదని తాజాగా వెల్ల డించారు.. ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వివాదాలు కూడా రాజును బలిగొన్నాయని అంటున్నారు.. ఒక పోలీస్ అధికారి, ఒక పత్రికా నిర్వాహకుడు, ఒక రియల్టర్.. ఈ ముగ్గురు సెటిల్మెంట్లు, రియల్ దందాల్లో ఆరితేరినవారే.. ఆ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకునేవారు.. అటువంటి వాటిలోనే రాటుదేలిన రౌడీషీటర్ గేదెలరాజు వారికి పరిచయమయ్యాడు.. యథాశక్తి వారికి సహకరించేవాడు.. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం విషయంలో బెదిరింపులకు దిగిన పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు పోలీసు అధికారి గేదెల రాజును ప్రయోగించాడు.. అయితే సొమ్ము చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం.. వారి మధ్య బెదిరింపుల దాకా వెళ్లింది.. ఇక రియల్టర్, పత్రికా నిర్వాహకుడు చేపట్టిన భూ దందాల్లో అనవసరంగా తలదూర్చి తనకూ వాటా ఇవ్వాలని బెదిరించి వారి కంటగింపుగా మారిన గేదెల రాజు.. మొత్తానికి ముగ్గురికీ ఉమ్మడి శత్రువుగా మారాడు.. అంతే.. ఆ ముగ్గురూ చేతులు కలిపారు.. పథకం ప్రకారం గేదెలరాజును హతం చేశారు.. వెలుగు చూసిన ఈ ‘రియల్’ కోణంతో ఈ హత్య కేసు దర్యాప్తు దాదాపు ముగిసినట్లేనట!.. ఇక తేలాల్సింది పద్మలత హత్య కేసు మిస్టరీనే.. సాక్షి, విశాఖపట్నం: రౌడీ షీటర్ గేదెలరాజు హత్య కేసులో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పద్మలత హత్యకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బ్లాక్మెయిల్ చేయడం వల్లే డీఎస్పీ రవిబాబు అతన్ని భూపతిరాజు ద్వారా హత్య చేయించాడని చెప్పుకొచ్చిన పోలీసులు తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రవిబాబు ఆఫర్‌కు తోడు గేదెలరాజుతో తనకున్న భూ వివాదాల వల్లే శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని.. ఈ విషయంలో రియాల్టర్ డి.సుబ్బారావు సహకరించాడని చెప్పుకొచ్చారు. గేదెలరాజు హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్టు ప్రకటించిన పోలీసులు పద్మలత హత్య కేసు పురోగతిలో ఉందన్నారు. కేసులో కీలక నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, అతని కారు డ్రైవర్ కేశవ్‌తో పాటు రియాల్టర్ సుబ్బారావును అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపిన వివరాలు ఆసక్తి గొలుపుతున్నాయి. విభేదాలు ఇలా.. మాతృశ్రీ లే అవుట్‌లోని కొంత భూమిని గేదెల రాజు ఆక్రమించడంతో సుబ్బారావుతో అతనికి విభేదాలు ఏర్పడ్డాయి. కాగా పద్మలత హత్య కోసం గేదెలరాజుకు సుపారీ ఇవ్వడానికి తన తోడల్లుడి పేరిట రిజిస్ట్రర్ చేయించిన స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా డీఎస్పీ రవిబాబు సుబ్బారావును కోరాడు. ఆ మేరకు ఆ స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు రవిబాబుకు ఇవ్వగా ఆ సొమ్మును గేదెలరాజుకు ఇచ్చాడు. అడ్వాన్స్‌గా ఆ సొమ్ము తీసుకున్న గేదెల రాజు పద్మలతను విషప్రయోగంతో హతమార్చాడు. ఆతర్వాత మిగిలిన సొమ్ము కోసం గేదెల రాజు ఒత్తిడి చేయడంతో రవిబాబు అతడిని వదిలించుకోవాలని ఎత్తుగడ వేశాడు. రాజును హత్య చేసేందుకు భూపతిరాజుకు 400 చదరపు గజాల స్థలం, రూ.15 లక్షల నగదు ఇచ్చేందుకు రవిబాబు తరపున సుబ్బారావు అంగీకరించాడు. రూ.2.5 కోట్ల స్థల వివాదం వీటితోపాటు ఓ భూ ఆక్రమణ విషయంలో భూపతి రాజు, సుబ్బారావు, గేదెలరాజుల మధ్య విబేదాలు తలెత్తాయి. విమానాశ్రయం వద్ద సాకేతుపాలెం సమీపంలోని బుచ్చిరాజుపాలెం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన దోనపల్లి నాగప్రసాద్ అధీనంలో ఉన్న సర్వే నెం. 69/1బీ1లోని రూ.2.5కోట్ల విలువైన 713 చదరపు గజాల భూమిని భూపతిరాజు తన అనుచరుడైన మహేష్ తదితరులతో కలిసి చౌకగా కొట్టేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారంలో తనకు 50 శాతం వాటా ఇచ్చే షరతుతో భూపతిరాజుకు సుబ్బారావు రూ.40 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొనేందుకు ప్రయత్నించగా.. బినామీ సైట్ ఓనర్ అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అసలు వ్యక్తి అయిన వాడపల్లి వెంకట సూర్య సన్యాసిరావు అలియాస్ పెద్ద వద్దకు వెళ్లి ఆరా తీయగా.. వేరే పార్టీకి దాన్ని అమ్మేస్తున్నరన్న తెలిసింది. దాంతో భూపతిరాజు తన అనుచరుడు మహేష్‌ను పురమాయించాడు. రూ.1.10 కోట్లకు డీల్‌గా పేర్కొంటూ రూ.70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు తన పత్రికలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ అశోక్‌తో పాత తేదీలతో ముందుగానే అగ్రిమెంట్ తయారు చేయించాడు. అనంతరం పెద్ద, నాగప్రసాద్‌లను పత్రిక కార్యాలయానికి రప్పించాడు. హైదరాబాద్ పార్టీ వచ్చిందని పెద్దను బయటపెట్టి నాగప్రసాద్‌ను లోనికి పంపించాడు. అక్కడ మాటు వేసిన శ్రీనివాసరాజు అనుచరులు మహేష్ తదితరులు కత్తులతో బెదిరించి స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్స్, ఖాళీ పేపర్లపై నాగప్రసాద్‌తో సంతకాలు చేయించి స్థలం ఆక్రమించారు. ప్రసాద్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పెద్ద శ్రీనివాసరాజును నిలదీసి బెదిరించాడు. దాంతో ఆ స్థలం చేజారిపోకుండా శ్రీనివాసరాజు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అప్పటి వరకు సైలంట్‌గా ఉన్న గేదెల రాజు ఈ భూ దందాలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తనకూ వాటా కావాలని శ్రీనివాసరాజుపై ఒత్తిడి తెచ్చాడు. ఇందులో తల దూర్చొద్దని స్పష్టం చేసినా వినలేదు. అప్పటికే గేదెల రాజుతో గొడవ పెట్టుకున్న సుబ్బారావు కూడా శ్రీనివాసరాజుతో కలిసి అతన్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో పద్మలత వ్యవహారంలో గేదెల రాజును హతమార్చాలని డీఎస్పీ రవిబాబు శ్రీనివాసరాజును పురమాయించాడు. అప్పటికే అతనిపై పీకలదాక కోపంతో ఉన్న శ్రీనివాసరాజు సుబ్బారావుతో కలిసి స్కెచ్ వేశాడు. తన కార్యాలయానికి రప్పించుకుని తన అనుచరులతో హత్య చేయించాడు. మీడియా ఎదుట తల దించుకుని నిల్చున్న నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, సుబ్బారావు, కేశవ్ రియల్ బంధం ఏ3గా తెరపైకి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేశాడు. పదవీవిరమణ బిల్డర్‌గా మారాడు. కూర్మన్నపాలెంలోని మాతృశ్రీ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలోనే పరిచయమైన గేదెల రాజు ద్వారా పలు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశాడు. అప్పట్లో గాజువాక ఏసీపీగా ఉన్న డీఎస్పీ రవిబాబుతోనూ పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా కూడా పలు సెటిల్మెంట్స్ చేశాడు. ఆ క్రమంలోనే తోడల్లుడి పేరిట 400 చదరపు గజాల స్థలాన్ని 2013లో గిప్ట్గా రిజిస్ట్రేషన్ చేయించాడు. మరో పక్క తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసరాజు టింబర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. 2016లో క్షత్రియభేరి పేపర్ ప్రారంభించాడు. తన ఆర్ధిక లావాదేవీలకు గేదెలరాజు, సుబ్బారావుల సహకారం తీసుకునేవాడు. అలా వీరందరి మధ్య ‘రియల్’ స్నేహం కుదిరింది. నేటితో ముగియనున్న రవిబాబు కస్టడీ కాగా గురువారంతో రవిబాబు పోలీస్ కస్టడీ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులకు రవిబాబు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. తనకేపాపం తెలియదని, కావాలనే ఇరికించారని రవిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ కోటి..ఇక్కడ రూ.20 లక్షలే కాగా పద్మలతను హత్య చేసేందుకు గేదెల రాజుకు రూ.కోటి చెల్లించేందుకు రవిబాబు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో రూ.50 లక్షలు ముందుగానే ముట్టజెప్పాడు. మిగిలిన మొత్తానికి వన్ టైం సెటిల్మెంట్ మెంట్ కింద రూ.25లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులో ఏకంగా కోటి రూపాయలు డీల్ కుదరగా, గేదెల రాజు హత్య కేసులో రూ.10లక్షలు మాత్ర మే చెక్కుల రూపంలో రవిబాబు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం మవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ధిక విభేదాల కారణంగానే గేదెల రాజును హతమార్చేందుకు భూపతిరాజు అంగీకరించాడని చెబుతున్నారు. ఇందుకోసమే రవిబాబు రూ.10లక్షలు, సుబ్బారావు మరో రూ.10లక్షలు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రకటించారు. మొత్తం నిందితులు 13 మంది ఈ వ్యవహారంలో పద్మలత హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా లభించలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించిన జేసీపీ గేదెల రాజు కేసు దర్యాప్తు మాత్రం పూర్తయినట్టేనని చెప్పుకొచ్చారు. రాజు హత్యకు స్కెచ్ వేసేందుకు బీచ్‌రోడ్‌లో జరిగిన భేటీలో రఘు, రోహిత్, గోపిరాజుల పాత్ర ఏమేరకు ఉందో నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. గేదెల రాజు హత్య కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు. -
30 సెకన్లలో 30 సార్లు నరికి..
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39) అలియాస్ వాసును నలుగురు దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. అరండల్ పేట 12వ లైన్లో ఆది వారం రాత్రి సుమారు 8–26 గంటలకు అంతా చూస్తుండగా నడి రోడ్డుపై వాసును హతమార్చారు. గుంటూరులోని విద్యానగర్ 4వ లైన్లో నివాసం ఉంటున్న వాసు మరి కొందరితో కలసి ఆదివారం రాత్రి అరండల్‌పేట 12వ లైన్లో ఉన్న అన్వర్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లాడు. బిర్యానీ తిని తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకిరి నాగ చైతన్యతో కలసి బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు వాసుపైన దాడి చేసి కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపారు. ముందుగా ఏపీ16ఏఈ 9199 నంబర్ స్కార్పియో వాహ నంతో వాసును ఢీకొట్టి.. అతను కిందపడ్డ తర్వాత అతి కిరాతకంగా 30 సెకన్లలో నలుగురు దుండగులు కలసి 30 సార్లు నరికి హతమార్చారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. వాసు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ దుండగులు అదే స్కార్పియోలో పరారయ్యారు. ఆదివారం రద్దీగా ఉండే అరండల్‌పేటలో దుండగులు వాసును హత్య చేశారంటే పక్కా పథకం ప్రకారం అక్కడకి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
బ్యాంకాక్‌లో హత్యకు స్కెచ్ వేసిన రవిబాబు..
అది చోడవరం పట్టణం.. ఉదయం 10 గంటలు..ఆ సమయంలో స్కైబ్లూ కలర్ టీషర్టు.. ట్రాక్ సూట్ వేసుకున్న ఓ వ్యక్తి జాగింగ్ చేస్తున్నట్లు వడివడిగా వెళుతున్నారు.. ఈ సమయంలో జాగింగ్ ఏమిటా?.. అని చూసిన వారి ఆశ్చర్యం.. అంతలోనే ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుందే అన్న సందేహం.. ఇవేవీ పట్టించుకోకుండా వడివడిగా ముందుకు సాగిపోయిన ఆ వ్యక్తి అడుగులు నేరుగా పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లాయి.. స్టేషన్ పక్కనే ఉన్న కొందరు ట్యాక్సీ డ్రైవర్లు ఆ ముఖాన్ని గుర్తుపట్టారు.. అరే డీఎస్పీ రవిబాబే.. అంటూ విస్మయానికి గురయ్యారు. పరిగెత్తుకొచ్చారు. అదే సమయానికి మీడియా ప్రతినిధులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. రవిబాబు స్టేషన్‌కు చేరుకున్న సమయానికే సీఐ, ఎస్సైలిద్దరూ అక్కడే ఉన్నారు.లొంగిపోతానని చెప్పిన అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం.. వారి ఆదేశాల మేరకు వాహనంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించడం.. కలలో జరిగినట్లు 20 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి.. రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ఏ1గా ఉన్న రవిబాబును న్యూపోర్టు స్టేషన్‌కు ఉదయం 11కు తీసుకెళ్లినా.. మధ్యాహ్నం 3.30 వరకు విచారణ ప్రారంభించనే లేదు.. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన వెంటనే మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఏ1 నిందితుడి విషయంలో మాత్రం అత్యంగా గుంభనంగా.. మీడియా దరిచేరకుండా వ్యవహరించడం విశేషం. ఏ1 నిందితుడు లొంగిపోవడంతో.. ఏ2 నిందితుడు ఎక్కడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. అయితే అతడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. హార్బర్ స్టేషన్లో ఉంచారని సమాచారం.. మొత్తానికి శుక్రవారం జరిగిన పరిణామాలను చూస్తే.. అంతా పోలీస్ స్టైల్లోనే సాగుతోందనిపిస్తోంది. విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుల అరెస్టుల పర్వం ఓ ప్రసహనంలా కనిపిస్తోంది. కేసులో ఏ1 నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దాసరి రవిబాబు శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య చోడవరంలో లొంగిపోవడం వెనుక చాలా కథ నడిచిందని అంటున్నారు. ఆయన లొంగిపోయేందుకు తాను గతంలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన చోడవరం స్టేషన్‌నే ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేసిన కాలంలో టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆయన రెండురోజుల కిందట చోడవరం సమీపంలోని గంధవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడి ఇంట్లో ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హైకోర్టులో బెయిల్ కోసం తీవ్రయత్నాలు చేసినప్పటికీ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని న్యాయవాదులు చెప్పడంతో తప్పని పరిస్థితుల్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకే తనకు వర్గ ప్రాబల్యం కలిగిన చోడవరం ప్రాంతాన్ని ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఓ దశలో పోలీస్ కమిషనరేట్‌కే వెళ్లి లొంగిపోవాలని భావించినట్టు తెలిసింది. ఆ మేరకు 1989 బ్యాచ్‌కు చెందిన కొంతమంది రవిబాబు సహచరులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఉన్నతస్థాయి అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోవడం కంటే తాను గతంలో పనిచేసిన, తనకు పరిచయాలు ఎక్కువగా ఉన్న పోలీస్‌స్టేషన్ పరిధిలోనే లొంగిపోతే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి చోడవరం ఎంచుకున్నట్టు సమాచారం. రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్ వేశారా? ఈ హత్యలో ఎ–1గా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు తన బినామీలతో కలిసి అందుకే అక్కడికి వెళ్లారా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం లభించినట్టు పోలీసువర్గాల సమాచారం. గేదెల రాజు హత్య కేసులో అనుమానితులను విచారించిన పోలీసులు శుక్రవారం మరోసారి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ విచారణకు హాజరైన ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాచారం ప్రకారం... డీఎస్సీ రవిబాబు తన ప్రియురాలు పద్మలతను హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తనకు బకాయి నగదును ఇవ్వాలంటూ గేదెల రాజు తరచూ గొడవ పడేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే హత్య విషయం బహిర్గతం చేస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఇది తనకు ప్రమాదకరమని భావించిన రవిబాబు గాజువాకలోని తన బినామీల ద్వారా గేదెల రాజుతో సఖ్యతకు విఫలయత్నం చేశాడు. బ్యాంకాక్‌లో ఏం జరిగింది.. రవిబాబు బృందం గాజువాకలోని తన బినామీలు, అనుచరులతో కలిసి బ్యాంకాక్ వెళ్లారు. ఆ టూర్‌కు గేదెల రాజును కూడా ఆహ్వానించినప్పటికీ అతడు వెళ్లలేదు. గేదెల రాజు బ్యాంకాక్ వస్తే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, వీలుకాకపోతే అంతమొందించాలన్న ఆలోచనతోనే అతడిని కూడా ఆహ్వానించామని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ పథకం వేసినట్టు విచారణాధికారులకు వివరించాడు. బ్యాంకాక్‌లో బినామీలందరితోను చర్చించిన తరువాత గేదెల రాజును వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తిరిగి ఇక్కడికి వచ్చిన తరువాత తమ నిర్ణయాన్ని క్షత్రియభేరి పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజుకు వివరించడంతో ఆ సహాయం తానే చేస్తానని భరోసా ఇచ్చారని, అందుకే రవిబాబు తన ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కును ఆయనకు ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. చెక్కు ఇచ్చిన తరువాత కూడా చినగంట్యాడకు చెందిన ఒక బార్ నిర్వాహకుడి ద్వారా గేదెల రాజుతో చర్చలు జరిగినట్టు సమాచారం. గేదెల రాజు హత్య జరగానికి వారం రోజుల ముందు తన బార్‌కు సమీపంలోనే ఆ బార్ నిర్వాహకుడు ఒక కారులో గంటపాటు గేదెల రాజుతో చర్చించినట్టు సమాచారం. వారిమధ్య ఏ సంభాషణ వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బార్ యజమాని గతంలో లారీ క్లీనర్ అని, రవిబాబుకు బినామీగా మారిన తరువాత వ్యాపారాలు మొదలు పెట్టాడని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. రూ.10 లక్షల చెక్కు సీజ్... గేదెల రాజు హత్య కోసం రవిబాబు ఇచ్చిన రూ.10 లక్షల చెక్కును విచారణాధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కె.రమణ, శ్రీనివాస్‌ల సమక్షంలో పోలీసు అధికారులు చెక్కును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఇచ్చిన చెక్కును భూపతిరాజు శ్రీనివాసరాజు ఒక ఫైనాన్షియర్‌కు ఇచ్చి తొలుత రూ.4 లక్షలను తీసుకున్నట్టు సమాచారం. ఆ నగదునే కిల్లర్లకు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫైనాన్షియర్ నుంచి చెక్కును స్వాధీనం చేసుకున్నారు. మీడియా ముందుకు నిందితుడు రవిబాబు కాగా హత్యకేసులో ఏ1 రవిబాబును శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ రవికుమార్ మూర్తి ...హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. గేదెల రాజును కిరాయి రౌడీలతో రవిబాబు హత్య చేయించారని తెలిపారు. రవిబాబు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. భూపతిరాజుతో కలిసి గేదెల రాజు హత్యకు పథకం రచించారని, అలాగే పోలీసుల వివరాలు, రవిబాబు చెప్పిన వివరాలు సరిపోలాయన్నారు. అనంతరం రవిబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. ఏ2 నిందితుడు ఎక్కడ? కాగా ఏ2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం కిందటే అతన్ని పట్టుకున్న పోలీసులు రెండురోజుల క్రితం వరకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో, తర్వాత హార్బర్ స్టేషన్లో ఉంచి తమదైన శైలిలో విచారణ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హత్య కేసులో దాసరి రవిబాబుది తెర వెనుక పాత్రే కానీ.. భూపతిరాజు పాత్ర మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. హత్యా పథకం అమలు చేసింది మొదలు.. హత్యకు తన క్షత్రియభేరి కార్యాలయాన్ని, సిబ్బందిని వినియోగించడం, సాక్ష్యాధారాలను రూపుమాపడానికి యత్నించడం వంటి కేసులన్నీ భూపతి మెడకు చుట్టుకున్నాయి, ఈ నేపథ్యంలోనే అతను పట్టుబడినా విచారణ పేరిట పోలీసులు గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏ–1 రవిబాబు లొంగిపోవడంతో ఏ2 భూపతిరాజును కూడా నేడో రేపో పోలీసులు తెర ముందుకు తీసుకు వచ్చే అవకాశముంది. -
బైక్‌లపై వచ్చి.. వేటకొడవళ్లతో నరికి..
సాక్షి, అనంతపురం : కదిరిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కదిరి-అనంతపురం మార్గంలో భారత్ ఐటీఐ కాలేజీ సమీపంలో నారాయణస్వామి నాయక్(45)ను గర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కాలేజీ సమీపంలో కారును రిపేరు చేయించుకుంటున్న సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు, వేట కొడవళ్లతో నారాయణ స్వామిని దారుణంగా నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేసి పారిపోయే ప్రయత్నంలో సంఘటనాస్థలంలో ఓ బైక్‌ను దుండగులు వదిలిపెట్టినట్లు తెలిసింది. నారాయణస్వామి స్వగ్రామం కదిరి మండలం కుటాగుల. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెరపైకి రౌడీ షీటర్ హత్య కేసు !
టెక్కలి,న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ కోళ చంద్రరావు హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు దీన్ని బలపరుస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 20వ తేదీన టెక్కలికి చెందిన రౌడీ షీటర్ చంద్రరావు దారుణహత్యకు గురయ్యారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్, ట్రైనీ డీఎస్పీ శ్రీలక్ష్మి, అప్పటి టెక్కలి సీఐ ఎం.రాంబాబు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించి కొంతమంది నిందితులను అరెస్ట్ చేయడం.. వారంతా బెయిల్‌పై బయటకు రావడం చకచక జరిగిపోయాయి. సుమారు ఆరు నెలల తరువాత ఈ హత్య కేసులో నిందితునిగా ఉన్న పీత రాము ఈ నెల ఐదో తేదీన టెక్కలిలో మీడియా ముందు ప్రతక్షమై తనకు కొంతమంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా స్థానికంగా పలుకుబడి ఉన్న ఐదుగురి పేర్లను సైతం చెప్పడంతో పాటు.. వారిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రరావు హత్య రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో జరిగిందా? లేక ల్యాండ్ మాఫియాలో చోటు చేసుకున్న వివాదాలతో జరిగిందా అనే కీలక అంశాలపై గత ఏడాది నవంబర్ 22వ తేదీన సాక్షిలో ప్రచురించిన ‘రౌడీ షీటర్ హత్య వెనుక ల్యాండ్ మాఫియా హస్తం’ అనే కథనంపై పట్టణంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సాక్షి కథనం ఆధారంగా పోలీస్ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కోళ చంద్రరావు హత్యపై తెర వెనుక ఉన్న కొంత మందిపై అప్పటి నుంచి నిఘా వేశారు. సుమారు 6 నెలల తరువాత ఈ హత్య విషయమై కీలకమైన మలుపులు తెర మీద కనిపిస్తున్నాయి. నిందితుడు రాము చేసిన ప్రకటనతో చంద్రరావు హత్య వెనుక ల్యాండ్ మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందికి ముచ్చెటమలు పడుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో.. చంద్రరావు హత్యకేసులో నిందితుడైన పీత రాము తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతోపాటు స్థానికంగా పలుకుబడి ఉన్న ఐదుగురి పేర్లతో డీజీపీకు ఫిర్యాదు చేయడంతో, ఈ హత్యకేసుపు పూర్తి స్థాయి దృష్టి సారించాలని ఆయా ఉన్నతాధికారుల నుంచి స్థాయిక పోలీస్ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ హత్య వెనుక హస్తం ఉన్న వారిపై డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు నిఘా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు భోగట్టా. దోషులను పట్టించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు! చంద్రరావు హత్య తెర వెనుక ఉన్న ల్యాండ్ మాఫియా ముఠా సభ్యులను పూర్తి ఆధారాలతో పోలీసులకు అప్పగించేందుకు టెక్కలికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా హత్య జరిగిన నుంచి నేటి వరకు కీలకమైన ఆధారాలు సేకరించి పోలీస్ ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ఆధారాలు సేకరించిన విషయం తెలుసుకున్న ల్యాండ్ మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠా సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నట్లు భోగట్టా.