ఇంతేనా..ఇదే రియలా! | Police suspect role of three more in rowdy sheeter's murder | Sakshi
Sakshi News home page

ఇంతేనా..ఇదే రియలా!

Published Thu, Nov 2 2017 12:19 PM | Last Updated on Thu, Nov 2 2017 12:19 PM

Police suspect role of three more in rowdy sheeter's murder - Sakshi

కాకర పద్మలత హత్య కుట్రకు సంబంధించిన నగదు లావాదేవీలే రౌడీషీటర్‌ గేదెలరాజు హత్యకు కారణమని ఇన్నాళ్లూ అందరూ భావించారు.. పోలీసులూ అదే చెబుతూ వచ్చారు.. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.. కానీ ఆ హత్యకు అదొక్కటే కారణం కాదని తాజాగా వెల్ల డించారు.. ఆర్థిక లావాదేవీలు, రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్ల వివాదాలు కూడా రాజును బలిగొన్నాయని అంటున్నారు.. ఒక పోలీస్‌ అధికారి, ఒక పత్రికా నిర్వాహకుడు, ఒక రియల్టర్‌.. ఈ ముగ్గురు సెటిల్‌మెంట్లు, రియల్‌ దందాల్లో ఆరితేరినవారే.. ఆ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకునేవారు.. అటువంటి వాటిలోనే రాటుదేలిన రౌడీషీటర్‌ గేదెలరాజు వారికి పరిచయమయ్యాడు.. యథాశక్తి వారికి సహకరించేవాడు..

ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం విషయంలో బెదిరింపులకు దిగిన పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు పోలీసు అధికారి గేదెల రాజును ప్రయోగించాడు.. అయితే సొమ్ము చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం.. వారి మధ్య బెదిరింపుల దాకా వెళ్లింది.. ఇక రియల్టర్, పత్రికా నిర్వాహకుడు చేపట్టిన భూ దందాల్లో అనవసరంగా తలదూర్చి తనకూ వాటా ఇవ్వాలని బెదిరించి వారి కంటగింపుగా మారిన గేదెల రాజు.. మొత్తానికి ముగ్గురికీ ఉమ్మడి శత్రువుగా మారాడు.. అంతే.. ఆ ముగ్గురూ చేతులు కలిపారు.. పథకం ప్రకారం గేదెలరాజును హతం చేశారు.. వెలుగు చూసిన ఈ ‘రియల్‌’ కోణంతో ఈ హత్య కేసు దర్యాప్తు దాదాపు ముగిసినట్లేనట!.. ఇక తేలాల్సింది పద్మలత హత్య కేసు మిస్టరీనే..

సాక్షి, విశాఖపట్నం: రౌడీ షీటర్‌ గేదెలరాజు హత్య కేసులో పోలీసులు మరో ట్విస్ట్‌ ఇచ్చారు. పద్మలత హత్యకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే డీఎస్పీ రవిబాబు అతన్ని భూపతిరాజు ద్వారా హత్య చేయించాడని చెప్పుకొచ్చిన పోలీసులు తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రవిబాబు ఆఫర్‌కు తోడు గేదెలరాజుతో తనకున్న భూ వివాదాల వల్లే శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని.. ఈ విషయంలో రియాల్టర్‌ డి.సుబ్బారావు సహకరించాడని చెప్పుకొచ్చారు. గేదెలరాజు హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్టు ప్రకటించిన పోలీసులు పద్మలత హత్య కేసు పురోగతిలో ఉందన్నారు. కేసులో కీలక నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, అతని కారు డ్రైవర్‌ కేశవ్‌తో పాటు రియాల్టర్‌ సుబ్బారావును అరెస్ట్‌ చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపిన వివరాలు ఆసక్తి గొలుపుతున్నాయి.

విభేదాలు ఇలా..
మాతృశ్రీ లే అవుట్‌లోని కొంత భూమిని గేదెల రాజు ఆక్రమించడంతో సుబ్బారావుతో అతనికి విభేదాలు ఏర్పడ్డాయి. కాగా పద్మలత హత్య కోసం గేదెలరాజుకు సుపారీ ఇవ్వడానికి తన తోడల్లుడి పేరిట రిజిస్ట్రర్‌ చేయించిన స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా డీఎస్పీ రవిబాబు సుబ్బారావును కోరాడు. ఆ మేరకు ఆ స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు రవిబాబుకు ఇవ్వగా ఆ సొమ్మును గేదెలరాజుకు ఇచ్చాడు. అడ్వాన్స్‌గా ఆ సొమ్ము తీసుకున్న గేదెల రాజు పద్మలతను విషప్రయోగంతో హతమార్చాడు. ఆతర్వాత మిగిలిన సొమ్ము కోసం గేదెల రాజు ఒత్తిడి చేయడంతో రవిబాబు అతడిని వదిలించుకోవాలని ఎత్తుగడ వేశాడు. రాజును హత్య చేసేందుకు భూపతిరాజుకు   400 చదరపు గజాల స్థలం, రూ.15 లక్షల నగదు ఇచ్చేందుకు రవిబాబు తరపున సుబ్బారావు అంగీకరించాడు.

రూ.2.5 కోట్ల స్థల వివాదం
వీటితోపాటు ఓ భూ ఆక్రమణ విషయంలో భూపతి రాజు, సుబ్బారావు, గేదెలరాజుల మధ్య విబేదాలు తలెత్తాయి. విమానాశ్రయం వద్ద సాకేతుపాలెం సమీపంలోని బుచ్చిరాజుపాలెం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన దోనపల్లి నాగప్రసాద్‌ అధీనంలో ఉన్న సర్వే నెం. 69/1బీ1లోని రూ.2.5కోట్ల విలువైన 713 చదరపు గజాల భూమిని  భూపతిరాజు తన అనుచరుడైన మహేష్‌ తదితరులతో కలిసి చౌకగా కొట్టేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారంలో తనకు 50 శాతం వాటా ఇచ్చే షరతుతో భూపతిరాజుకు సుబ్బారావు రూ.40 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొనేందుకు ప్రయత్నించగా.. బినామీ సైట్‌ ఓనర్‌ అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అసలు వ్యక్తి అయిన వాడపల్లి వెంకట సూర్య సన్యాసిరావు అలియాస్‌ పెద్ద వద్దకు వెళ్లి ఆరా తీయగా.. వేరే పార్టీకి దాన్ని అమ్మేస్తున్నరన్న తెలిసింది. దాంతో భూపతిరాజు తన అనుచరుడు మహేష్‌ను పురమాయించాడు.

రూ.1.10 కోట్లకు డీల్‌గా పేర్కొంటూ రూ.70 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చినట్టు తన పత్రికలో పని చేస్తున్న సబ్‌ ఎడిటర్‌ అశోక్‌తో పాత తేదీలతో ముందుగానే అగ్రిమెంట్‌ తయారు చేయించాడు. అనంతరం పెద్ద, నాగప్రసాద్‌లను పత్రిక కార్యాలయానికి రప్పించాడు. హైదరాబాద్‌ పార్టీ వచ్చిందని పెద్దను బయటపెట్టి నాగప్రసాద్‌ను లోనికి పంపించాడు. అక్కడ మాటు వేసిన శ్రీనివాసరాజు అనుచరులు మహేష్‌ తదితరులు కత్తులతో బెదిరించి స్టాంప్‌ డ్యూటీ డాక్యుమెంట్స్, ఖాళీ పేపర్లపై నాగప్రసాద్‌తో సంతకాలు చేయించి స్థలం ఆక్రమించారు. ప్రసాద్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పెద్ద శ్రీనివాసరాజును నిలదీసి బెదిరించాడు.

దాంతో ఆ స్థలం చేజారిపోకుండా శ్రీనివాసరాజు కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నాడు. అప్పటి వరకు సైలంట్‌గా ఉన్న గేదెల రాజు ఈ భూ దందాలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తనకూ వాటా కావాలని శ్రీనివాసరాజుపై ఒత్తిడి తెచ్చాడు. ఇందులో తల దూర్చొద్దని స్పష్టం చేసినా వినలేదు. అప్పటికే గేదెల రాజుతో గొడవ పెట్టుకున్న సుబ్బారావు కూడా శ్రీనివాసరాజుతో కలిసి అతన్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో పద్మలత వ్యవహారంలో గేదెల రాజును హతమార్చాలని డీఎస్పీ రవిబాబు శ్రీనివాసరాజును పురమాయించాడు. అప్పటికే అతనిపై పీకలదాక కోపంతో ఉన్న శ్రీనివాసరాజు సుబ్బారావుతో కలిసి స్కెచ్‌ వేశాడు. తన కార్యాలయానికి రప్పించుకుని తన అనుచరులతో హత్య చేయించాడు.

   మీడియా ఎదుట తల దించుకుని నిల్చున్న నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, సుబ్బారావు, కేశవ్‌
రియల్‌ బంధం
ఏ3గా తెరపైకి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేశాడు. పదవీవిరమణ బిల్డర్‌గా మారాడు. కూర్మన్నపాలెంలోని మాతృశ్రీ హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలోనే పరిచయమైన గేదెల రాజు ద్వారా పలు ల్యాండ్‌ సెటిల్‌మెంట్స్‌ చేశాడు. అప్పట్లో గాజువాక ఏసీపీగా ఉన్న డీఎస్పీ రవిబాబుతోనూ పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా కూడా పలు సెటిల్‌మెంట్స్‌ చేశాడు. ఆ క్రమంలోనే తోడల్లుడి పేరిట 400 చదరపు గజాల స్థలాన్ని 2013లో గిప్ట్‌గా రిజిస్ట్రేషన్‌ చేయించాడు. మరో పక్క తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసరాజు టింబర్‌ వ్యాపారంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2016లో క్షత్రియభేరి పేపర్‌ ప్రారంభించాడు. తన ఆర్ధిక లావాదేవీలకు గేదెలరాజు, సుబ్బారావుల సహకారం తీసుకునేవాడు. అలా వీరందరి మధ్య ‘రియల్‌’ స్నేహం కుదిరింది.

నేటితో ముగియనున్న రవిబాబు కస్టడీ
కాగా గురువారంతో రవిబాబు పోలీస్‌ కస్టడీ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులకు రవిబాబు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. తనకేపాపం తెలియదని, కావాలనే ఇరికించారని రవిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.

అక్కడ కోటి..ఇక్కడ రూ.20 లక్షలే
కాగా పద్మలతను హత్య చేసేందుకు గేదెల రాజుకు రూ.కోటి చెల్లించేందుకు రవిబాబు డీల్‌ కుదుర్చుకున్నాడు. అందులో రూ.50 లక్షలు ముందుగానే ముట్టజెప్పాడు.  మిగిలిన మొత్తానికి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ మెంట్‌ కింద రూ.25లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులో ఏకంగా కోటి రూపాయలు డీల్‌ కుదరగా, గేదెల రాజు హత్య కేసులో రూ.10లక్షలు మాత్ర మే చెక్కుల రూపంలో రవిబాబు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం మవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ధిక విభేదాల కారణంగానే గేదెల రాజును హతమార్చేందుకు భూపతిరాజు అంగీకరించాడని చెబుతున్నారు. ఇందుకోసమే రవిబాబు రూ.10లక్షలు, సుబ్బారావు మరో రూ.10లక్షలు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రకటించారు.  

మొత్తం నిందితులు 13 మంది
ఈ వ్యవహారంలో పద్మలత హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా లభించలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించిన జేసీపీ గేదెల రాజు కేసు దర్యాప్తు మాత్రం పూర్తయినట్టేనని చెప్పుకొచ్చారు. రాజు హత్యకు స్కెచ్‌ వేసేందుకు బీచ్‌రోడ్‌లో జరిగిన భేటీలో రఘు, రోహిత్, గోపిరాజుల పాత్ర ఏమేరకు ఉందో నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. గేదెల రాజు హత్య కేసులో 13 మందిని అరెస్ట్‌ చేసినట్టుగా ప్రకటించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement