padmalatha
-
ఇంతేనా..ఇదే రియలా!
కాకర పద్మలత హత్య కుట్రకు సంబంధించిన నగదు లావాదేవీలే రౌడీషీటర్ గేదెలరాజు హత్యకు కారణమని ఇన్నాళ్లూ అందరూ భావించారు.. పోలీసులూ అదే చెబుతూ వచ్చారు.. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.. కానీ ఆ హత్యకు అదొక్కటే కారణం కాదని తాజాగా వెల్ల డించారు.. ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వివాదాలు కూడా రాజును బలిగొన్నాయని అంటున్నారు.. ఒక పోలీస్ అధికారి, ఒక పత్రికా నిర్వాహకుడు, ఒక రియల్టర్.. ఈ ముగ్గురు సెటిల్మెంట్లు, రియల్ దందాల్లో ఆరితేరినవారే.. ఆ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకునేవారు.. అటువంటి వాటిలోనే రాటుదేలిన రౌడీషీటర్ గేదెలరాజు వారికి పరిచయమయ్యాడు.. యథాశక్తి వారికి సహకరించేవాడు.. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం విషయంలో బెదిరింపులకు దిగిన పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు పోలీసు అధికారి గేదెల రాజును ప్రయోగించాడు.. అయితే సొమ్ము చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం.. వారి మధ్య బెదిరింపుల దాకా వెళ్లింది.. ఇక రియల్టర్, పత్రికా నిర్వాహకుడు చేపట్టిన భూ దందాల్లో అనవసరంగా తలదూర్చి తనకూ వాటా ఇవ్వాలని బెదిరించి వారి కంటగింపుగా మారిన గేదెల రాజు.. మొత్తానికి ముగ్గురికీ ఉమ్మడి శత్రువుగా మారాడు.. అంతే.. ఆ ముగ్గురూ చేతులు కలిపారు.. పథకం ప్రకారం గేదెలరాజును హతం చేశారు.. వెలుగు చూసిన ఈ ‘రియల్’ కోణంతో ఈ హత్య కేసు దర్యాప్తు దాదాపు ముగిసినట్లేనట!.. ఇక తేలాల్సింది పద్మలత హత్య కేసు మిస్టరీనే.. సాక్షి, విశాఖపట్నం: రౌడీ షీటర్ గేదెలరాజు హత్య కేసులో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పద్మలత హత్యకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బ్లాక్మెయిల్ చేయడం వల్లే డీఎస్పీ రవిబాబు అతన్ని భూపతిరాజు ద్వారా హత్య చేయించాడని చెప్పుకొచ్చిన పోలీసులు తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రవిబాబు ఆఫర్‌కు తోడు గేదెలరాజుతో తనకున్న భూ వివాదాల వల్లే శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని.. ఈ విషయంలో రియాల్టర్ డి.సుబ్బారావు సహకరించాడని చెప్పుకొచ్చారు. గేదెలరాజు హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్టు ప్రకటించిన పోలీసులు పద్మలత హత్య కేసు పురోగతిలో ఉందన్నారు. కేసులో కీలక నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, అతని కారు డ్రైవర్ కేశవ్‌తో పాటు రియాల్టర్ సుబ్బారావును అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపిన వివరాలు ఆసక్తి గొలుపుతున్నాయి. విభేదాలు ఇలా.. మాతృశ్రీ లే అవుట్‌లోని కొంత భూమిని గేదెల రాజు ఆక్రమించడంతో సుబ్బారావుతో అతనికి విభేదాలు ఏర్పడ్డాయి. కాగా పద్మలత హత్య కోసం గేదెలరాజుకు సుపారీ ఇవ్వడానికి తన తోడల్లుడి పేరిట రిజిస్ట్రర్ చేయించిన స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా డీఎస్పీ రవిబాబు సుబ్బారావును కోరాడు. ఆ మేరకు ఆ స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు రవిబాబుకు ఇవ్వగా ఆ సొమ్మును గేదెలరాజుకు ఇచ్చాడు. అడ్వాన్స్‌గా ఆ సొమ్ము తీసుకున్న గేదెల రాజు పద్మలతను విషప్రయోగంతో హతమార్చాడు. ఆతర్వాత మిగిలిన సొమ్ము కోసం గేదెల రాజు ఒత్తిడి చేయడంతో రవిబాబు అతడిని వదిలించుకోవాలని ఎత్తుగడ వేశాడు. రాజును హత్య చేసేందుకు భూపతిరాజుకు 400 చదరపు గజాల స్థలం, రూ.15 లక్షల నగదు ఇచ్చేందుకు రవిబాబు తరపున సుబ్బారావు అంగీకరించాడు. రూ.2.5 కోట్ల స్థల వివాదం వీటితోపాటు ఓ భూ ఆక్రమణ విషయంలో భూపతి రాజు, సుబ్బారావు, గేదెలరాజుల మధ్య విబేదాలు తలెత్తాయి. విమానాశ్రయం వద్ద సాకేతుపాలెం సమీపంలోని బుచ్చిరాజుపాలెం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన దోనపల్లి నాగప్రసాద్ అధీనంలో ఉన్న సర్వే నెం. 69/1బీ1లోని రూ.2.5కోట్ల విలువైన 713 చదరపు గజాల భూమిని భూపతిరాజు తన అనుచరుడైన మహేష్ తదితరులతో కలిసి చౌకగా కొట్టేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారంలో తనకు 50 శాతం వాటా ఇచ్చే షరతుతో భూపతిరాజుకు సుబ్బారావు రూ.40 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొనేందుకు ప్రయత్నించగా.. బినామీ సైట్ ఓనర్ అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అసలు వ్యక్తి అయిన వాడపల్లి వెంకట సూర్య సన్యాసిరావు అలియాస్ పెద్ద వద్దకు వెళ్లి ఆరా తీయగా.. వేరే పార్టీకి దాన్ని అమ్మేస్తున్నరన్న తెలిసింది. దాంతో భూపతిరాజు తన అనుచరుడు మహేష్‌ను పురమాయించాడు. రూ.1.10 కోట్లకు డీల్‌గా పేర్కొంటూ రూ.70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు తన పత్రికలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ అశోక్‌తో పాత తేదీలతో ముందుగానే అగ్రిమెంట్ తయారు చేయించాడు. అనంతరం పెద్ద, నాగప్రసాద్‌లను పత్రిక కార్యాలయానికి రప్పించాడు. హైదరాబాద్ పార్టీ వచ్చిందని పెద్దను బయటపెట్టి నాగప్రసాద్‌ను లోనికి పంపించాడు. అక్కడ మాటు వేసిన శ్రీనివాసరాజు అనుచరులు మహేష్ తదితరులు కత్తులతో బెదిరించి స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్స్, ఖాళీ పేపర్లపై నాగప్రసాద్‌తో సంతకాలు చేయించి స్థలం ఆక్రమించారు. ప్రసాద్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పెద్ద శ్రీనివాసరాజును నిలదీసి బెదిరించాడు. దాంతో ఆ స్థలం చేజారిపోకుండా శ్రీనివాసరాజు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అప్పటి వరకు సైలంట్‌గా ఉన్న గేదెల రాజు ఈ భూ దందాలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తనకూ వాటా కావాలని శ్రీనివాసరాజుపై ఒత్తిడి తెచ్చాడు. ఇందులో తల దూర్చొద్దని స్పష్టం చేసినా వినలేదు. అప్పటికే గేదెల రాజుతో గొడవ పెట్టుకున్న సుబ్బారావు కూడా శ్రీనివాసరాజుతో కలిసి అతన్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో పద్మలత వ్యవహారంలో గేదెల రాజును హతమార్చాలని డీఎస్పీ రవిబాబు శ్రీనివాసరాజును పురమాయించాడు. అప్పటికే అతనిపై పీకలదాక కోపంతో ఉన్న శ్రీనివాసరాజు సుబ్బారావుతో కలిసి స్కెచ్ వేశాడు. తన కార్యాలయానికి రప్పించుకుని తన అనుచరులతో హత్య చేయించాడు. మీడియా ఎదుట తల దించుకుని నిల్చున్న నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, సుబ్బారావు, కేశవ్ రియల్ బంధం ఏ3గా తెరపైకి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేశాడు. పదవీవిరమణ బిల్డర్‌గా మారాడు. కూర్మన్నపాలెంలోని మాతృశ్రీ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలోనే పరిచయమైన గేదెల రాజు ద్వారా పలు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశాడు. అప్పట్లో గాజువాక ఏసీపీగా ఉన్న డీఎస్పీ రవిబాబుతోనూ పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా కూడా పలు సెటిల్మెంట్స్ చేశాడు. ఆ క్రమంలోనే తోడల్లుడి పేరిట 400 చదరపు గజాల స్థలాన్ని 2013లో గిప్ట్గా రిజిస్ట్రేషన్ చేయించాడు. మరో పక్క తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసరాజు టింబర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. 2016లో క్షత్రియభేరి పేపర్ ప్రారంభించాడు. తన ఆర్ధిక లావాదేవీలకు గేదెలరాజు, సుబ్బారావుల సహకారం తీసుకునేవాడు. అలా వీరందరి మధ్య ‘రియల్’ స్నేహం కుదిరింది. నేటితో ముగియనున్న రవిబాబు కస్టడీ కాగా గురువారంతో రవిబాబు పోలీస్ కస్టడీ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులకు రవిబాబు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. తనకేపాపం తెలియదని, కావాలనే ఇరికించారని రవిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ కోటి..ఇక్కడ రూ.20 లక్షలే కాగా పద్మలతను హత్య చేసేందుకు గేదెల రాజుకు రూ.కోటి చెల్లించేందుకు రవిబాబు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో రూ.50 లక్షలు ముందుగానే ముట్టజెప్పాడు. మిగిలిన మొత్తానికి వన్ టైం సెటిల్మెంట్ మెంట్ కింద రూ.25లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులో ఏకంగా కోటి రూపాయలు డీల్ కుదరగా, గేదెల రాజు హత్య కేసులో రూ.10లక్షలు మాత్ర మే చెక్కుల రూపంలో రవిబాబు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం మవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ధిక విభేదాల కారణంగానే గేదెల రాజును హతమార్చేందుకు భూపతిరాజు అంగీకరించాడని చెబుతున్నారు. ఇందుకోసమే రవిబాబు రూ.10లక్షలు, సుబ్బారావు మరో రూ.10లక్షలు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రకటించారు. మొత్తం నిందితులు 13 మంది ఈ వ్యవహారంలో పద్మలత హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా లభించలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించిన జేసీపీ గేదెల రాజు కేసు దర్యాప్తు మాత్రం పూర్తయినట్టేనని చెప్పుకొచ్చారు. రాజు హత్యకు స్కెచ్ వేసేందుకు బీచ్‌రోడ్‌లో జరిగిన భేటీలో రఘు, రోహిత్, గోపిరాజుల పాత్ర ఏమేరకు ఉందో నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. గేదెల రాజు హత్య కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు. -
ఆ హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్...
-
బ్యాంకాక్‌లో హత్యకు స్కెచ్ వేసిన రవిబాబు..
అది చోడవరం పట్టణం.. ఉదయం 10 గంటలు..ఆ సమయంలో స్కైబ్లూ కలర్ టీషర్టు.. ట్రాక్ సూట్ వేసుకున్న ఓ వ్యక్తి జాగింగ్ చేస్తున్నట్లు వడివడిగా వెళుతున్నారు.. ఈ సమయంలో జాగింగ్ ఏమిటా?.. అని చూసిన వారి ఆశ్చర్యం.. అంతలోనే ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుందే అన్న సందేహం.. ఇవేవీ పట్టించుకోకుండా వడివడిగా ముందుకు సాగిపోయిన ఆ వ్యక్తి అడుగులు నేరుగా పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లాయి.. స్టేషన్ పక్కనే ఉన్న కొందరు ట్యాక్సీ డ్రైవర్లు ఆ ముఖాన్ని గుర్తుపట్టారు.. అరే డీఎస్పీ రవిబాబే.. అంటూ విస్మయానికి గురయ్యారు. పరిగెత్తుకొచ్చారు. అదే సమయానికి మీడియా ప్రతినిధులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. రవిబాబు స్టేషన్‌కు చేరుకున్న సమయానికే సీఐ, ఎస్సైలిద్దరూ అక్కడే ఉన్నారు.లొంగిపోతానని చెప్పిన అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం.. వారి ఆదేశాల మేరకు వాహనంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించడం.. కలలో జరిగినట్లు 20 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి.. రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ఏ1గా ఉన్న రవిబాబును న్యూపోర్టు స్టేషన్‌కు ఉదయం 11కు తీసుకెళ్లినా.. మధ్యాహ్నం 3.30 వరకు విచారణ ప్రారంభించనే లేదు.. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన వెంటనే మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఏ1 నిందితుడి విషయంలో మాత్రం అత్యంగా గుంభనంగా.. మీడియా దరిచేరకుండా వ్యవహరించడం విశేషం. ఏ1 నిందితుడు లొంగిపోవడంతో.. ఏ2 నిందితుడు ఎక్కడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. అయితే అతడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. హార్బర్ స్టేషన్లో ఉంచారని సమాచారం.. మొత్తానికి శుక్రవారం జరిగిన పరిణామాలను చూస్తే.. అంతా పోలీస్ స్టైల్లోనే సాగుతోందనిపిస్తోంది. విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుల అరెస్టుల పర్వం ఓ ప్రసహనంలా కనిపిస్తోంది. కేసులో ఏ1 నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దాసరి రవిబాబు శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య చోడవరంలో లొంగిపోవడం వెనుక చాలా కథ నడిచిందని అంటున్నారు. ఆయన లొంగిపోయేందుకు తాను గతంలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన చోడవరం స్టేషన్‌నే ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేసిన కాలంలో టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆయన రెండురోజుల కిందట చోడవరం సమీపంలోని గంధవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడి ఇంట్లో ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హైకోర్టులో బెయిల్ కోసం తీవ్రయత్నాలు చేసినప్పటికీ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని న్యాయవాదులు చెప్పడంతో తప్పని పరిస్థితుల్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకే తనకు వర్గ ప్రాబల్యం కలిగిన చోడవరం ప్రాంతాన్ని ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఓ దశలో పోలీస్ కమిషనరేట్‌కే వెళ్లి లొంగిపోవాలని భావించినట్టు తెలిసింది. ఆ మేరకు 1989 బ్యాచ్‌కు చెందిన కొంతమంది రవిబాబు సహచరులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఉన్నతస్థాయి అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోవడం కంటే తాను గతంలో పనిచేసిన, తనకు పరిచయాలు ఎక్కువగా ఉన్న పోలీస్‌స్టేషన్ పరిధిలోనే లొంగిపోతే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి చోడవరం ఎంచుకున్నట్టు సమాచారం. రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్ వేశారా? ఈ హత్యలో ఎ–1గా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు తన బినామీలతో కలిసి అందుకే అక్కడికి వెళ్లారా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం లభించినట్టు పోలీసువర్గాల సమాచారం. గేదెల రాజు హత్య కేసులో అనుమానితులను విచారించిన పోలీసులు శుక్రవారం మరోసారి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ విచారణకు హాజరైన ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాచారం ప్రకారం... డీఎస్సీ రవిబాబు తన ప్రియురాలు పద్మలతను హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తనకు బకాయి నగదును ఇవ్వాలంటూ గేదెల రాజు తరచూ గొడవ పడేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే హత్య విషయం బహిర్గతం చేస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఇది తనకు ప్రమాదకరమని భావించిన రవిబాబు గాజువాకలోని తన బినామీల ద్వారా గేదెల రాజుతో సఖ్యతకు విఫలయత్నం చేశాడు. బ్యాంకాక్‌లో ఏం జరిగింది.. రవిబాబు బృందం గాజువాకలోని తన బినామీలు, అనుచరులతో కలిసి బ్యాంకాక్ వెళ్లారు. ఆ టూర్‌కు గేదెల రాజును కూడా ఆహ్వానించినప్పటికీ అతడు వెళ్లలేదు. గేదెల రాజు బ్యాంకాక్ వస్తే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, వీలుకాకపోతే అంతమొందించాలన్న ఆలోచనతోనే అతడిని కూడా ఆహ్వానించామని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ పథకం వేసినట్టు విచారణాధికారులకు వివరించాడు. బ్యాంకాక్‌లో బినామీలందరితోను చర్చించిన తరువాత గేదెల రాజును వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తిరిగి ఇక్కడికి వచ్చిన తరువాత తమ నిర్ణయాన్ని క్షత్రియభేరి పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజుకు వివరించడంతో ఆ సహాయం తానే చేస్తానని భరోసా ఇచ్చారని, అందుకే రవిబాబు తన ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కును ఆయనకు ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. చెక్కు ఇచ్చిన తరువాత కూడా చినగంట్యాడకు చెందిన ఒక బార్ నిర్వాహకుడి ద్వారా గేదెల రాజుతో చర్చలు జరిగినట్టు సమాచారం. గేదెల రాజు హత్య జరగానికి వారం రోజుల ముందు తన బార్‌కు సమీపంలోనే ఆ బార్ నిర్వాహకుడు ఒక కారులో గంటపాటు గేదెల రాజుతో చర్చించినట్టు సమాచారం. వారిమధ్య ఏ సంభాషణ వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బార్ యజమాని గతంలో లారీ క్లీనర్ అని, రవిబాబుకు బినామీగా మారిన తరువాత వ్యాపారాలు మొదలు పెట్టాడని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. రూ.10 లక్షల చెక్కు సీజ్... గేదెల రాజు హత్య కోసం రవిబాబు ఇచ్చిన రూ.10 లక్షల చెక్కును విచారణాధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కె.రమణ, శ్రీనివాస్‌ల సమక్షంలో పోలీసు అధికారులు చెక్కును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఇచ్చిన చెక్కును భూపతిరాజు శ్రీనివాసరాజు ఒక ఫైనాన్షియర్‌కు ఇచ్చి తొలుత రూ.4 లక్షలను తీసుకున్నట్టు సమాచారం. ఆ నగదునే కిల్లర్లకు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫైనాన్షియర్ నుంచి చెక్కును స్వాధీనం చేసుకున్నారు. మీడియా ముందుకు నిందితుడు రవిబాబు కాగా హత్యకేసులో ఏ1 రవిబాబును శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ రవికుమార్ మూర్తి ...హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. గేదెల రాజును కిరాయి రౌడీలతో రవిబాబు హత్య చేయించారని తెలిపారు. రవిబాబు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. భూపతిరాజుతో కలిసి గేదెల రాజు హత్యకు పథకం రచించారని, అలాగే పోలీసుల వివరాలు, రవిబాబు చెప్పిన వివరాలు సరిపోలాయన్నారు. అనంతరం రవిబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. ఏ2 నిందితుడు ఎక్కడ? కాగా ఏ2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం కిందటే అతన్ని పట్టుకున్న పోలీసులు రెండురోజుల క్రితం వరకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో, తర్వాత హార్బర్ స్టేషన్లో ఉంచి తమదైన శైలిలో విచారణ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హత్య కేసులో దాసరి రవిబాబుది తెర వెనుక పాత్రే కానీ.. భూపతిరాజు పాత్ర మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. హత్యా పథకం అమలు చేసింది మొదలు.. హత్యకు తన క్షత్రియభేరి కార్యాలయాన్ని, సిబ్బందిని వినియోగించడం, సాక్ష్యాధారాలను రూపుమాపడానికి యత్నించడం వంటి కేసులన్నీ భూపతి మెడకు చుట్టుకున్నాయి, ఈ నేపథ్యంలోనే అతను పట్టుబడినా విచారణ పేరిట పోలీసులు గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏ–1 రవిబాబు లొంగిపోవడంతో ఏ2 భూపతిరాజును కూడా నేడో రేపో పోలీసులు తెర ముందుకు తీసుకు వచ్చే అవకాశముంది. -
అజ్ఞాతంలోకి దళిత మహిళ
పెళ్లి పేరుతో ఏసీపీ లోబర్చుకున్నాడని డీజీకి బాధితురాలి ఫిర్యాదు స్వయంగా దర్యాప్తునకు ఆదేశించిన శాంతి భద్రతల అదనపు డీజీ దళిత మహిళను మోసం చేసిన ఏసీపీకి మంత్రి అండదండలు సాక్షి, హైదరాబాద్ : ఇది పోలీసు అధికారి అహంకారం, దౌర్జన్యానికి పరాకాష్ట. రక్షించాల్సిన స్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి మంత్రివర్యుల మాటకు విలువ ఇస్తూ న్యాయం చేయమన్న వారికే వెన్నుపోటు పొడుస్తున్న వైనం! హైదరాబాద్ వచ్చి స్వయంగా డీజీపీతోపాటు శాంతి భద్రతల అదనపు డీజీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేని దారుణం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పాయకరావుపేట నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలత ఈనెల 19న డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ శాంతిభద్రతల అదనపు డీజీకి ఈ అంశాన్ని అప్పగించారు. అదనపు డీజీ వినతిపత్రాన్ని పరిశీలించడమే కాకుండా పద్మలత వాదనలో వాస్తవం ఉందని గ్రహించి ఆ వినతిపత్రంపైనే విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఎండార్స్ చేసి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడి మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో విశాఖపట్నం పోలీసు కమిషనర్ మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో పద్మలత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితురాలి వినతిపత్రంలోని అంశాలు పద్మలత గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో కొన్ని రాజకీయ గొడవల కారణంగా యలమంచిలి సీఐగా ఉన్న రవిబాబును కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో యలమంచిలి కోర్టు దగ్గరున్న గెస్ట్‌హౌస్‌కు తనను పిలిపించుకుని కేసుల పేరుతో భయపెట్టి శారీరకంగా రవిబాబు లోబర్చుకున్నారు. అప్పటి నుంచి రవిబాబుతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులు ఇప్పించారు. అనంతరం భార్యగా స్వీకరించకుండా సాకులు చెబుతూ వచ్చారు. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పప్పల చలపతిరావు సమక్షంలో రవిబాబు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. అప్పటి విశాఖజిల్లా డీఐజీ జితేంద్ర, రూరల్ ఎస్పీ మురళికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు రవిబాబు ఏసీపీ కావడంతో కొందరు పెద్దలను అడ్డంపెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. నేను ఇప్పుడు ఏసీపీని.. ఏమి చేసుకుంటావో చేసుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ గొంతు నొక్కుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేసి ఏసీపీ రవిబాబు చేత భార్యగా స్వీకరింప చేయాలి. అలాగే బిడ్డకు తండ్రిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలి’ అని విన్నవించారు. శాంతి భద్రతల అదనపు డీజీ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా విశాఖ కమిషర్‌తో మాట్లాడాల్సిందిగా ఫోన్‌నంబర్ కూడా పద్మలతకు ఇచ్చారు. దీంతో పద్మలత కమిషనర్‌కు ఫోన్ చేయగా రక్షణ కల్పించే అంశాలు ఏవీ ప్రస్తావించకుండా మీరు ఎక్కడున్నారంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రాణభయం ఉన్న ఆమెకు అనుమానం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తనకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, ప్రాణాలను రక్షించాలని అయినవారికి పద్మలత మొరపెట్టుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆమె సరే... వీరి మాటేమిటో..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో’ అన్నట్లు అధికార యంత్రాంగం తీరు ప్రస్ఫుటం అవుతోంది. జిల్లాలో ఒకరికిపై మాత్రమే విప్ ధిక్కారణ వేటు వేసి విమర్శలకు తెరతీశారు. తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అనర్హత వేటు వేశారు. విప్ ధిక్కరించిన వారికి రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు తప్పదు. ఈ విషయంలో అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభాలకు గురిచేసింది. ఆ కారణంగా ఇరుపక్షాల బలం సమానం కావడంతో లాటరీ ద్వారా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించారని ఆ పార్టీ నేతులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నోటీసులు కూడా జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి రాయచోటి మున్సిపాలిటిలోనూ కొనసాగుతోంది. ఇక్కడ 18మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు. ఈ కారణంగా అక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అనర్హతవేటు వేయాల్సిందిగా ఆపార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై సైతం అధికారులు అదే ధోరణి అవలంభిస్తున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తింపజేయడంలో తాత్సారం చేస్తున్నారు. నిబంధనల మేరకు వారందరిపై ఇప్పటికే అనర్హత వేటు వేయాల్సి ఉంది. చట్టం అందరికి సమానమే అన్న విషయాన్ని అధికార యంత్రాంగం రుజువు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించివారిలో ఒకరిపై వేటు వేసిన నేపధ్యంలో అధికారులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది. ఫిరాయింపు దారులకు పదవుల బెంగ.... జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది కాసులకు కక్కుర్తి పడి టీడీపీ పంచన చేరారు. ఇప్పడు వారందరికీ పదవుల బెంగ పట్టుకుంది. వీరపునాయునిపల్లె ఎంపీపీపై అనర్హత వేటు వేసిన నేపధ్యంలో ఇక తమ పదవులు కోల్పోవాల్సి వస్తోందని ఆంత రంగికుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. డబ్బుతోపాటు, ఐదేళ్ల పదవి పదిలమని చెప్పారని, ఇప్పుడు పదవులు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై యర్రగుంట్ల కౌన్సిలర్లు అక్కడి టీడీపీ నాయకుడి వద్ద తమ గోడును వెల్లగక్కినట్లు సమాచారం. అధికారం మనదే.. అనర్హత వేటు పడకుండా ప్రయత్నిద్ధాం. ఒకవేళ వేటు వేసినా టీడీపీ తరుపున ఎన్నికల్లో మీరే నిలవండి..గెల్పించుకునే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించినందుకు జనం ఛీ కొడుతుంటే మళ్లీ ఎన్నికల్లో ఎక్కడ తలపడగలమని ఫిరాయింపుదారుల్లో ఒకరు వాపోయినట్లు తెలుస్తోంది. మీ మాటలు నమ్మి కౌన్సిలర్ పదవి కోల్పోవలసి వస్తోందని అధికారం అండతో ఏదో విధంగా ఆదుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. -
ఐటీ షాక్
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: రియల్‌బూమ్‌లో కోట్లు సంపాదించినా, సర్కార్‌కు పన్ను కట్టని వ్యాపారులపై ఇన్‌కంటాక్స్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికీ ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసుకున్న ఐటీ అధికారులు మంగళవారం సిద్దిపేటలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి సోమసుందరయ్య ఇంటిపై దాడి చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సోదాలు నిర్వహించారు. సోమసుందరయ్య సిద్దిపేటతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయా భూముల పత్రాలను పరిశీలించారు. ఆయన ఐటీ శాఖకు సమర్పించని సమాచారాన్ని పకడ్బందీగా సేకరించారు. సిద్దిపేట ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ పద్మలత నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ శాఖ ప్రతినిధులు సోదాల్లో పాల్గొన్నారు. సోమసుందరయ్య ఇంట్లోని ఆస్తుల డాక్యుమెంట్లను, ఇతర ఆస్తుల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిమిషాల్లోనే ఈ వార్త బయటకు పొక్కడంతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు తెలిసిన అధికారులతో సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు. గత నెల ఫెర్టిలైజర్ షాపులపై దాడులు చేసిన ఐటీ అధికారులు, ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దృష్టి సారించడంతో స్థానికులంతా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఐటీశాఖకు లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొట్టిన రియల్ఎస్టేట్ వ్యాపారులపై మున్ముందు దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.