సాక్షి ప్రతినిధి, కడప: ‘అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో’ అన్నట్లు అధికార యంత్రాంగం తీరు ప్రస్ఫుటం అవుతోంది. జిల్లాలో ఒకరికిపై మాత్రమే విప్ ధిక్కారణ వేటు వేసి విమర్శలకు తెరతీశారు. తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అనర్హత వేటు వేశారు. విప్ ధిక్కరించిన వారికి రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు తప్పదు. ఈ విషయంలో అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్లను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది.
కేవలం 2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభాలకు గురిచేసింది. ఆ కారణంగా ఇరుపక్షాల బలం సమానం కావడంతో లాటరీ ద్వారా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించారని ఆ పార్టీ నేతులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నోటీసులు కూడా జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి రాయచోటి మున్సిపాలిటిలోనూ కొనసాగుతోంది. ఇక్కడ 18మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు.
ఈ కారణంగా అక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అనర్హతవేటు వేయాల్సిందిగా ఆపార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై సైతం అధికారులు అదే ధోరణి అవలంభిస్తున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తింపజేయడంలో తాత్సారం చేస్తున్నారు. నిబంధనల మేరకు వారందరిపై ఇప్పటికే అనర్హత వేటు వేయాల్సి ఉంది. చట్టం అందరికి సమానమే అన్న విషయాన్ని అధికార యంత్రాంగం రుజువు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించివారిలో ఒకరిపై వేటు వేసిన నేపధ్యంలో అధికారులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది.
ఫిరాయింపు దారులకు పదవుల బెంగ....
జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది కాసులకు కక్కుర్తి పడి టీడీపీ పంచన చేరారు. ఇప్పడు వారందరికీ పదవుల బెంగ పట్టుకుంది. వీరపునాయునిపల్లె ఎంపీపీపై అనర్హత వేటు వేసిన నేపధ్యంలో ఇక తమ పదవులు కోల్పోవాల్సి వస్తోందని ఆంత రంగికుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. డబ్బుతోపాటు, ఐదేళ్ల పదవి పదిలమని చెప్పారని, ఇప్పుడు పదవులు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై యర్రగుంట్ల కౌన్సిలర్లు అక్కడి టీడీపీ నాయకుడి వద్ద తమ గోడును వెల్లగక్కినట్లు సమాచారం. అధికారం మనదే.. అనర్హత వేటు పడకుండా ప్రయత్నిద్ధాం. ఒకవేళ వేటు వేసినా టీడీపీ తరుపున ఎన్నికల్లో మీరే నిలవండి..గెల్పించుకునే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించినందుకు జనం ఛీ కొడుతుంటే మళ్లీ ఎన్నికల్లో ఎక్కడ తలపడగలమని ఫిరాయింపుదారుల్లో ఒకరు వాపోయినట్లు తెలుస్తోంది. మీ మాటలు నమ్మి కౌన్సిలర్ పదవి కోల్పోవలసి వస్తోందని అధికారం అండతో ఏదో విధంగా ఆదుకోవాలని కోరుతున్నట్లు సమాచారం.
ఆమె సరే... వీరి మాటేమిటో..!
Published Sat, Aug 9 2014 2:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement