పెళ్లి పేరుతో ఏసీపీ లోబర్చుకున్నాడని డీజీకి బాధితురాలి ఫిర్యాదు
స్వయంగా దర్యాప్తునకు ఆదేశించిన శాంతి భద్రతల అదనపు డీజీ
దళిత మహిళను మోసం చేసిన
ఏసీపీకి మంత్రి అండదండలు
సాక్షి, హైదరాబాద్ : ఇది పోలీసు అధికారి అహంకారం, దౌర్జన్యానికి పరాకాష్ట. రక్షించాల్సిన స్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి మంత్రివర్యుల మాటకు విలువ ఇస్తూ న్యాయం చేయమన్న వారికే వెన్నుపోటు పొడుస్తున్న వైనం! హైదరాబాద్ వచ్చి స్వయంగా డీజీపీతోపాటు శాంతి భద్రతల అదనపు డీజీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేని దారుణం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పాయకరావుపేట నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలత ఈనెల 19న డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ శాంతిభద్రతల అదనపు డీజీకి ఈ అంశాన్ని అప్పగించారు. అదనపు డీజీ వినతిపత్రాన్ని పరిశీలించడమే కాకుండా పద్మలత వాదనలో వాస్తవం ఉందని గ్రహించి ఆ వినతిపత్రంపైనే విశాఖపట్నం పోలీసు కమిషనర్కు ఎండార్స్ చేసి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడి మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో విశాఖపట్నం పోలీసు కమిషనర్ మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో పద్మలత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
బాధితురాలి వినతిపత్రంలోని అంశాలు
పద్మలత గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో కొన్ని రాజకీయ గొడవల కారణంగా యలమంచిలి సీఐగా ఉన్న రవిబాబును కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో యలమంచిలి కోర్టు దగ్గరున్న గెస్ట్హౌస్కు తనను పిలిపించుకుని కేసుల పేరుతో భయపెట్టి శారీరకంగా రవిబాబు లోబర్చుకున్నారు. అప్పటి నుంచి రవిబాబుతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులు ఇప్పించారు. అనంతరం భార్యగా స్వీకరించకుండా సాకులు చెబుతూ వచ్చారు. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పప్పల చలపతిరావు సమక్షంలో రవిబాబు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. అప్పటి విశాఖజిల్లా డీఐజీ జితేంద్ర, రూరల్ ఎస్పీ మురళికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు రవిబాబు ఏసీపీ కావడంతో కొందరు పెద్దలను అడ్డంపెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. నేను ఇప్పుడు ఏసీపీని.. ఏమి చేసుకుంటావో చేసుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ గొంతు నొక్కుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేసి ఏసీపీ రవిబాబు చేత భార్యగా స్వీకరింప చేయాలి. అలాగే బిడ్డకు తండ్రిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలి’ అని విన్నవించారు. శాంతి భద్రతల అదనపు డీజీ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా విశాఖ కమిషర్తో మాట్లాడాల్సిందిగా ఫోన్నంబర్ కూడా పద్మలతకు ఇచ్చారు. దీంతో పద్మలత కమిషనర్కు ఫోన్ చేయగా రక్షణ కల్పించే అంశాలు ఏవీ ప్రస్తావించకుండా మీరు ఎక్కడున్నారంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రాణభయం ఉన్న ఆమెకు అనుమానం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తనకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, ప్రాణాలను రక్షించాలని అయినవారికి పద్మలత మొరపెట్టుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అజ్ఞాతంలోకి దళిత మహిళ
Published Tue, Mar 22 2016 12:51 PM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
Advertisement
Advertisement