బ్యాంకాక్‌లో హత్యకు స్కెచ్‌ వేసిన రవిబాబు.. | Gedela Raju, padmalata murders: RTC Vigilance SP Ravi Babu builds plan of Bangkok | Sakshi
Sakshi News home page

ఆ హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్‌...

Published Sat, Oct 21 2017 11:12 AM | Last Updated on Sat, Oct 21 2017 12:44 PM

Gedela Raju, padmalata murders: RTC Vigilance SP Ravi Babu builds plan of  Bangkok

  • అది చోడవరం పట్టణం.. ఉదయం 10 గంటలు..ఆ సమయంలో స్కైబ్లూ కలర్‌ టీషర్టు.. ట్రాక్‌ సూట్‌ వేసుకున్న ఓ వ్యక్తి జాగింగ్‌ చేస్తున్నట్లు వడివడిగా వెళుతున్నారు..
  • ఈ సమయంలో జాగింగ్‌ ఏమిటా?.. అని చూసిన వారి ఆశ్చర్యం.. అంతలోనే ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుందే అన్న సందేహం..
  • ఇవేవీ పట్టించుకోకుండా వడివడిగా ముందుకు సాగిపోయిన ఆ వ్యక్తి అడుగులు నేరుగా పోలీస్‌స్టేషన్‌ వైపు వెళ్లాయి..
  • స్టేషన్‌ పక్కనే ఉన్న కొందరు ట్యాక్సీ డ్రైవర్లు ఆ ముఖాన్ని గుర్తుపట్టారు..
  • అరే డీఎస్పీ రవిబాబే.. అంటూ విస్మయానికి గురయ్యారు. పరిగెత్తుకొచ్చారు. అదే సమయానికి మీడియా ప్రతినిధులు అక్కడ ప్రత్యక్షమయ్యారు.
  • రవిబాబు స్టేషన్‌కు చేరుకున్న సమయానికే సీఐ, ఎస్సైలిద్దరూ అక్కడే ఉన్నారు.లొంగిపోతానని చెప్పిన అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లారు.
  • ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం.. వారి ఆదేశాల మేరకు వాహనంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించడం.. కలలో జరిగినట్లు 20 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి..
  • రౌడీషీటర్‌ గేదెలరాజు హత్య కేసులో ఏ1గా ఉన్న రవిబాబును న్యూపోర్టు స్టేషన్‌కు ఉదయం 11కు తీసుకెళ్లినా.. మధ్యాహ్నం 3.30 వరకు విచారణ ప్రారంభించనే లేదు..
  • మిగిలిన నిందితులను అరెస్టు చేసిన వెంటనే మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఏ1 నిందితుడి విషయంలో మాత్రం అత్యంగా గుంభనంగా..  మీడియా దరిచేరకుండా వ్యవహరించడం విశేషం.
  • ఏ1 నిందితుడు లొంగిపోవడంతో.. ఏ2 నిందితుడు ఎక్కడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి..
  • అయితే అతడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. హార్బర్‌ స్టేషన్‌లో ఉంచారని సమాచారం..
  • మొత్తానికి శుక్రవారం జరిగిన పరిణామాలను చూస్తే.. అంతా పోలీస్‌ స్టైల్‌లోనే సాగుతోందనిపిస్తోంది.

విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీషీటర్‌ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుల అరెస్టుల పర్వం ఓ ప్రసహనంలా కనిపిస్తోంది. కేసులో ఏ1 నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ దాసరి రవిబాబు శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య చోడవరంలో లొంగిపోవడం వెనుక చాలా కథ నడిచిందని అంటున్నారు. ఆయన లొంగిపోయేందుకు తాను గతంలో ఎస్‌ఐగా, సీఐగా పనిచేసిన చోడవరం స్టేషన్‌నే ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కాలంలో టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆయన రెండురోజుల కిందట చోడవరం సమీపంలోని గంధవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడి ఇంట్లో ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి హైకోర్టులో బెయిల్‌ కోసం తీవ్రయత్నాలు చేసినప్పటికీ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువని న్యాయవాదులు చెప్పడంతో తప్పని పరిస్థితుల్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకే తనకు వర్గ ప్రాబల్యం కలిగిన చోడవరం ప్రాంతాన్ని ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఓ దశలో పోలీస్‌ కమిషనరేట్‌కే వెళ్లి లొంగిపోవాలని భావించినట్టు తెలిసింది. ఆ మేరకు 1989 బ్యాచ్‌కు చెందిన కొంతమంది రవిబాబు సహచరులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఉన్నతస్థాయి అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోవడం కంటే తాను గతంలో పనిచేసిన, తనకు పరిచయాలు ఎక్కువగా ఉన్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే లొంగిపోతే బెటర్‌ అనే అభిప్రాయానికి వచ్చి చోడవరం ఎంచుకున్నట్టు సమాచారం.

రౌడీ షీటర్‌ గేదెల రాజు హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్‌ వేశారా? ఈ హత్యలో ఎ–1గా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు తన బినామీలతో కలిసి అందుకే అక్కడికి వెళ్లారా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం లభించినట్టు పోలీసువర్గాల సమాచారం. గేదెల రాజు హత్య కేసులో అనుమానితులను విచారించిన పోలీసులు శుక్రవారం మరోసారి న్యూపోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. ఈ విచారణకు హాజరైన ఒక రెస్టారెంట్‌ నిర్వాహకుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాచారం ప్రకారం... డీఎస్సీ రవిబాబు తన ప్రియురాలు పద్మలతను హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తనకు బకాయి నగదును ఇవ్వాలంటూ గేదెల రాజు తరచూ గొడవ పడేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే హత్య విషయం బహిర్గతం చేస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఇది తనకు ప్రమాదకరమని భావించిన రవిబాబు గాజువాకలోని తన బినామీల ద్వారా గేదెల రాజుతో సఖ్యతకు విఫలయత్నం చేశాడు.

బ్యాంకాక్‌లో ఏం జరిగింది..
రవిబాబు బృందం గాజువాకలోని తన బినామీలు, అనుచరులతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లారు. ఆ టూర్‌కు గేదెల రాజును కూడా ఆహ్వానించినప్పటికీ అతడు వెళ్లలేదు. గేదెల రాజు బ్యాంకాక్‌ వస్తే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, వీలుకాకపోతే అంతమొందించాలన్న ఆలోచనతోనే అతడిని కూడా ఆహ్వానించామని రెస్టారెంట్‌ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ పథకం వేసినట్టు విచారణాధికారులకు వివరించాడు. బ్యాంకాక్‌లో బినామీలందరితోను చర్చించిన తరువాత గేదెల రాజును వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

తిరిగి ఇక్కడికి వచ్చిన తరువాత తమ నిర్ణయాన్ని క్షత్రియభేరి పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజుకు వివరించడంతో ఆ సహాయం తానే చేస్తానని భరోసా ఇచ్చారని, అందుకే రవిబాబు తన ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కును ఆయనకు ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. చెక్కు ఇచ్చిన తరువాత కూడా చినగంట్యాడకు చెందిన ఒక బార్‌ నిర్వాహకుడి ద్వారా గేదెల రాజుతో చర్చలు జరిగినట్టు సమాచారం. గేదెల రాజు హత్య జరగానికి వారం రోజుల ముందు తన బార్‌కు సమీపంలోనే ఆ బార్‌ నిర్వాహకుడు ఒక కారులో గంటపాటు గేదెల రాజుతో చర్చించినట్టు సమాచారం. వారిమధ్య ఏ సంభాషణ వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బార్‌ యజమాని గతంలో లారీ క్లీనర్‌ అని, రవిబాబుకు బినామీగా మారిన తరువాత వ్యాపారాలు మొదలు పెట్టాడని రెస్టారెంట్‌ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం.

రూ.10 లక్షల చెక్కు సీజ్‌...
గేదెల రాజు హత్య కోసం రవిబాబు ఇచ్చిన రూ.10 లక్షల చెక్కును విచారణాధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కె.రమణ, శ్రీనివాస్‌ల సమక్షంలో పోలీసు అధికారులు చెక్కును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఇచ్చిన చెక్కును భూపతిరాజు శ్రీనివాసరాజు ఒక ఫైనాన్షియర్‌కు ఇచ్చి తొలుత రూ.4 లక్షలను తీసుకున్నట్టు సమాచారం. ఆ నగదునే కిల్లర్లకు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫైనాన్షియర్‌ నుంచి చెక్కును స్వాధీనం చేసుకున్నారు.

మీడియా ముందుకు నిందితుడు రవిబాబు
కాగా హత్యకేసులో  ఏ1 రవిబాబును శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ రవికుమార్‌ మూర్తి ...హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. గేదెల రాజును కిరాయి రౌడీలతో రవిబాబు హత్య చేయించారని తెలిపారు. రవిబాబు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. భూపతిరాజుతో కలిసి గేదెల రాజు హత్యకు పథకం రచించారని, అలాగే పోలీసుల వివరాలు, రవిబాబు చెప్పిన వివరాలు సరిపోలాయన్నారు. అనంతరం రవిబాబును కోర్టులో ప్రవేశపెట్టారు.

ఏ2 నిందితుడు ఎక్కడ?
కాగా ఏ2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం కిందటే అతన్ని పట్టుకున్న పోలీసులు రెండురోజుల క్రితం వరకు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో, తర్వాత హార్బర్‌ స్టేషన్‌లో ఉంచి తమదైన శైలిలో విచారణ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హత్య కేసులో దాసరి రవిబాబుది తెర వెనుక పాత్రే కానీ.. భూపతిరాజు పాత్ర మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. హత్యా పథకం అమలు చేసింది మొదలు.. హత్యకు తన క్షత్రియభేరి కార్యాలయాన్ని, సిబ్బందిని వినియోగించడం, సాక్ష్యాధారాలను రూపుమాపడానికి యత్నించడం వంటి కేసులన్నీ భూపతి మెడకు చుట్టుకున్నాయి, ఈ నేపథ్యంలోనే అతను పట్టుబడినా విచారణ పేరిట పోలీసులు గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏ–1 రవిబాబు లొంగిపోవడంతో ఏ2 భూపతిరాజును కూడా నేడో రేపో పోలీసులు తెర ముందుకు తీసుకు వచ్చే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement