బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రవిబాబు
సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేశారు
హామీలు అమలు చేతకాక ఆరు నెలలపాటు బడ్జెట్ జాప్యం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఆకాశమంత ఎత్తున ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను పాతాళానికి తోసేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మండిపడ్డారు. బడ్జెట్‌పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పాల్గొన్న రవిబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 76 స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పూర్తిస్థాయి బడ్టెట్ కూడా పెట్టలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం మార్చివేసిందన్నారు.
ఎన్నికల ముందు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అంటే... రూ.11లక్షల కోట్లు అప్పు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పించారని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.6.46లక్షల కోట్లు అని తేల్చారని, చంద్రబాబు నిజాయతీ ఇదేనా? అని నిలదీశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నాడు–నేడు ద్వారా రూ.32వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని, రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని మెగా డీఎస్సీ ఇస్తున్నామని, రిలయన్స్, టీసీఎస్ వంటి సంస్థలను తెస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
సభ్యులు మాట్లాడుతుండగా మధ్యలో మంత్రులు అడ్డుతగలడం సరికాదని, అన్ని వివరాలు నోట్ చేసుకుని చివరిలో సమాధానం ఇవ్వాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హితవుపలికారు. అనంతర రవిబాబు ప్రసంగం కొనసాగిస్తూ ఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్‌లో చూపించిన దానికి పొంతన లేదని తప్పుబట్టారు. అనంతరం టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment