టెక్కలి,న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ కోళ చంద్రరావు హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు దీన్ని బలపరుస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 20వ తేదీన టెక్కలికి చెందిన రౌడీ షీటర్ చంద్రరావు దారుణహత్యకు గురయ్యారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్, ట్రైనీ డీఎస్పీ శ్రీలక్ష్మి, అప్పటి టెక్కలి సీఐ ఎం.రాంబాబు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించి కొంతమంది నిందితులను అరెస్ట్ చేయడం.. వారంతా బెయిల్‌పై బయటకు రావడం చకచక జరిగిపోయాయి. సుమారు ఆరు నెలల తరువాత ఈ హత్య కేసులో నిందితునిగా ఉన్న పీత రాము ఈ నెల ఐదో తేదీన టెక్కలిలో మీడియా ముందు ప్రతక్షమై తనకు కొంతమంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.
అక్కడితో ఆగకుండా స్థానికంగా పలుకుబడి ఉన్న ఐదుగురి పేర్లను సైతం చెప్పడంతో పాటు.. వారిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రరావు హత్య రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో జరిగిందా? లేక ల్యాండ్ మాఫియాలో చోటు చేసుకున్న వివాదాలతో జరిగిందా అనే కీలక అంశాలపై గత ఏడాది నవంబర్ 22వ తేదీన సాక్షిలో ప్రచురించిన ‘రౌడీ షీటర్ హత్య వెనుక ల్యాండ్ మాఫియా హస్తం’ అనే కథనంపై పట్టణంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సాక్షి కథనం ఆధారంగా పోలీస్ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కోళ చంద్రరావు హత్యపై తెర వెనుక ఉన్న కొంత మందిపై అప్పటి నుంచి నిఘా వేశారు. సుమారు 6 నెలల తరువాత ఈ హత్య విషయమై కీలకమైన మలుపులు తెర మీద కనిపిస్తున్నాయి. నిందితుడు రాము చేసిన ప్రకటనతో చంద్రరావు హత్య వెనుక ల్యాండ్ మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందికి ముచ్చెటమలు పడుతున్నాయి.
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో..
చంద్రరావు హత్యకేసులో నిందితుడైన పీత రాము తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతోపాటు స్థానికంగా పలుకుబడి ఉన్న ఐదుగురి పేర్లతో డీజీపీకు ఫిర్యాదు చేయడంతో, ఈ హత్యకేసుపు పూర్తి స్థాయి దృష్టి సారించాలని ఆయా ఉన్నతాధికారుల నుంచి స్థాయిక పోలీస్ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ హత్య వెనుక హస్తం ఉన్న వారిపై డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు నిఘా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు భోగట్టా.
దోషులను పట్టించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు!
చంద్రరావు హత్య తెర వెనుక ఉన్న ల్యాండ్ మాఫియా ముఠా సభ్యులను పూర్తి ఆధారాలతో పోలీసులకు అప్పగించేందుకు టెక్కలికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా హత్య జరిగిన నుంచి నేటి వరకు కీలకమైన ఆధారాలు సేకరించి పోలీస్ ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ఆధారాలు సేకరించిన విషయం తెలుసుకున్న ల్యాండ్ మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠా సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నట్లు భోగట్టా.
తెరపైకి రౌడీ షీటర్ హత్య కేసు !
Published Mon, May 12 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement