
సీసీ టీవీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యం. ఇన్‌సెట్‌లో వాసు(ఫైల్)
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39) అలియాస్ వాసును నలుగురు దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. అరండల్ పేట 12వ లైన్‌లో ఆది వారం రాత్రి సుమారు 8–26 గంటలకు అంతా చూస్తుండగా నడి రోడ్డుపై వాసును హతమార్చారు. గుంటూరులోని విద్యానగర్ 4వ లైన్‌లో నివాసం ఉంటున్న వాసు మరి కొందరితో కలసి ఆదివారం రాత్రి అరండల్‌పేట 12వ లైన్‌లో ఉన్న అన్వర్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లాడు.
బిర్యానీ తిని తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకిరి నాగ చైతన్యతో కలసి బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు వాసుపైన దాడి చేసి కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపారు. ముందుగా ఏపీ16ఏఈ 9199 నంబర్ స్కార్పియో వాహ నంతో వాసును ఢీకొట్టి.. అతను కిందపడ్డ తర్వాత అతి కిరాతకంగా 30 సెకన్లలో నలుగురు దుండగులు కలసి 30 సార్లు నరికి హతమార్చారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు.
వాసు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ దుండగులు అదే స్కార్పియోలో పరారయ్యారు. ఆదివారం రద్దీగా ఉండే అరండల్‌పేటలో దుండగులు వాసును హత్య చేశారంటే పక్కా పథకం ప్రకారం అక్కడకి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment