‘కట్ట’లు తెంచుకున్నాయ్‌! | Money And Alcohol Gifts Distributing in Nalgonda | Sakshi
Sakshi News home page

‘కట్ట’లు తెంచుకున్నాయ్‌!

Published Wed, Jan 22 2020 11:52 AM | Last Updated on Wed, Jan 22 2020 11:52 AM

Money And Alcohol Gifts Distributing in Nalgonda - Sakshi

మిర్యాలగూడలోని ఓ ఓటరుకు కవర్‌లో పెట్టి ఇచ్చిన నగదు

సాక్షి నెట్‌వర్క్‌,నల్లగొండ : ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చివరి అస్త్రంగా అడ్డూఅదుపు లేకుండా తాయిలాలు చెల్లించేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం, బియ్యం, కిరాణ సరుకులు వెండి, బంగారు ఆభరణాలు పంపిణీ చేశారు. సోమ,  మంగళవారాల్లో పోటీపోటాగా నగదు పంపిణీ చేయగా, బుధవారం కూడా ఈ ‘పంచు డు’ కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో గంటగంటకూ ఓటు రేటు పెంచుకుంటూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక పార్టీ అభ్యర్థి ఓ టుకు ఇంత అని ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి దానికి కొంత కలిపి ఎక్కువ ముట్టజెబుతున్నాడు. చండూరులోని ఓ వార్డులో ఓటుకు ఏకంగా రూ.15వేల దాకా చెల్లిస్తుండడం గమనార్హం.

నీలగిరి మున్సిపాలిటీలో అభ్యర్థులు పోటా, పోటీగా డబ్బుల పంపిణీ చేశారు. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు బీజేపీలోని కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు. వన్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి.. ప్రత్యర్థికి చెందిన అనుకూల ఓటర్లకు రూ.1500 చొప్పున పంపిణీ చేసినట్లు ఓటర్లే చెబుతున్నారు. టూటౌన్‌ ప్రాంతంలోని ఓ వార్డులో రూ.1500 నుంచి రూ.2 వేలు, ఆఫ్‌ బాటిల్‌ మందు పంపిణీ చేసినట్లు తెలిసింది.  

మిర్యాలగూడలో కొన్ని వార్డులలో ఓటు రేటు అమాంతం పెరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంచాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అనుకున్నారు. కానీ గెలుపే లక్ష్యంగా ఒక్కసారిగా రేటు పెంచారు. పట్టణంలోని ప్రధానంగా పోటీ ఉన్న వార్డులలో ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసినవి కాకుండా పోలింగ్‌కు వెళ్లే ముందు కూడా మళ్లీ ఇస్తామని హామీ ఇస్తున్నారు.

దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి ఓటుకు రేటు బాగా పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా మరీ కీలక వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు వెదజల్లుతున్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో ఓటుకి సు మారు రూ.7వేల వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. సోమవారం నాటికే ఎక్కువ శాతం ఓటర్లకు డబ్బులు చేరాయి.

చండూరు మున్సిపల్‌ ఎన్నికలు మరీ కాస్ట్‌లీ అయ్యాయి. ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్‌ రేసులో ఉన్న అభ్యర్థులు  అడుగు ముందుకేసీ ఓటుకు రూ.15వేలకు పైగా ఇస్తున్నా రు. ఇవేగాకుండా బియ్యం బస్తాలు, మద్యం, మహిళలకు చీరలు తదితర వస్తువులు అందించినట్లు తెలుస్తోంది.

హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఓటు విలువను రూ. 7వేల వరకు పెంచారు. మంగళవారం పలు వార్డుల్లో ఓటుకు రూ.2వేలు, మరికొందరికి రూ. 2500 నుంచి రూ. 7వేల వరకు డబ్బులు పంపిణీ చేశారు. వీటితోపాటు చీరలు, మద్యాన్ని క్వార్టర్‌నుంచి పుల్‌ బాటిల్‌ వరకు మద్యం పంపిణీ చేశారు.

నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో ఓటరుకు రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు  పంపిణీ చేయడంతో పాటు చీరలు, మద్యాన్ని ముట్టజెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement