సాక్షి, నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌తో చేసుకున్న లోపాయి కారి ఒప్పందం అమలుకాక పోగా.. బీజేపీ నవ్వులపాలైంది. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఇవ్వకుండా బీజేపీకి మొండిచేయి చూపింది. దాంతో ముందుగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కాషాయ నేతలకు ఇప్పుడు ‘గులాబీ’ నేతలు ముల్లు గుచ్చారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన అబ్బగోని రమేష్ గౌడ్‌ను సభ్యులు సోమవారం ఎనుకున్నారు.
టీఆర్‌ఎస్-బీజేపీ ఓ వైస్ చైర్మన్..!
నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం ఇక్కడ 48 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 20 స్థానాల్లో గెలవగా, బీజేపీ 6 స్థానాలు, ఇండిపెండెంట్ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే బీజేపీ కీలకమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అని ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అయితే, వైస్ చైర్మన్ పదవిని తామే ఇస్తామన్న టీఆర్‌ఎస్ బీజేపీని తమవైపునకు తిప్పుకోవడంలో సఫలం అయింది. టీఆర్ఎస్ హామీతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున బీజేపీ తటస్థంగా వ్యవహరించింది.
ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో టీఆర్‌ఎస్ బలం బలం 22కు చేరగా.. ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటుతో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపు రెడ్డి ఓట్లతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చివరికి వైఎస్ చైర్మన్ పదవిని కూడా అధికార పార్టీ దక్కించుకోవడంతో బీజేపీకి మొండి చేయ్యి మిగిలింది. వైస్ చైర్మన్ పదవికి సంబంధించి టీఆర్‌ఎస్ నేతలు పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినా వారు అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాషాయ నేతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాం..
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా వెళ్లామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నల్గొండలో బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇక్కడికి కేసీఆర్ వస్తారని తెలిపారు. సెక్యులర్ పార్టీగా టీఆర్‌ఎస్ ఒక రాజకీయ విధానంతో ముందుకు వెళ్తోందని అన్నారు. నల్గొండలో మంచి పాలన చూపిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment