సాక్షి ప్రతినిధి, నల్లగొండ మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీల్లో మట్టి కరిపించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా ఆయా పార్టీలు జట్టు కట్టాయి. ఒక్క హుజూర్‌నగర్ నగర పంచాయతీలో మినహా కాంగ్రెస్ ఎక్కడా ఎవరితో స్థానిక అవగాహనకు పోలేదు. ఇక్కడ కాంగ్రెస్ సీపీఐతో అవగాహన కుదుర్చుకుంది. కోదాడలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలూ ఏకమయ్యాయి. సూర్యాపేటలో టీఆర్‌ఎస్, సీపీఐలు కలిసి పోటీ చేస్తున్నాయి. మిర్యాలగూడలో సీపీఎం, టీడీపీలు జట్టుగా ఉన్నాయి. భువనగిరిలో పార్టీలన్నీ వేర్వేరుగానే పోటీలో ఉన్నాయి. కాగా, జిల్లా కేంద్రమైన నల్లగొండలో మాత్రం కొన్ని వార్డుల్లో బీజేపీ, టీడీపీలు అవగాహనకు వచ్చాయి. ఇంకోవైపు టీఆర్‌ఎస్ మున్సిపాలి టీల్లో తమ ముద్ర వేసేందుకు పూర్తి స్థాయిలో కాకున్నా, మెజారిటీ వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
నల్లగొండ నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ఒంటిరిగానే తలపడుతోంది. పలుచోట్ల సీపీఎం, టీఆర్‌ఎస్ అవగాహన కుదుర్చుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం పలు వార్డుల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ 30 వార్డుల్లో సొంతంగా పోటీ చేస్తూ మిగిలిన స్థానాల్లో బీజేపీకి, బీజేపీఅభ్యర్థులు లేని వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపింది. బీజేపీ 18 వార్డుల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ పోటీ చేస్తున్న వార్డుల్లో ఆ పార్టీకి, మిగిలిన వార్డుల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతోంది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ కూడా కొన్ని వార్డుల్లో అవగాహనతో పోటీలో ఉన్నాయి. అయితే, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇతర పార్టీలు ఛైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవాలంటే ఫలితాల తర్వాత కచ్చితంగా తిరిగి అవగాహనకు వచ్చి ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాగా, కాంగ్రెస్ గుమ్మల జానకిని తమ ఛైర్‌పర్సన్ అభ్యర్థినిగా ప్రచారంలోకి తెచ్చింది.
భువనగిరి
భువనగిరి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 20వ వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో 29 వార్డుల్లోనే ఇక్కడ ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్- 27 , టీడీపీ- 27, టీఆర్‌ఎస్- 22, బీజేపీ- 18, సీపీఎం- 5, ఆర్‌ఎల్‌డీ-2, ఎంఐఎం- 2, సీపీఐ- 1 వార్డులో పోటీలో ఉన్నాయి. 3 వార్డులో కాంగ్రెస్, ఇండిపెండెంట్ మధ్యన హోరాహోరీ పోరు జరుగుతోంది. 1నుంచి 10 వార్డుల వరకు కాంగ్రెస్, టీడీపీల మధ్యన ప్రధాన పోటీ జరుగుతోంది. 4వ వార్డులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల మధ్యన పోటీ ఉంది. 5 వార్డులో కాంగ్రెస్, ఇండిపెండెంట్ (కాంగ్రెస్ రెబల్) టీడీపీ మధ్య పోటీనెలకొంది. ఇకపోతే 11 నుంచి 20 వార్డుల వరకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మధ్య గట్టి పోటీ ఉంది. 21 నుంచి 30 వార్డులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ నెలకొంది. 4, 30. 29 వార్డులలో టీఆర్‌ఎస్, 25వ వార్డులో సీపీఎం గట్టిపోటీ ఇస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లవరకు ముందంజలో ఉంది. టీడీపీ 5నుంచి 8 వార్డుల్లో , టీఆర్‌ఎస్ 2 నుంచి 4 వార్డుల్లో , బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
మిర్యాలగూడ
మిర్యాలగూడ మున్సిపాలిటీలో 36 వార్డులకుగాను 13వ వార్డును కాంగ్రెస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. దీంతో 35 వార్డులకు ఎన్నిక జరుగుతోంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు 29 వార్డుల్లో, సీపీఎం 25 వార్డుల్లో, టీడీపీ 23, బీజేపీ 11, వైఎస్‌ఆర్ సీపీ ఒక వార్డులో పోటీ ఉంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక టీడీపీ - సీపీఎం మధ్య అవగాహన కుదిరింది. ఇరు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తమ ఛైర్‌పర్సన్ అభ్యర్థినిగా పోకల పద్మను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ వారు ఎవరినీ ప్రకటించలేదు. అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీడీపీ, సీపీఎంలకు చెందిన అభ్యర్థులు ఒక్కో వార్డులో ఇద్దరిద్దరు చొప్పున బరిలో ఉండడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
సూర్యాపేట
సూర్యాపేటలో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. టీఆర్‌ఎస్.. సీపీఐతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ.. సీపీఎంతో పొత్తు కుదుర్చుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పది వార్డుల్లో పోటీ పడుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఛైర్‌పర్సన్ పోటీలో ఒంటరిగా నిలిచే అవకాశం ఎవరికీ కనిపించడంలేదు. ఏ పార్టీ సింగిల్‌గా పది వార్డులు మించి గెలుపొందే అవకాశాలు లేవు.
కోదాడ
కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే మొత్తం 30వార్డుల్లో పోటీలో ఉంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారి వంటిపులి గోపయ్య కోడలికి చైర్‌పర్సన్ పదవిని కాంగ్రెస్ ప్రకటించింది. టీఆర్‌ఎస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. వీటి ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్, సీపీయం, బీజేపీ, టీడీపీలు స్థానిక అవసరాల రీత్యా అవగాహనకు వచ్చి పోటీలోకి దిగాయి. ఈ నాలుగు పార్టీలు కలిసి దాదాపు 18 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10వార్డుల్లో, ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గట్టిపోటీని ఇస్తున్నారు.
హోరెత్తిన పురపోరు
Published Fri, Mar 28 2014 1:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement