విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్
సాక్షి, సూర్యాపేట : శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఓ అంకెల గారడీ అని డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రూ. 1.2లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం నేడు సుమారు రూ. 36లక్షల కోట్ల బడ్జెట్ తగ్గించి సంక్షేమ పథకాల్లో ప్రజలకు కోత విధించేదిలా ఉందన్నారు. బడ్జెట్ కుందించడమంటే సంక్షేమ పథకాలను ఆటకెక్కించడానికే అనడానికి నిదర్శనమన్నారు.
తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆనాడు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నాయకత్వంలో పోరాడి రెండో దశ కాల్వలకు నాటి రైతాంగానికి శ్రీరాంసాగర్ జలాలను కాల్వల ద్వారా విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో 2 లక్షల 50వేల ఎకరాలకు శ్రీరాంసాగర్ రెండో దశ కాల్వల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంద న్నారు. రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాల బారినపడి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆసుపత్రులను సందర్శించి రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వల్లనే ఆసుపత్రిని మంగళవారం రాష్ట్ర మంత్రులు సందర్శించారని తెలిపారు.
ఈనెల 13న టీపీసీసీ పిలుపుమేరకు రైతుబంధు, రైతురుణమాఫీ చేయకుండా ప్రభుత్వం చేపడుతున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, నాయకులు ధరావత్ వీరన్ననాయక్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బంటు చొక్కయ్య, నరేందర్‌నాయుడు, నాగుల వాసు, ఆలేటి మాణిక్యం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment