
వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక కోసం చేతులు ఎత్తిన కౌన్సిలర్లు
సిరిసిల్ల, వేములవాడ కొత్త మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువు దీరాయి. రెండు పురపాలికల్లోనూ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పీఠాలను టీఆర్‌ఎస్ దక్కించుకుంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ ఏకగ్రీవం కాగా, వైస్‌చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మ విజయం సాధించారు. సిరిసిల్లలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొత్తపాలకవర్గాలతో పదవీప్రమాణ స్వీకారం చేయించారు.
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌లో 39 స్థానాలు ఉండగా.. 22 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించి పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది.
కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం..
సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారితో ఆర్డీవో, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 10 గంటలకే అధికార టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు జరిగిన సమావేశానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అ బ్దుల్ అజీమ్ హాజరయ్యారు. వారిసమక్షంలో ఆర్డీవో తెలుగు అక్షర మాల క్రమంలో మెజార్టీ సాధించిన జాతీయ పార్టీల అభ్యర్థులకు తొలిఅవకాశం కల్పించారు. గూడూరి భాస్కర్ తొలుత కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన చొప్పదండి లలిత చి వరగా ప్రమాణ స్వీకారం చేశారు. సీమా బేగం, దూస వినయ్ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చే యగా.. మిగతా 37 మంది కౌన్సిలర్లు తెలుగులోనే కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేకమంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చే స్తూ.. ఉచ్ఛరణ దోషాలతో ఇబ్బందులు పడగా.. ఆర్డీవో శ్రీనివాస్‌రావు కవర్ చేస్తూ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
చైర్‌పర్సన్ ఏకగ్రీవం.. వైస్ చైర్మన్‌కు పోటీ..
కౌన్సిల్ 12.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చై ర్మన్ ఎన్నికకు మళ్లీ సమావేశమైంది. టీఆర్‌ఎస్ విప్ జారీ చేసిందని, మిగతా పార్టీల నుంచి తమకు విప్ రాలేదని ఆర్డీవో ప్రకటించారు. చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. చైర్‌పర్సన్‌గా జిందం కళ పేరును దార్ల కీర్తన ప్రతిపాదించగా.. అన్నారం శ్రీనివాస్ బలపరిచారు. పోటీ లేక జిందం కళ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. వైస్‌చైర్మన్ స్థానానికి మంచె శ్రీనివాస్ పేరును గడ్డం లత ప్రతిపాదించగా.. భూక్యా రెడ్డినాయక్ బలపరిచారు. వైస్‌చైర్మన్ స్థానానికి బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజు పేరును గూడూరి భాస్కర్ ప్రతిపాదించగా.. చెన్నమనేని కీర్తి బలపరిచారు.
మూజువాణి(చేతులెత్తే) విధానంలో ఎన్నికలు జరుగుతాయని ఆర్డీవో ప్రకటించారు. ముందుగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచె శ్రీనివాస్ కు మద్దతుగా 34 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజుకు మద్దతుగా ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు తటస్థంగా ఉన్నారు. మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో మంచె శ్రీనివాస్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక అయినట్లు ఆర్డీవో శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.
కౌన్సిల్‌కు శుభాకాంక్షలు..
సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్‌కు కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అబ్దుల్ అజీమ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించారు. చైర్‌పర్సన్ జిందం కళకు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్‌కు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్‌ఎస్ నాయకుల నుంచి శుభాకాంక్షలు లభించాయి.
టీఆర్‌ఎస్ నాయకుల పర్యవేక్షణలో..
కౌన్సిల్ ప్రమాణ స్వీకారం టీఆర్‌ఎస్ నాయకుల పర్యవేక్షణలో సాగింది. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జనగామ శరత్‌రావు, కుంబాల మల్లారెడ్డి, జిందం చక్రపాణి మున్సిపల్ కార్యాలయంలో ఉండి ప్రమాణ స్వీకారాన్ని పర్యవేక్షించారు. సిరిసిల్లలో రెండోసారి టీఆర్‌ఎస్ పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది.
పటిష్టమైన పోలీస్ రక్షణ..
మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు వెంకటనర్సయ్య, సర్వర్, ఐదుగురు ఎస్సైల పర్యవేక్షణలో 50 మంది పోలీసులు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిరిసిల్ల–సిద్దిపేట రహదారిని దిగ్బంధించిన పోలీసులు.. తర్వాత ఒకవైపు వాహనాలు నియంత్రించారు. మొత్తంగా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది.
వేములవాడ చైర్‌పర్సన్‌గా మాధవి
వేములవాడ: వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి వారి ఎన్నికతోపాటు కౌన్సిలర్ల పదవీ ప్రమాణ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. మొత్తం 28 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవమైంది. 27 స్థానాలకు పోలింగ్ నిర్వహించి ఈనెల 25న ఓట్లు లెక్కించారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో శిబిరంలో ఉన్న కౌన్సిలన్లు.. సోమవారం ఉదయం నేరుగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక బస్‌లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జెడ్పీ సీఈవో కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 28వ వార్డు నుంచి గెలుపొందిన ప్రతాప హిమబిందు గైర్హాజరయ్యారు.
టీఆర్‌ఎస్ విప్ జారీ చేసిందని, ధిక్కరించినవారి సభ్యత్వం రద్దవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ల ఎంపిక చేపట్టారు. ఈలోగా లభించిన కాస్త సమయంలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మంతనాలు జరిపారు. చివరిక్షణం వరకు చైర్‌పర్సన్ ఎవరననేది తెలియలేదు. ఆఖరి క్షణంలో రామతీర్థపు మాధవిని చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మను ఎన్నుకోవాలని సూచించినట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి పేరును గోలి మహేశ్ ప్రతిపాదించగా, నరాల శేఖర్ బలపరిచారు. వైస్‌చైర్మన్ మధు రాజేంద్రశర్మను ఇప్పపూల అజయ్ ప్రతిపాదించగా, నిమ్మశెట్టి విజయ్ బలపరిచారు. మాధవికి 22 ఓట్లు, రాజేంద్రశర్మకు 23 ఓట్లు వచ్చాయి.
వీరు ఎన్నికైనట్లు జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి ప్రకటించారు. చైర్‌పర్సన్‌కు 16 మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లు.. మొత్తం 22 ఓట్లు వచ్చాయి. వైస్‌చైర్మన్‌కు 16 మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్ హన్మవ్వ సైతం చేతులెత్తి ఓటేశారు. వైస్‌చైర్మన్‌కు 23 ఓట్లు వచ్చినట్లు సీఈవో ప్రకటించారు. రెండు సీట్లకు బీజేపీ పోటీ చేసింది. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్లకు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు.
ఎమ్మెల్యేకు పాదాభివందనం చేసిన చైర్‌పర్సన్
పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్లను ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణలు సన్మానించారు. రామతీర్థపు మాధవి ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు పాదాభివందనం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి వారితో కలసి నృత్యం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment