సూర్యాపేట జిల్లా కలెక్టర్ బదిలీ | Suryapet Collector Amoy Kumar Transferred | Sakshi
Sakshi News home page

సూర్యాపేట జిల్లా కలెక్టర్ బదిలీ

Published Mon, Jan 27 2020 8:56 PM | Last Updated on Tue, Jan 28 2020 10:34 AM

Suryapet Collector Amoy Kumar Transferred - Sakshi

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ కుమార్‌పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కి సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు  అప్పగించారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించి, తర్వాత నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేసింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో స్పందించిన ఎన్నికల సంఘం సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసి, కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పించింది. అమేయ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వం నేరేడుచర్ల మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసింది. కాగా అమయ్‌కుమార్‌ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా 2018 డిసెంబర్‌ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానిక సంస్థలు, ఎంపీ, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు.  కేవీపీ ఓటు వివాదం నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక​ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: నేరేడుచర్లలో ఉత్కంఠ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement