సీల్డ్‌ కవర్‌లో ఆమె పేరు! | SC Women Elected As Municipal Chair Person In Suryapet | Sakshi
Sakshi News home page

ఈ మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయం

Published Tue, Jan 28 2020 11:23 AM | Last Updated on Tue, Jan 28 2020 11:23 AM

SC Women Elected As Municipal Chair Person In Suryapet - Sakshi

భావోద్వేగానికి గురైన మంత్రి జగదీశ్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ

సాక్షి, సూర్యాపేట: నాలుగు మున్సిపాలటీలు గులాబీ ఖాతాలో చేరాయి. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే సూర్యాపేటలో జనరల్‌ మహిళకు రిజర్వు అయిన చైర్మన్‌ పీఠంలో ఎస్సీ మహిళను కూర్చోబెట్టి టీఆర్‌ఎస్‌ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ఎక్కడా ప్రకటించకుండా గోప్యత పాటించి సీల్డ్‌ కవర్లలో ఆపార్టీ నాలుగు మున్సిపాలిటీల ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేసింది. మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరండంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నాయి.

ఊహలకు అందకుండా..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఏలిక ఎవరోనని ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. జనరల్‌ మహిళకు రిజర్వు కావడం.. పలువురి పేర్లు చర్చకు రావడంతో పాటు వారు చైర్మన్‌ పీఠం దక్కించుకుంటారని జోరుగా చర్చలు సాగాయి. అయితే అందరి ఊహలకు అందకుండా చైర్మన్‌ ఎన్నిక కావడం గమనార్హం. 9వ వార్డు నుంచి విజయం సాధించిన పెరుమాళ్ల అన్నపూర్ణ పేరు సీల్డ్‌ కవర్‌లో పీఓకు అందింది. అమెను ప్రతిపాదించడం, బలపరచడం, సభ్యుల ఓట్ల మద్దతుతో.. చైర్మన్‌గా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌ వార్డు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే జనరల్‌ మహిళా స్థానంలో చైర్మన్‌గా అవకాశం కల్పించడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయానికి ఇది దిక్సూచి అవుతుందని మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళ్లు చమర్చారు. అన్నపూర్ణ 9 వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కుందమల్ల శేఖర్‌పై 374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా 22వ వార్డు నుంచి గెలిచిన పుట్టా కిశోర్‌ విజయం సాధించారు. 24 మంది వార్డు సభ్యులు, మంత్రి ఎక్స్‌ అఫీషియో ఓటు, ముగ్గురు ఇండిపెండెంట్‌ వార్డు సభ్యుల మద్దతుతో అన్నపూర్ణ చైర్మన్‌గా, కిశోర్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.


పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికలో చేతులెత్తిన మంత్రి జగదీశ్‌రెడ్డి, కౌన్సిల్‌ సభ్యులు

గులాబీ రెపరెపలు..
ఆపార్టీ గుర్తుపై గెలిచిన వార్డు సభ్యుల మద్దతుతో తొలిసారి కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఎక్స్‌ అఫీషియో ఓటు, 25 మంది వార్డు సభ్యుల బలంతో టీఆర్‌ఎస్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పీఠాలపై కూర్చుంది. మున్సిపాలిటీలో 2 వ వార్డు నుంచి గెలుపొందిన వనపర్తి శిరీష చైర్మన్‌గా, 23వ వార్డు నుంచి విజయం సాధించిన వెంపటి పద్మ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి శిరీష 833 ఓట్లు, పద్మ 237 ఓట్ల మెజార్టీ సాధించారు. హుజూర్‌నగర్‌ మన్సిపాలిటీలో 20 వార్డులు టీఆర్‌ఎస్‌ గెలవడంతో ఆపార్టీకి చెందిన గెల్లి అర్చనకు చైర్మన్, జక్కుల నాగేశ్వరరావుకు వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి.

ఇక్కడ పార్టీ శ్రేణులు ఊహించిన వారే పుర పీఠంపై కొలువుదీరారు. అర్చన 27వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 761 ఓట్ల మెజార్టీ, నాగేశ్వరరావు 17 వ వార్డు నుంచి 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 11 ఓట్ల బలంతో టీఆర్‌ఎస్‌ నుంచి చైర్‌పర్సన్‌గా పోతరాజు రజిని, వైస్‌ చైర్మన్‌గా సంకేపల్లి రఘునందరెడ్డి ఎన్నికయ్యారు. కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులు సాధించి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆనందంలో ఎమ్మెల్యేలు..
తిరుగు లేని విజయంతో నాలుగు మున్సిపాలిటీల ఏలికలు టీఆర్‌ఎస్‌ పరం కావడంతో ఆపార్టీ ఎమ్మెల్యేల్లో ఆనందం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక అంతా ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. మెజార్టీ వార్డుల్లో గులాబీ జెండా ఎగరడంతో.. ఇక మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెట్టనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉండనుండడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోలోని పనులకు నిధుల వేట జరగనుంది. ఈ ఫలితాలతో మళ్లీ సాధారణ ఎన్నికల నాటికి మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement