కాయ్‌ రాజా కాయ్‌ | Bettings on Municipal Elections Nizamabad | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌

Published Wed, Jan 22 2020 12:41 PM | Last Updated on Wed, Jan 22 2020 12:41 PM

Bettings on Municipal Elections Nizamabad - Sakshi

నిజామాబాద్‌, ఆర్మూర్‌: బల్దియా ఎన్నికలేమో గానీ జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.! అయితే, మున్సిపల్‌ ఎన్నికల్లో అంతా బిజీగా ఉంటే, మరోవైపు బెట్టింగ్‌ రాయుళ్లు కూడా బిజీగా మారారు. ఏ వార్డులో ఎవరు గెలుస్తారనే జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల బల్దియా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. అయితే, అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, విజయావకాశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ఆర్మూర్‌లోని కొత్తబస్టాండ్, అంబేడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాల వద్ద బెట్టింగ్‌ జోరుగా నడుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లా చైన్‌ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్‌లు కడుతున్నారు. జిల్లాతో పాటు ఆర్మూర్‌ ప్రాంతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు, మట్కా జూదం గతంలో విచ్చలవిడిగా సాగిన సందర్భాలున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలే ఎక్కువగా ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపు, ఓటమిలపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం పలాన అభ్యర్థి కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు పందాలు కాస్తున్నారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థుల గెలుపోటములతో పాటు చైర్‌ పర్సన్‌ పీఠాన్ని ఫలానా వ్యక్తి కైవసం చేసుకుంటాడు కావాలంటే బెట్‌ కట్టండి అంటూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైంపాస్‌ వ్యవహారంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement