తీవ్ర గందరగోళం.. చైర్మన్‌ ఎన్నిక వాయిదా..! | TS SEC Orders To Cast Ex Officio Vote MP KVP Ramachandra Rao | Sakshi
Sakshi News home page

తీవ్ర గందరగోళం.. చైర్మన్‌ ఎన్నిక వాయిదా..!

Published Mon, Jan 27 2020 11:33 AM | Last Updated on Mon, Jan 27 2020 2:16 PM

TS SEC Orders To Cast Ex Officio Vote MP KVP Ramachandra Rao - Sakshi

సాక్షి, సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టీఆర్‌ఎస్‌ 7, కాంగ్రెస్‌ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్‌, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్‌ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కేవీపీ రామచందర్‌రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయింది.
(చదవండి : ఉత్కంఠ వీడింది.. మేయర్‌ పీఠం వారిదే..!)

టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్‌ అఫిషియోగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావును ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా దరఖాస్తూ పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్త చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషనర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంప్రదించగా.. ఆయనపై విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్‌ఎస్‌కు 10 మంది బలం ఉండగా..  2 ఎక్స్‌ అఫీషియో ఓట్లు, సీపీఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్‌ సంఖ్యా బలం 10కి చేరింది. ఇరు పార్టీల సంఖ్యా బలం సమానంగా మారడంతో చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవనుంది. 

రేపటికి వాయిదా..!
సాక్షి సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా నడిచింది. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమంతించడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌ను విరగ్గొట్టారు. చేతిలో ఉన్న పేపర్లను చించేశారు. దీంతో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గందరగోళం నేపథ్యంలో చైర్మన్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement