సాక్షి, హుజూర్‌నగర్: ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్‌ఎస్ అభ్యర్థి బెల్లి సత్తయ్య ఎన్నికల్లో తన గెలుపు కోసం ఓ స్వామిజీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన స్వామిజీతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్తయ్య ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇబ్రహీం, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఏర్పుల పరమేశ్‌లను కట్టడి చేయడానికి ఒక తాయత్తు ఇస్తానని, ఆ తాయెత్తు ఉంటే గెలుపు తథ్యమని సదరు స్వామిజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలవడానికి తాను తాయత్తు ఇచ్చానని, ఇప్పటికీ ఆ తాయెత్తు ఆయన వద్ద ఉందని చెప్పారు. తన తాయెత్తుతో గెలిచిన తర్వాత తను అడిగింది ఇవ్వాలని షరతు పెట్టారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఆడియోటేపుపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఈ మూఢనమ్మకాలేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని నమ్మే నేతులు ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఆడియోటేపులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.. ఆయన మెడలో తాయెత్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment