యాదగిరిగుట్టలో చైర్మన్ ఎన్నికకు చేతులెత్తిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్ చైర్మన్‌లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్ చైర్మన్ దక్కింది. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్‌చైర్మన్ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్ చైర్మన్ దక్కింది.
దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్‌గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, చౌటుప్పల్‌లో మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందుండి నడిపించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దిశానిర్దేశంతో క్లీన్ స్వీప్ చేశారు.
క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు
ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించారు. క్యాంపుల్లోనే కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచారు. దీంతో కౌన్సిల్ హాల్ లోకి వచ్చేవరకు ఎవరు చైర్మన్, వైస్‌చైర్మన్ అవుతున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ తరఫున విప్ జారీ చేసి ఎన్నికల అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధికా రులు ప్రకటించిన పేర్లకు మద్దతుగా చేతులెత్తడం ద్వారా తమ సమ్మతిని తెలియజేసి ఎన్నుకున్నారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులను పోటిలో నిలిపింది. సకాలంలో హాజరుకాని బీజేపీ 22 వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేశ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
భువనగిరిలో పోటాపోటీ..
35 వార్డులున్న మున్సిపాలిటీలో టీ ఆర్‌ఎస్ కు ఇండిపెండెంట్లతో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్స్ ఆఫిషియో ఓట్లతో కలిసి టీఆర్‌ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్, బీజేపీల పొత్తుతో వారిబలం 18కి చేరినప్పటికీ బీజేపీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ సకాలంలో హాజరు కాలేదు. దీంతో వారి బలం 17కు పడిపోయింది. టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనబోయిన ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోత్నక్ ప్రమోద్‌కుమార్ పోటీ పడ్డారు. అయితే అంజనేయులకు 19 ఓట్లు రాగా ప్రమోద్‌కుమార్‌కు 17 ఓట్లు వచ్చాయి. దీంతో అంజనేయులు చైర్మన్‌గా గెలుపొందారు. కాగా వైస్ చైర్మన్ కోసం టీఆర్‌ఎస్ తరఫున చింతల కిష్టయ్య, బీజేపీ తరఫున మాయ దశరథ పోటీ పడ్డారు. అయితే చైర్మన్ తరహాలోనే టీఆర్‌ఎస్ విజయం సాధించింది.
ఆలేరులో : 12 వార్డులకు గాను టీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండింపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో బలం 9కి చే రింది. చైర్మన్‌గా వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భూదాన్‌పోచంపల్లిలో: 13 వార్డులకు టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. పూర్తి మెజార్టీ ఉండడంతో టీఆర్‌ఎస్‌కు చెందినచిట్టిపోలు విజయలక్ష్మి చైర్మన్‌గా, బాత్కలింగస్వామి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మోత్కురులో ఏకగ్రీవం: మున్సిపాలిటీలో 12 వార్డులకు టీఆర్‌ఎస్ ఏడుగురు కౌన్సిలర్లను గెలుచుకోగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 8కి చేరింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదు మాత్రమే ఉంది. దీంతో చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ తరఫున తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ తరఫున గుర్రం కవిత పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ నిర్వహించడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి స్వాతి చైర్మన్‌గా విజయం సా«ధించింది. వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం: చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. ఎన్ని కను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు బహిష్కరించారు. 20వార్డులు ఉండగా టీర్‌ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3 ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సా«ధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. అయితే టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్, సీపీఎం పొత్తును నిరసిస్తూ ఎన్నికనుఅడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో ఆయనను పోలీస్‌ల సహయంతో బయటకు పంపించారు. దీంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయకుండానే బయటకువెళ్లిపోయారు. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశంలో టీఆర్‌ఎస్, సీపీఎంలకు చెందిన 11 మంది సభ్యుల కోరం ఉండడంతో చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన వెన్‌రెడ్డిరాజు, వైస్ చైర్మన్‌గా సీపీఎంకు చెందిన బ త్తుల శ్రీశైలంలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.
యాదగిరిగుట్టలో ఉద్రిక్తత నడుమ..
ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్‌అఫిషియో సభ్యుల బలంలో టీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 12 వార్డులకు టీఆర్‌ఎస్ 4 చోట్ల గెలువగా, ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి టీఆర్‌ఎస్ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్‌లతో బలం 7కు చేరింది. టీఆర్‌ఎస్ తరపున చైర్‌పర్సన్‌గా ఎరకల సుధ, కాంగ్రెస్ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాటంరాజు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment