ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు! | Dead man dead body three days in mortuary | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో దారుణం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ‘ఆ నలుగురు’!

Published Tue, Jun 11 2024 10:24 AM | Last Updated on Tue, Jun 11 2024 12:07 PM

Dead man dead body three days in mortuary

యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్‌మాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్‌రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. 

పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. 

ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement