మేయర్లు, చైర్‌ పర్సన్ల ఎంపికపై టీఆర్‌ఎస్‌ కసరత్తు | TRS Exercise On Selection Of Mayors And Chairpersons | Sakshi
Sakshi News home page

మేయర్లు, చైర్‌ పర్సన్ల ఎంపికపై టీఆర్‌ఎస్‌ కసరత్తు

Published Sun, Jan 26 2020 7:29 PM | Last Updated on Sun, Jan 26 2020 7:51 PM

TRS Exercise On Selection Of Mayors And Chairpersons - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పురపాలక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైరపర్సన్ల ఎంపికపైన కసరత్తు చేస్తుంది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు, పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీతో క్షేత్రస్ధాయి పరిస్ధితులపైన తెలంగాణ భవన్ లో సమీక్షించారు.  ఇప్పటికే నూటపదికిపైగా పురపాలికల్లో స్పష్టమైన మేజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ అవకాశం ఉన్న మిగిలిన మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం స్వతంత్రంగా గెలిచిన అభ్యర్ధులపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే స్ధానిక నాయకత్వం వీరితో మాట్లాడుతూ, పార్టీకి మద్దతు కోరుతుంది.

రాబోయే నాలుగు సంత్సరాలపాటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందని, ఈనేపథ్యంలో తమను గెలిపించిన వార్డు ప్రజలకు అభివృద్ది చేసే అవకాశం టీఆర్‌ఎస్‌ ద్వారానే లభిస్తుందన్న విషయాన్ని వారికి వివరిస్తున్నారు. ఇప్పటికే తొంబైశాతం మంది ఇండిపెండెట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని స్ధానిక ఎమ్మెల్యేలు పార్టీకి తెలియజేశారు. దీంతోపాటు పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈమేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నిన్న సాయంత్రం నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా మంత్రులతో స్వయంగా మాట్లాడుతున్నారు.

పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ, జిల్లా ఇంచార్జీలు సైతం ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. స్ధానికంగా పార్టీకి లభించిన కార్పోరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతోపాటు, పురపాలక పీఠానికి కావాల్సిన బలం, అవసరం అయిన ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య వంటి అంశాలపైన చర్చిస్తున్నారు. దీంతోపాటు అయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యులను స్ధానికంగా ఏ ఏ పురపాలక సంఘాలను ఎంచుకోవాలో పార్టీ సూచిస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల, ఒకటి, రెండు ఓట్లు అవసరం అయిన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీకున్న ఎక్స్ అఫీషియో బలం వలన ఇలాంటి పురపాలక సంఘాల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయంగా మారింది.

రేపు జరగనున్న మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. స్ధానిక  ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీకి కనీసం రెండు చొప్పున పేర్లను పంపాల్సిందిగా అదేశించారు. ఈమేరకు ప్రాథమిక జాబితాను సిద్దం చేశారు. జిల్లా ఇంచార్జీలు మున్సిపాలిటీల వారీగా క్రోడీకరించిన జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పరీశీలించారు. స్ధానిక ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు పంపిన జాబితా నుంచి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎంపిక చేస్తారు. పార్టీ నిర్ణయాన్ని రేపు ఉదయంలోగా స్థానిక నాయకత్వానికి తెలియజేస్తుంది. పార్టీ సూచించిన అభ్యర్ధులకే బిఫారాలు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ స్ధానిక నాయకత్వానికి తెలిపింది. ఈ ఎంపికలో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, సామాజిక సమీకరణాలు, స్ధానికంగా పార్టీకి అవసరమైన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement